High Court: బార్ కౌన్సిల్ పదవీకాలం ముగిసినా ఎలా కొనసాగుతారు?: హైకోర్టు
ABN, Publish Date - Feb 20 , 2025 | 04:45 AM
తెలంగాణ బార్ కౌన్సిల్ పదవీకాలం చాలాకాలం క్రితమే ముగిసిపోయినా బార్ కౌన్సిల్ కార్యవర్గం సభ్యులు ఎలా పదవుల్లో కొనసాగుతారని హైకోర్టు ప్రశ్నించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బార్ కౌన్సిల్ పదవీకాలం చాలాకాలం క్రితమే ముగిసిపోయినా బార్ కౌన్సిల్ కార్యవర్గం సభ్యులు ఎలా పదవుల్లో కొనసాగుతారని హైకోర్టు ప్రశ్నించింది. బార్ కౌన్సిల్‌కు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారని తెలంగాణ బార్ కౌన్సిల్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ని ప్రశ్నించింది. బార్ కౌన్సిల్ గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించడం లేదని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. బార్ కౌన్సిల్ ఎన్నిక షెడ్యూల్ సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు అమలుకాకపోవడంతో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది.
దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. బార్ కౌన్సిల్ సభ్యులు తమ పదవీకాలం పూర్తయినప్పటికీ ఫిర్యాదులు వచ్చిన అడ్వొకేట్లపై చర్యలు తీసుకుంటున్నారని.. అలా ఎలా చేస్తారని ప్రశ్నించింది. వచ్చే వాయిదాకు ప్రస్తుత అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి సైతం హాజరై ఎన్నికల నిర్వహణపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. అలాగే ప్రస్తుత కార్యవర్గాన్ని తప్పించి ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు ఆదేశిస్తామని వ్యాఖ్యానించింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున న్యాయవాది సమయం కోరడంతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
Updated Date - Feb 20 , 2025 | 04:45 AM