Land Survey: సాగు చేయని భూములపై సర్వే షురూ!
ABN, Publish Date - Jan 17 , 2025 | 03:25 AM
రాష్ట్రంలో సాగు చేయని భూములను గుర్తించేందుకు గురువారం సర్వే మొదలైంది. గ్రామస్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు భూములను పరిశీలిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అధికారులు
సర్వే నంబర్ల వారీగా వివరాల నమోదు
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణ
పలు జిల్లాల్లో వ్యవసాయేతర స్థలాల గుర్తింపు
హైదరాబాద్, నెట్‌వర్క్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగు చేయని భూములను గుర్తించేందుకు గురువారం సర్వే మొదలైంది. గ్రామస్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు భూములను పరిశీలిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం.. రైతులు, సర్వే నంబర్లు, బై నంబర్ల వివరాల ఆధారంగా సర్వే నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న స్థలాల్లో.. పంటలు సాగుచేస్తున్నారా..? లేదా..? ఇతర వ్యాపార సముదాయాలు నిర్మించారా..? ఇళ్లు ఉన్నాయా..? కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు ఉన్నాయా..? స్థిరాస్తి వెంచర్లు చేశారా..? అనే వివరాలను పరిశీలిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో మునిసిపాలిటీ, గ్రామ పంచాయతీ లే-ఔట్లకు సంబంధించిన భూములను పరిశీలించారు. సాగు చేయని భూములపై అధికారులకు ఫిర్యాదులు వస్తే స్వీకరించారు. గద్వాల జిల్లాలోని 13 మండలాల్లో 52 బృందాలు సర్వేలో పాల్గొంటున్నాయి. ఈ జిల్లాలో ఇది వరకు 4,51,746 ఎకరాలకు రైతుబంధు పంపిణీ చేశారు. కానీ పంటల సాగు విస్తీర్ణం 4 లక్షల 7 వేల ఎకరాలు మాత్రమే ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. వనపర్తి జిల్లాలో ధరణి రికార్డుల్లో పలుమార్లు భూములు మార్పిడి కావటంతో.. వ్యవసాయేతర భూములను గుర్తించటం ఇబ్బందికరంగా మారిందని అధికారులు చెబుతున్నారు. స్థిరాస్తి వెంచర్లు, రైస్‌మిల్లులు, ప్రభుత్వం సేకరించిన భూములు కూడా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నట్లు గుర్తించారు. నారాయణపేట జిల్లాలో 51 బృందాలు సర్వే చేస్తున్నాయి.
ఇటుక బట్టీలు పెట్టిన సాగు భూములు, గోదాంలు నిర్మించిన భూముల వివరాలను అధికారులు సేకరించారు. మెదక్ జిల్లాలో నీటిపారుదల శాఖ కాలువల నిర్మాణానికి సేకరించిన భూములను కొన్నిచోట్ల గుర్తించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో అధికారుల బృందాలు సర్వే చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని హన్మకొండ జిల్లాలో 67 క్లస్టర్లు, వరంగల్ జిల్లాలో 70 క్లస్టర్లు, ములుగులో 52 క్లస్టర్లు, భూపాలపల్లిలో 65 క్లస్టర్లు, మహబూబాబాద్‌లో 82 క్లస్టర్లు, జనగామలో 69 క్లస్టర్లను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి సర్వే చేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో 30 వేల నుంచి 40 వేల ఎకరాల్లో సాగు చేయని భూములు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. 41 వేల మంది రైతుల పేర్లపై ఉన్న భూముల వివరాలపై సర్వే చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 440 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. 102 క్లస్టర్లుగా విభజించి సర్వే చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 104 క్లస్టర్లను ఏర్పాటుచేసి సర్వే చేస్తున్నారు. 5.22 లక్షల ఎకరాల భూమి సాగు రికార్డుల్లో ఉండగా... పంటలు వేయని భూముల వివరాలు సేకరిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 102 క్లస్టర్లలో సర్వే మొదలైంది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ఆర్వోఆర్ పట్టాలు ఇచ్చినందున వాటి వివరాలు కూడా సేకరిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో 79 క్లస్టర్లుగా విభజించి సర్వే చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,168 రెవెన్యూ గ్రామాలుండగా.. 394 క్లస్టర్లుగా విభజించి సర్వే మొదలుపెట్టారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 1,077 బృందాలు సర్వేలో పాల్గొన్నాయి. అశ్వారావుపేట మండలం ఆసుపాకలో 21 మందికి సంబంధించిన 20 ఎకరాల్లో పంటలు సాగుచేయటం లేదని గుర్తించారు. కొత్తగూడెం జిల్లాలో తొలి రోజు 98 గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో కూసుమంచి, సత్తుపల్లి, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, చింతకాని, కొణిజర్ల, మండలాల్లో స్థిరాస్తి వెంచర్లుగా మారిన కొన్ని భూములను గుర్తించారు.
Updated Date - Jan 17 , 2025 | 03:25 AM