సంక్షేమంలో సాటి... లాభాల్లో మేటి
ABN, Publish Date - Dec 29 , 2024 | 10:24 PM
సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం... లాభాల లక్ష్య సాధనలో కృషి చేస్తోంది... ఉద్యోగావకాశాలు, పర్యావరణ పరిరక్షణ, వైద్య సదుపాయాలు కల్పిస్తోంది... నూతన విద్యుత్ ప్రాజెక్టుల వైపు దూసుకెళ్తోంది... అయితే గతేడాది కంటే ఈసారి బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడింది.
శ్రీరాంపూర్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం... లాభాల లక్ష్య సాధనలో కృషి చేస్తోంది... ఉద్యోగావకాశాలు, పర్యావరణ పరిరక్షణ, వైద్య సదుపాయాలు కల్పిస్తోంది... నూతన విద్యుత్ ప్రాజెక్టుల వైపు దూసుకెళ్తోంది... అయితే గతేడాది కంటే ఈసారి బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడింది.
రిటైర్ అయిన కార్మికులకు సీపీఆర్‌ఎంఎస్ పథకంలో భాగంగా 9 వేల 78 మెడికల్ కార్డులు జారీ చేశారు. వీటి ద్వారా ఆయా కుటుంబాలు వైద్య సదుపాయం పొందుతున్నాయి. ఉద్యోగులకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. పరీక్షలు నిర్వహించేందుకు ఏరియాలోని ఆర్‌కే 8, నస్పూర్ డిస్పెన్షరీలలో అధునాతన పరికరాలు ఏర్పాటు చేశారు. మహిళలకు కేన్సర్ అవగాహన శిబిరాలు, నిర్ధారణ, నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆర్‌కే 8 డిస్పెన్షరీలో ఫిజియోథెరపీ సెంటర్ ఏర్పాటు చేసి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఫిజియోథెరపీ సేవలందిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. భవిష్యత్తులో వారికి అవసరమైన వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్‌వో ప్లాంట్ల ద్వారా కార్మికుల కుటుంబాలకు తాగునీరు అందిస్తున్నారు. సూపర్‌బజార్ల ద్వారా గ్యాస్, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు.
ఉద్యోగావకాశాలు
ఈ ఏడాదిలో పర్సనల్ విభాగం ద్వారా శ్రీరాంపూర్ ఏరియాలో 3 వేల 578 మంది యువతీ, యువకులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు అందించారు. ఎక్స్‌టర్నల్ నోటిఫికేషన్ల ద్వారా పరీక్షలు నిర్వహించి ఆరుగురు ఫిట్టర్ ట్రైనీ, ఆరుగురు ఎలక్ర్టికల్ ట్రైనీ, ఒక అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ పోస్టులు ఇచ్చారు. ఇటీవల గ్రాడ్యుయేట్ ట్రైనీ(మైనింగ్) అభ్యర్థులు ఎక్స్‌టర్నల్ విధానంలో నియామకం కాగా, శ్రీరాంపూర్ ఏరియాకు 22 మందిని కేటాయించారు. సంస్థలో పనిచేసిన ఉద్యోగి కుటుంబాల వారు ఉద్యోగం వద్దనుకున్నందుకు నియమ, నిబంధనల ప్రకారం 253 మందికి ఏకమొత్తం అందించారు. 15 మందికి ఎంఎంసి(నెల నెలా) డబ్బులు అందించే ఏర్పాట్లు చేశారు.
మహిళా ఉద్యోగులకు సమాన అవకాశాలు
ఏరియాలో 176 మంది మహిళలు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వారి సంక్షేమానికి రెస్ట్‌హాళ్లు ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. మహిళా ఉద్యోగులకు కేటగిరీ కల్పించేందుకు ఇటీవల కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో సర్వే మజ్దూర్, కన్వేయర్ ఆపరేటర్, పంప్ ఆపరేటర్, వాల్వ్ ఆపరేటర్, కుక్, వెండార్, తదితర 16 పోస్టుల కోసం ఆప్షన్లు కోరగా 110 మంది ఎంచుకున్నారు. వారు ఎంచుకున్న ప్రకారం శిక్షణ ఇచ్చి ఉద్యోగ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే 12 మంది మహిళా ఉద్యోగులు ఎస్‌అండ్‌పీసీ విభాగంలో రక్షణ విధులు నిర్వర్తిస్తున్నారు. కార్పొరేట్ కార్యాలయం నుంచి అందిన ఉత్తర్వుల మేరకు మహిళా ఉద్యోగులతో పూర్తిస్థాయిలో ఒక షిఫ్ట్ నడపాలని నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల నియమితులైన గ్రాడ్యుయేట్ ట్రైనీ(మైనింగ్)లలో ముగ్గురు మహిళా అధికారులున్నారు. వారు ఏడాదిపాటు శిక్షణ పొందిన అనంతరం అండర్ మేనేజర్లుగా కొనసాగుతారు.
కాంట్రాక్ట్ కార్మికులకు కొత్త హక్కు
సంస్థకు వచ్చిన లాభాల నుంచి 33శాతం వాటాగా ఉద్యోగులకు 796 కోట్ల రూపాయలు పంపిణీ చేసింది. కంపెనీ చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు సైతం 5 వేల రూపాయల చొప్పున అందించింది. గతానికి భిన్నంగా దసరా సందర్భంగా గనులపై విందు ఏర్పాటు చేశారు. కార్మికులకు కంపెనీ స్థితిగతులను వివరించేందుకు ఈ ప్రయత్నం చేశారు.
వయో పరిమితి పెంపు
కారుణ్య నియామకాల్లో వారసుల గరిష్ట వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచేందుకు సింగరేణి బోర్డు అనుమతించింది. దీనివల్ల 200 మంది వారసులకు లబ్ధి చేకూరింది. భవిష్యత్ నియామకాల్లోనూ వారసులకు మేలు జరుగనుంది.
ఉత్పత్తిలో వెనకబాటు
బెల్లంపల్లి రీజియన్‌లో ఉన్న శ్రీరాంపూర్, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలు ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నాయి. ఈ నెల 24వ తేదీ వరకు శ్రీరాంపూర్ 54.5 శాతం, మందమర్రి ఏరియా 55.6, బెల్లంపల్లి ఏరియా 58.6శాతంతో నడుస్తున్నాయి. శ్రీరాంపూర్ ఏరియాలో రోజువారీగా, నెలవారీగా లక్ష్యాలను నిర్ధేశించుకొని బొగ్గును వెలికితీస్తున్నారు. 2023-24లో 38 లక్షల 81 వేల 83 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేశారు. ఈ ఏడాది 2024-25లో 63 లక్షల పది వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని శ్రీరాంపూర్ ఏరియాకు లక్ష్యంగా నిర్ణయించారు. రోజు సుమారుగా 2.81 లక్షల టన్నుల బొగ్గు వెలికి తీయాల్సి ఉంది. అయితే లక్ష్య సాధనకు అధికారులు కృషి చేస్తున్నారు.
Updated Date - Dec 29 , 2024 | 10:24 PM