Tummala: బీఆర్‌ఎస్ దీక్ష ఎందుకు?
ABN, Publish Date - Jan 24 , 2025 | 03:24 AM
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.7,625 కోట్ల రుణమాఫీ సొమ్మును ఒకే ఒక్క రాత్రి రైతుల ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
రుణమాఫీ సహా ఏ హామీనీ అమలు చేయలేక ఇప్పుడు దీక్షలా?: తుమ్మల
అర్హులందరికీ రేషన్ కార్డులిస్తాం: ఉత్తమ్
కోదాడ, జనవరి 23 (ఆంద్రజ్యోతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.7,625 కోట్ల రుణమాఫీ సొమ్మును ఒకే ఒక్క రాత్రి రైతుల ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎందుకు దీక్ష చేపడుతుందో చెప్పాలని నిలదీశారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. 2023 ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తున్నట్లు భ్రమ కల్పించేందుకు రింగు రోడ్డును అమ్మి, తాకట్టు పెట్టి కొద్దిమందికి రుణమాఫీ చేశారని ఆరోపించారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 25 లక్షల మందికి రుణమాఫీ చేసినందుకు బీఆర్‌ఎస్ దీక్ష చేపడుతోందా? అని ప్రశ్నించారు. చిల్లర మల్లర రాజకీయాలు చేసే పార్టీలు వచ్చి లేనిపోని మాటలు చెబితే నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే గ్రామసభలు పెడుతున్నామన్నారు. గోదావరి జలాలు పాలేరు ద్వారా కోదాడకు తేవడమేగాక ఖమ్మం జిల్లా పచ్చగా ఉండేందుకు కృషి చేస్తానన్నారు. హామీలను అమలు చేయలేకపోతే ప్రజలను క్షమాపణ కోరతామే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి తలదించుకునే పరిస్థితి ఉండదని అన్నారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు: ఉత్తమ్
అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డులు ఇస్తామని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, డబుల్ బెడ్‌రూం పేరుతో కాలయాపన చేసి ఒక్కరికి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
డిండి హెడ్‌వర్క్‌గా ఏదుల
ఏదుల రిజర్వాయర్ నుంచే డిండి ఎత్తిపోతల పథకానికి నీరందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం ఏదుల రిజర్వాయర్‌ను హెడ్‌వర్క్‌గా ఖరారు చేస్తూ జీవో నంబరు 10 జారీ చేశారు. ఏదుల నుంచి 2.5 కిలోమీటర్ల మేర ఓపెన్ కెనాల్‌తో పాటు 16 కి.మీ. మేర టన్నెల్, మరో 3.05 కి.మీ. ఓపెన్ కెనాల్‌తో నీటిని దుందుభి నదిలో పోస్తారు. అక్కడి నుంచి డిండి ఎత్తిపోతలకు తీసుకెళతారు.
Updated Date - Jan 24 , 2025 | 03:24 AM