Bhopal: మీ కొలువులకు కాంగ్రెస్ ఎసరు ప్రధాని నరేంద్ర మోదీ
ABN, Publish Date - Apr 26 , 2024 | 03:55 AM
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తన వాగ్యుద్ధాన్ని మరింతగా పెంచారు. సంపద దోపిడీ, వారసత్వ పన్ను, ముస్లిం రిజర్వేషన్ల పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీల రాజ్యాంగ హక్కుల
ఇంట్లో ఇద్దరు ఉద్యోగులుంటే..
ఒకరి కొలువును లాగేసుకుంటుంది
ఆ ఉద్యోగాన్ని ముస్లింలకు ఇస్తుంది
రాజ్యాంగమంటే కాంగ్రెస్‌కు ద్వేషం
అంబేడ్కర్‌ను అవమానిస్తోంది
బరేలీ రోడ్‌షోలో మోదీ విమర్శలు
కాంగ్రెస్ వస్తే ఇస్లామీకరణ తథ్యం
యోగి ఆదిత్యనాథ్ హెచ్చరికలు
బరేలి/భోపాల్, ఏప్రిల్ 25: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తన వాగ్యుద్ధాన్ని మరింతగా పెంచారు. సంపద దోపిడీ, వారసత్వ పన్ను, ముస్లిం రిజర్వేషన్ల పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీల రాజ్యాంగ హక్కుల హననానికి కాంగ్రెస్ యత్నిస్తోందంటూ నిన్నమొన్న ఎన్నికల ర్యాలీల్లో విరుచుకుపడ్డ మోదీ.. తాజాగా ఉద్యోగాలపైనా పంజా(హస్తం గుర్తు) విసిరే కుతంత్రాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
‘‘మీరు బీసీ లేదా ఎస్సీ/ఎస్టీ వర్గానికి చెందినవారై ఉండి.. మీ ఇంట్లో ఇద్దరికి ఉద్యోగాలు ఉంటే.. ఒక కొలువును కాంగ్రెస్ లాక్కొంటుంది. దేశ సంపదపై ప్రథమ హక్కుదారులకు(ముస్లింలు) ఆ ఉద్యోగాన్ని పంచిపెడుతుంది’’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన రోడ్‌షోలో మోదీ ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి.. ఓబీసీల
హక్కులకు ఎసరుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని మోదీ హెచ్చరించారు. ‘‘ఓబీసీల హక్కులను ముస్లింలకు అందజేయాలని చూస్తున్నారు. సమాజ్‌వాదీ దృష్టిలో బీసీలంటే యాదవులేనా? యాదవులంటే వారి(అఖిలేశ్) కుటుంబం సభ్యులేనా? బుదౌన్, మణిపురి, ఫిరోజాబాద్, ఆజంగఢ్, కన్నౌజ్‌లలో వారి కుటుంబ సభ్యులకే టికెట్లు ఇచ్చుకున్నారు’’ అంటూ ప్రధాని మండిపడ్డారు.
పేరుకు యాదవులమనే చెప్పుకొంటారు కానీ, శ్రీకృష్ణుడిని అవమానిస్తారని అఖిలేశ్ కుటుంబాన్ని విమర్శించారు. ‘‘నేను సముద్రగర్భంలో ద్వారకను సందర్శించినప్పుడు రాకుమారుడు(రాహుల్‌గాంధీని ఉద్దేశించి) ఆటపట్టించేలా మాట్లాడారు. ఇప్పుడు ఆ రాకుమారుడికి అఖిలేశ్ హారతిపడుతున్నారు’’ అంటూ విరుచుకుపడ్డారు. ఆగ్రాలో జరిగిన ర్యాలీలోనూ కాంగ్రె్‌స-సమాజ్‌వాదీ పార్టీలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు.
‘‘ఆ రెండు పార్టీలు ఉత్తరప్రదేశ్‌లో తమ ఓటుబ్యాంకు కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి’’ అని విమర్శించారు. అంతకు ముందు మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ద్వేషిస్తోందని.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన కోటాను ముస్లింలకు కట్టబెట్టాలని కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. 2009, 2014 ఎన్నికల మేనిఫెస్టోల్లోనూ కాంగ్రెస్ మతపరమైన రాజకీయాలను గురించి ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు.
కాంగ్రెస్ చర్యలను చౌకీదార్(మోదీ తనను తాను కాపలాదారు అంటూ సంబోధించుకునే పేరు) అడ్డుకుంటారని, ఆ పార్టీని నిలువరించడానికి లోక్‌సభలో 400 సీట్లు కావాలని ప్రజలను కోరారు. ఇందిరా గాంధీ మృతి తరువాత అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ, ఆమె సంపద ప్రభుత్వ పరం కాకుండా చూడటానికే అప్పట్లో వారసత్వ పన్నును రద్దు చేశారని మోదీ ఆరోపించారు.
ఎంపీలోని మోరెనాలో ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. వారసత్వ పన్నును కాంగ్రెస్ మళ్లీ తెస్తానంటోందన్నారు. కాంగ్రెస్ లూటీ నుంచి ప్రజల సంపదను కాపాడితీరతానని ప్రధాని స్పష్టం చేశారు.
ఇస్లామీకరణే కాంగ్రెస్ ఎజెండా: యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా కాంగ్రె్‌సపై విరుచుకుపడ్డారు. గురువారం లఖ్‌నవూలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. కాంగ్రెస్ వస్తే దేశంలో ఇస్లామీకరణ జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘రంగనాథ్‌మిశ్రా కమిటీ సిఫారసులను అమలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తోంది.
27 శాతం బీసీ రిజర్వేషన్లలో ఆరు శాతాన్ని ముస్లింలకు ఇవ్వాలని ఆ కమిటీ సిఫారసు చేసింది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ దాన్ని అమలు చేస్తోంది. సచార్ కమిటీ ముస్లింల ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసింది. ఆ కమిటీ సిఫారసులనూ అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది’’ అని విమర్శించారు.
Updated Date - Apr 26 , 2024 | 03:55 AM