MLC Elections: పోలింగ్ ప్రశాంతం..
ABN, Publish Date - Feb 28 , 2025 | 04:00 AM
రాష్ట్రంలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉపాధ్యాయ స్థానాల్లో ఓటేసేందుకు పోటెత్తిన టీచర్లు.. ‘నల్లగొండ’లో 93.5ు
‘కరీంనగర్’లో 91.9 శాతం నమోదు
పట్టభద్రుల స్థానంలో 70.42 శాతం గోదాములకు బ్యాలెట్ బాక్సుల తరలింపు
3న కౌంటింగ్ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
(ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్): రాష్ట్రంలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. పట్టణ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల దాకా, కొన్ని మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో 4.30 గంటల దాకా కొనసాగింది. మొదట రెండు, మూడు గంటల పాటు కొంత మందకొడిగా సాగిన పోలింగ్.. ఆ తర్వాత బాగా పుంజుకుంది. కొన్ని పోలింగ్‌కేంద్రాల్లో సాధారణ ఎన్నికలను తలపిస్తూ క్యూలో వేచి ఉండి మరీ.. పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక, రెండు నియోజకవర్గాల్లోనూ ఓటేసేందుకు టీచర్లు పోటెత్తారు. పోలింగ్ సమయం ముగిసేప్పటికి నల్లగొండ-వరంగల్-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 93.55శాతం, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 91.90శాతం, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 70.42శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ‘నల్లగొండ’ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 25,797 మంది ఓటర్లు ఉండగా.. 24,132 ఓట్లు పోలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ‘కరీంనగర్’ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 27,088 మంది ఓటర్లు ఉండగా.. 24895 మంది ఓటు వేశారు. ఇక, పట్టభద్రుల నియోజకవర్గంలో 3,55,159 మంది ఓటర్లు ఉండగా.. 2,50,106 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన బ్యాలెట్ బ్యాక్సులను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేసి.. భారీ బందోబస్తు మధ్య గోదాములకు తరలించారు. నల్లగొండలోని స్టేట్‌వేర్ హౌస్ గోదాము, కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న అంబేడ్కర్ స్టేడియంలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖమ్మంలో ఫ్లెక్సీపై వివాదం.. ఉద్రిక్తత
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఖమ్మం రిక్కాబజార్ పాఠశాల పోలింగ్ కేద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ప్రచారం కోసం బీజేపీ ఏర్పాటు చేసిన టెంట్‌లో ఉన్న ప్రధాని మోదీ ఫ్లెక్సీని తొలిగించాలని యూటీఎఫ్, టీఎ్‌సపీఆర్టీయూ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. మోదీపై టీఎ్‌సయూటీఎఫ్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ కార్యకర్తలు టెంట్లను కిందపడేశారు. దీంతో రెండువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఇరువర్గాలకు పోలీసులు సర్ది చెప్పి వదిలేశారు.
భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో ఒకే ఒక్క ఓటుతో వంద శాతం పోలింగ్ నమోదైంది. ఆ ఒక్క ఓటు కోసం ఐదుగురు పోలింగ్ సిబ్బంది, ఒక రూట్ ఆఫీసర్, భద్రతకు ఇద్దరు పోలీసులు పర్యవేక్షించగా ఉపాధ్యాయుడు జాడి సుధాకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సిద్దిపేట జిల్లా కొండపాక ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు వంగ అమరేందర్‌రెడ్డి తన ఓటుహక్కు వినియోగించుకునేందుకు వినూత్న తీరులో వ్యవహరించారు. ఆయన స్వగ్రామం నుంచి కొమురవెల్లిలోని పోలింగ్ కేంద్రానికి సుమారు 6కిలోమీటర్లు ఉండగా, సమీప గ్రామాల మీదుగా 22కిలోమీటర్ల మేర జాగింగ్ చేస్తూ ఆయన పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఓటింగ్ పట్ల అవగాహన కల్పించాలన్న లక్ష ్యంతో 22 కిలోమీటర్లు జాగింగ్ చేసినట్లు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని ప్యారానగర్‌లో డంపుయార్డుకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు పట్టభద్రులు దూరంగా ఉన్నారు. 295మంది ఓటర్లకుగానూ 42 మందే ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం చారిగాం గ్రామానికి చెందిన జాకీర్ పాషాకు రెండు చేతులు లేకున్నా పోలింగ్ కేంద్రానికి వెళ్లి కాలి బోటన వేలుతో ఓటు వేశారు. చేతులు, కాళ్లు బాగున్నా ఓటేయడానికి నేటి యువత ఆసక్తి చూపని తరుణంలో.. జాకీర్ పాషా పట్టుదల భేష్ అని పలువురు ప్రశంసించారు.
పట్టభద్రుల ఓట్ల నమోదులో ఎన్నికల కమిషన్ విఫలమైందని స్వతంత్ర అభ్యర్థి నిమ్మతోట వెంకటేశ్వర్లు విమర్శించారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 10లక్షల మంది పట్టభద్రులు ఉంటే.. 3.55లక్షల మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకోవడమేంటని నిలదీశారు.
హోరాహోరీ పోరులో ఎవరి ధీమా వారిదే
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో అభ్యర్థుల నడుమ బలమైన పోటీ కొనసాగింది. మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ పడగా.. పింగళి శ్రీపాల్‌రెడ్డి (పీఆర్‌టీయూటీఎస్), అలుగుబెల్లి నర్సిరెడ్డి (సిట్టింగ్ ఎమ్మెల్సీ, యూటీఎ్‌ఫటీఎస్), పూల రవీందర్ (మాజీ ఎమ్మెల్సీ, బీసీ జేఏసీ), గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి (టీ పీసీసీ అధికారప్రతినిధి, టీపీఆర్‌టీయూ), పులి సర్వోత్తంరెడ్డి (బీజేపీ), సుందర్‌రాజ్‌యాదవ్‌కు ఎక్కువ ఓట్లు పోలైనట్లు ఉపాధ్యాయవర్గాల్లో చర్చ సాగుతోంది. మొదటి ప్రాధాన్య ఓట్లలో తమకే ఆధిక్యత వస్తుందంటే, తమకే ఆధిక్యత వస్తుందని నలుగురు ప్రధాన అభ్యర్థులకు మద్దతిచ్చిన ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. అయితే, మొదటి ప్రాధాన్య ఓట్లలోనే కోటా ఓటు సాధ్యం కాదని, ద్వితీయ ప్రాధాన్య ఓట్లే గెలుపును నిర్ణయించబోతున్నాయని ఉపాధ్యాయ ఓటర్లు చెబుతున్నారు. కరీంనగర్-ఆదిలాబాద్- నిజామాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య ఉపాధ్యాయ సంఘాలు మద్దతిచ్చిన అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. పోలింగ్ సరళి ఆయనకు అనుకూలంగా ఉందన్న వాదన వినిపిస్తోంది. మల్క కొమురయ్యకు పీఆర్‌టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, జాక్టో అభ్యర్థి కూర రఘోత్తంరెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఇక, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ పోటీ చేసిన విషయం తెలిసిందే. మొదటి నుంచి భావించినట్టుగానే ఇక్కడ ముక్కోణపు పోటీ జరిగింది. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నహరికృష్ణకు కరీంనగర్‌లో ఎక్కువ ఓట్లు పడ్డాయన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ హవా ఎక్కువగా కనిపించినట్లు చెబుతున్నారు. బీఎస్పీ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చినా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్లో ఒకరు ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.
Also Read:
గుంటూరు జిల్లా వాసి అరుదైన రికార్డు
ఈ చిట్కా పాటిస్తే.. రూ. 40 వేలు మీ జేబులోకే..
రూ. 108కే రీఛార్జ్ ప్లాన్.. డేటాతోపాటు కాల్స్ కూడా..
For More Telangana News and Telugu News..
Updated Date - Feb 28 , 2025 | 04:00 AM