AP Police : సైబర్ నేరాలకు చెక్..!
ABN, Publish Date - Dec 09 , 2024 | 03:58 AM
ఈడీ అధికారి పేరు చెప్పి ఒకడు కొరియర్ ఫ్రాడ్ అంటూ ఫోన్ చేస్తాడు.. సీబీఐ లోగో వెనుక పెట్టుకుని మరొకడు డిజిటల్ అరెస్టు అంటూ వీడియో కాల్‌లో బెదిరిస్తాడు. మనీలాండరింగ్ కేసులు మొదలు డ్రగ్స్, అక్రమ ఆయుధాల కేసులంటూ భయపెట్టి నిలువునా దోచేస్తారు.
గత ఆరేళ్లలో సైబర్ కేసులు
జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు
ఎస్పీల గ్రీవెన్స్‌లో బాధితుల ఫిర్యాదుల పరిష్కారం
ప్రజల్లో అవగాహనకు జిల్లాల వ్యాప్తంగా విస్తృత ప్రచారం
ప్రభుత్వానికి పోలీస్ శాఖ ప్రతిపాదనలు
అమరావతి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఈడీ అధికారి పేరు చెప్పి ఒకడు కొరియర్ ఫ్రాడ్ అంటూ ఫోన్ చేస్తాడు.. సీబీఐ లోగో వెనుక పెట్టుకుని మరొకడు డిజిటల్ అరెస్టు అంటూ వీడియో కాల్‌లో బెదిరిస్తాడు. మనీలాండరింగ్ కేసులు మొదలు డ్రగ్స్, అక్రమ ఆయుధాల కేసులంటూ భయపెట్టి నిలువునా దోచేస్తారు. బ్యాంకుల పేరుతో కేవైసీ అడిగి, డెబిట్ కార్డుల అప్‌డేట్ పేరు చెప్పి మోసాలు చేస్తున్నారు. నకిలీ యాప్‌లు, మ్యాట్రిమోనీ మోసాలతోపాటు ఉపాధి, ఉద్యోగాల ఆశ చూపి భారీగా దోచేస్తున్నారు. ఇలా రోజుకో కొత్త మార్గంలో సవాల్ విసురుతున్న సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ఏపీ పోలీస్ శాఖ నడుం బిగించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక సైబర్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ సైబర్ పోలీసుస్టేషన్ ఏర్పాటుచేసి అందులో సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం ఉన్న పోలీసుల్ని నియమిస్తే ఫలితం ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో సైబర్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఇతర ప్రాంతాల బాధితులు ఫిర్యాదు చేయాలంటే మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఉన్న సైబర్ పోలీసు స్టేషనే దిక్కు.
ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ సైబర్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసి.. బాధితుల ఫిర్యాదులను జిల్లా ఎస్పీల గ్రీవెన్స్‌లో పరిష్కరించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం చేపట్టాల్సి ఉందని ప్రతిపాదనల్లో పేర్కొన్నట్టు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కానిస్టేబుళ్లలో సైతం ఇంజనీరింగ్, కంప్యూటర్స్ చదివిన వారున్నందున బాధితులకు రక్షణ కల్పించే అవకాశం మెండుగా ఉంటుందని ఉన్నతస్థాయి పోలీసు అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
డీజీపీల సదస్సులో ప్రధాని వ్యాఖ్యలతో అలర్ట్
సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలపై బాధితులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా హైల్ప్‌లైన్ నంబర్ 1930ను అందుబాటులోకి తీసుకొచ్చిన కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేయడంతో ఏపీలోనూ అదే ప్రక్రియ మొదలైంది. ఈ నెల 2న భువనేశ్వర్‌లో డీజీపీల సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పెరుగుతున్న డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ టెక్నాలజీ, డీప్ ఫేక్ వంటి వాటితో అలజడి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నిర్ణయాలకు అనుగుణంగా ఏపీ పోలీసుశాఖ... రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదన పంపినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
Updated Date - Dec 09 , 2024 | 03:58 AM