Shyamala Goli : సాగరంలో వివాహిత సాహసయాత్ర
ABN, Publish Date - Dec 29 , 2024 | 06:21 AM
సముద్రంలో సాహస యాత్రకు ఐదు పదుల వయసులో ఓ వివాహిత సిద్ధమయ్యారు.
విశాఖ నుంచి ఈదుతూ కాకినాడకు
విశాఖపట్నం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): సముద్రంలో సాహస యాత్రకు ఐదు పదుల వయసులో ఓ వివాహిత సిద్ధమయ్యారు. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన శ్యామల గోలి(51) విశాఖ నుంచి సముద్రంలో ఈదుకుంటూ 150 కి.మీ. దూరంలో ఉన్న కాకినాడ చేరుకునేందుకు సిద్ధమయ్యారు. గతంలో అనారోగ్యానికి గురైన శ్యామల.. శ్రేయోభిలాషుల సూచనతో ఈత నేర్చుకున్నారు. ఈతపై పట్టు సాధించడంతో సాగరయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. శనివారం ఉదయం ఆర్కే బీచ్ వద్ద ఆమె యాత్రను ఎంపీ ఎం. శ్రీభరత్ ప్రారంభించారు. శ్యామల చేపట్టిన సాహస యాత్ర ఆమె ఆత్మవిశ్వాసానికి, మహిళా శక్తికి ప్రతీకగా నిలుస్తుందని, ఇది మహిళలు, సమాజానికి స్ఫూర్తిదాయకమని ఎంపీ కొనియాడారు. సాయంత్రానికి శ్యామల విశాఖ ఉక్కు కర్మాగారం వెనుక ఉన్న అప్పికొండకు చేరుకున్నారు. సముద్రంలో ఈదే క్రమంలో ఆమె వెంట ఒక బోటు ఉంటుంది. శ్యామల పగటిపూట ఈదుతూ రాత్రి ఆ బోటులో విశ్రాంతి తీసుకుంటారు. గతంలో ఆమె అమెరికాలో ఒక దీవి నుంచి మరో దీవికి, శ్రీలంక నుంచి కన్యాకుమారికి ఈదుకుంటూ చేరుకున్నారు.
Updated Date - Dec 29 , 2024 | 06:21 AM