LG VK Saxena: కేజ్రీవాల్ 'తాత్కాలిక సీఎం' వ్యాఖ్యలపై అతిషికి ఎల్జీ లేఖ
ABN, Publish Date - Dec 30 , 2024 | 08:01 PM
లిక్కర్ పాలసీ కేసులో బెయిలుపై విడుదలైన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో అతిషి ముఖ్యమంత్రిగా గత సెప్టెంబర్ 23న బాధ్యతలు చేపట్టారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి (Atishi)ని తాత్కాలిక ముఖ్యమంత్రిగా 'ఆప్' జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పేర్కొనడం తనను చాలా బాధించిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena) అన్నారు. ఇది ఒక ముఖ్యమంత్రిగా అతిషికే కాకుండా, రాష్ట్రపతి ప్రతినిధిగా తనకు కూడా అవమాన కరమని పేర్కొన్నారు. తన ప్రభుత్వంలోని పూర్తిస్థాయి ముఖ్యమంత్రిని తాత్కాలిక ముఖ్యమంత్రిగా చెప్పడం అభ్యంతరకరమని అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అతిషికి లెఫ్టినెంట్ గవర్నర్ సోమవారంనాడు ఒక లేఖ రాశారు.
Rohingyas in Delhi: రోహింగ్యాలపై కేజ్రీ, కేంద్ర మంత్రి లడాయి
లిక్కర్ పాలసీ కేసులో బెయిలుపై విడుదలైన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో అతిషి ముఖ్యమంత్రిగా గత సెప్టెంబర్ 23న బాధ్యతలు చేపట్టారు. సీఎం సీటును ఖాళీగానే ఉంచుతున్నట్టు అతిషి ప్రకటించారు. కేజ్రీవాల్ సైతం ఎన్నికల తర్వాత తిరిగి సీఎం పగ్గాలు చేపడతానని పలుమార్లు ప్రకటించారు. కాగా, ఇటీవల మీడియా సమక్షంలో అతిషిని టెంపరరీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పేర్కొనడాన్ని సీఎంకు రాసిన లేఖలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రస్తావించారు.
''ఇటీవల మిమ్మల్ని తాత్కాలిక ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మీడియా ముందు చెప్పారు. ఇది అభ్యంతరకరం. బాధాకరం కూడా. తాత్కాలిక ముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగపరమైన వెసులుబాటు ఏదీ లేదు. ఇది ప్రజాస్వా్మ్య స్ఫూర్తిని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విలువలను తగ్గించి చూపడమే అవుతుంది'' అని అతిషికి రాసిన లేఖలో ఎల్జీ పేర్కొన్నారు. యమునా నదీ జలాల ప్రక్షాళన వంటి అంశాలతో సహా పలు అంశాల విషయంలో తన వైఫల్యాన్ని మీ నేత (కేజ్రీవాల్) బహిరంగంగానే ఒప్పుకున్నారని, ఆయన వైఫల్యం చెందిన అంశాలను మీరు (అతిషి) పరిశీలించవచ్చని అన్నారు.
కేజ్రీవాల్ మీ సమక్షంలోనే ముఖ్యమంత్రి పేరుతో సీనియర్ సిటిజన్లు, మహిళలకు సంబంధించిన అనధికార ప్రకటనలు చేయడం సీఎం పదవిని, మంత్రి మండలిని కించపరచడమే అవుతుందన్నారు. అమలులో లేని పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ ప్రభుత్వంలోని రెండు శాఖలు ఇటీవల పబ్లిక్ నోటీసులు ఇవ్వడాన్ని కూడా ఎల్జీ ప్రస్తావించారు. ఇది సీఎంగా మీకు కూడా ఇబ్బందికరమైన పరిణామమేనని గుర్తుచేశారు. వాస్తవాలను వెల్లడించడం ద్వారా తమ విధులను డిపార్ట్‌మెంట్ అధికారులు సక్రమంగా నిర్వర్తించారని ఎల్జీ అభినందించారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే అందుకు భిన్నంగా సీఎంపై రవాణాశాఖ, ఇతర విచారణ సంస్థలు విచారణ చేపట్టవచ్చని, సీఎంను జైలుకు పంపవచ్చని కేజ్రీవాల్ ప్రకటించారన్నారు. అయితే అలాంటి ఆలోచన ఏదీ లేదని రవాణా శాఖ చీఫ్ సెక్రటరీనే స్వయంగా మీకు (సీఎం) తెలియజేయడం, విజిలెన్స్ శాఖ సైతం ఇదే తరహా వివరణ ఇవ్వడం తెలిసిందేనన్నారు. అతిషి సమర్ధవంతంగా పలు శాఖలను నిర్వహిస్తున్నారని కూడా ఆ లేఖలో ఎల్జీ ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి:
Prashant Kishore: పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన.. కీలక నేత అరెస్ట్
Kumbh Mela 2025: మహా కుంభమేళాకు.. రూ.7,500 కోట్లు
Read More National News and Latest Telugu News
Updated Date - Dec 30 , 2024 | 08:01 PM