దేవుని తల్లి.. కరుణా కల్పవల్లి
ABN, First Publish Date - 2020-02-11T10:02:25+05:30
గుణదలమాత పుణ్యక్షేత్రం దేశ సంస్కృతీ సంప్రదాయాలకు నిదర్శనమని వరంగల్ డయోసిస్ పీఠాధిపతి ఉడుముల బాల తెలిపారు.
రెండోరోజూ గుణదల మహోత్సవాలకు పోటెత్తిన భక్తులు
గుణదల, ఫిబ్రవరి 10 : గుణదలమాత పుణ్యక్షేత్రం దేశ సంస్కృతీ సంప్రదాయాలకు నిదర్శనమని వరంగల్ డయోసిస్ పీఠాధిపతి ఉడుముల బాల తెలిపారు. గుణదలమాత మహోత్సవాలు సోమవారం రెండోరోజుకు చేరాయి. బిషప్ గ్రాసీ హైస్కూల్ గ్రౌండులో ఏర్పాటుచేసిన వేదికపై బిషప్ బాల.. భక్తులకు సందేశమిచ్చారు. గుణదలమాత దర్శనానికి క్రైస్తవులే కాకుండా అన్ని వర్గాల వారు వస్తారని చెప్పారు. మరియమాతను దర్శించుకుంటే సమస్యలు తప్పక తీరుతాయన్న నమ్మకమే ఇందుకు కారణమన్నారు. కరోనా వైరస్ వంటి ప్రాణాంతక రోగాల నుంచి మరియమాత కాపాడుతుందని చెప్పారు. అనంతరం పూజాపీఠంపై విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, వరంగల్ బిషప్ బాల, మోన్సిగ్ఞోర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్రం రెక్టర్ యేలేటి విలియం జయరాజు, చాన్సలర్ ఫాదర్ వల్లె విజయ జోజిబాబు, వికార్ జనరల్ ఎం.గాబ్రియేలు, ఎస్‌ఎస్‌సీ డైరెక్టర్ ఫాదర్ పసల థోమస్‌లు సమష్టి దివ్యపూజాబలి సమర్పించారు. అనంతరం గురువులు భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
గుణదలమాత మహోత్సవాల్లో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఉదయం జరిగిన సమష్టి దివ్యపూజాబలిలో ‘పల్లొట్టి విద్యానం’ గాయక బృందం ఆలపించిన పూజా గీతాలు ఆకట్టుకున్నాయి. నూజివీడు సెయింట్ పాల్స్ సెమినరీ గురు విద్యార్థుల బృంద కోలాటం, ప్రేరణ యూత్ సెంటర్ వారి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాత్రి.. విజయవాడ కళాదర్శిని బృందం వారి ‘జీవన ప్రదాత’ నృత్యరూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుణదల తంటేపూడి డేవిడ్ అశోక్ కుమార్ ప్రదర్శించిన లూసీఫర్ ఏకపాత్రాభినయంతో తెల్లవార్లూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి.
ట్రాఫిక్ మళ్లింపు
సోమవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా భక్తులు పెరగడంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. రామవరప్పాడు వైపు నుంచి వచ్చే వాహనాలను గుణదల సెంటర్ వద్ద నుంచి క్రీస్తురాజపురం మీదుగా ఐదో నెంబరు రూట్‌కు మళ్లించారు. మార్కెట్, రైల్వేస్టేషన్ల నుంచి రామవరప్పాడువైపు వెళ్లాల్సిన వాహనాలను చుట్టుగుంట నుంచి క్రీస్తురాజపురం మీదుగా ఈఎస్‌ఐ హాస్పటల్ వద్ద ఏలూరు రోడ్డు వైపు మరల్చారు. ఏలూరు వైపు నుంచి వచ్చిన మేరీమాత ప్రత్యేక బస్సులను గుణదల సెంటర్ వరకు అనుమతించారు. అలాగే, కొండపల్లి వైపు వెళ్లే బస్సులను పడవలరేవు సెంటర్ నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు వరకు అనుమతించారు.
Updated Date - 2020-02-11T10:02:25+05:30 IST