Viral: నెలకు రూ.కోటి చొప్పున 30 ఏళ్ల పాటు కనకవర్షం.. మేస్త్రీకి బంపర్ జాక్‌పాట్!
ABN, Publish Date - Apr 29 , 2024 | 06:24 PM
లండన్‌కు చెందిన ఓ తాపీ మేస్త్రీకి బంపర్ ఆఫర్ తగిలింది. నెలకు కోటి చొప్పున ముప్పై ఏళ్ల పాటు నిరంతరంగా డబ్బు వచ్చే లాటరీ అతడికి దక్కించుకున్నాడు.
ఇంటర్నె్ట్ డెస్క్: లాటరీలో మిలియన్ల కొద్దీ డబ్బు గెలుచుకొన్న వాళ్ల గురించి విన్నాం. బిలియన్లు గెలుచుకున్న వాళ్ల గురించీ చదివాం. కానీ ఏకంగా నెలకు రూ.కోటి చొప్పున 30 ఏళ్ల పాటు కనకవర్షం కురిపించే జాక్‌పాట్ మాత్రం అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన అదృష్టం దక్కించుకున్నాడో తాపీ మెస్త్రీ. ఇతడి ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో (Viral) ఉంది.
బ్రిటన్‌కు (UK) చెందిన జాన్ స్ట్రెమ్‌బ్రిడ్జి ప్లాస్టరింగ్ పనులు చేస్తుంటాడు. ట్రోబ్రిడ్జ్ ప్రాంతంలో తన భార్యాపిల్లలతో కలిసి ఉంటాడు. అతడి వయసు 52. కష్టజీవి అయిన జాన్‌కు ఆర్థిక ఇబ్బందులు వేధిస్తూనే ఉంటాయి. ఎలాగొలా నెట్టుకొస్తుంటాడు. గతేడాది చివర్లో అతడు తన పనులు పూర్తి చేసుకున్నాక ఇంటి కెళ్లే దారిలో ఓ షాపులో లాటరీ కొన్నాడు. ఏదో యాదాలాపంగా కొన్నాడు కానీ లాటరీ దక్కుతుందన్న ఆశ లేనేలేదు. దీంతో, ఆ తరువాత టిక్కెట్ కొన్న విషయమే అతడు మర్చిపోయాడు.
Viral: భారతీయుల్ని ఫాలో అవుతున్న బ్రిటన్ కంపెనీ.. ఆనంద్ మహీంద్రా ఫుల్ ఖుష్!
కొన్ని వారాల తరువాత అతడు ఓ రోజు తను పనిచేస్తున్న ప్రదేశంలో తన వ్యానులో కూర్చుని రిలాక్స్ అవుతుండగా లాటరీ టిక్కెట్టు గురించి గుర్తొచ్చింది. లాటరీ టిక్కెట్టు షాపు కూడా సమీపంలోనే ఉండటంతో అక్కడికెళ్లి తన టిక్కెట్ చూపించాడు. కౌంటర్‌లో ఉన్న వ్యక్తి అతడి టిక్కెట్‌ను చూసి నోరెళ్లబెట్టాడు. తను చూసింది నమ్మలేక వింత శబ్దంతో అరిచాడు. టిక్కెట్‌పై ఉన్న నెంబర్‌కు ఫోన్ చేసి కంపెనీకి సమాచారం అందించాలని జాన్‌కు సూచించాడు.
తనకు జాక్‌పాట్ తగిలినట్టు జాన్‌కు అర్థమైంది కానీ ఏ లక్ష పౌండ్లో గెలుచుకుని ఉండొచ్చని అనుకున్నాడు. కానీ, లాటరీ కంపెనీకి ఫోన్ చేశాక అతడికి అసలు విషయం అర్థమై నోరెళ్లబెట్టాడు. నెలకు కోటి చొప్పున 30 ఏళ్ల పాటు డబ్బులు వచ్చేలా జాక్‌పాట్ తగిలిందని తెలిసి అతడి సంబరానికి అంతేలేకుండా పోయింది. తన జీవితం ఒక్కసారిగా మారిపోయినందుకు అతడి సంబరం అంబరాన్ని అంటింది (UK Mans Lottery Ticket To Provide Him Rs 1 Crore Monthly For 30 Years).
‘‘ఇక తాపీలతో పనిచేసే రోజులు పోయాయి. ఒంటి నిండా ప్లాస్టర్ దుమ్ముతో ఆర్థిక ఇబ్బందులతో ఇంటికొచ్చే రోజులు గడిచిపోయాయి. కుటుంబ భవిష్యత్తు గురించి ఇక ఎటువంటి టెన్షన్ లేదు. నా స్నేహితులు, కుటుంబసభ్యులకు కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా సాయం చేస్తా’’ అంటూ సంబరపడిపోతూ చెప్పాడు జాన్. ఇంతటి డబ్బు, పన్ను లేకుండా గెలుచుకోవడం నిజంగా అరుదైన విషయమని సంబరపడిపోయాడు. డబ్బు తెచ్చిన కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్న జాన్‌ను తాజాగా మీడియా మరోసారి పలకరించడంతో అతడు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు.
Updated Date - Apr 29 , 2024 | 08:47 PM