Water Dispute: తెలంగాణకు 131 టీఎంసీలు
ABN, Publish Date - Feb 19 , 2025 | 03:33 AM
ఈ ఏడాది మిగిలిన కాలానికి నీటివాటాలను తేల్చింది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో ప్రస్తుతం మిగిలిఉన్న జలాల్లో ఏపీకి 27.03 టీఎంసీలు, తెలంగాణకు 131.75 టీఎంసీలవాటా ఉంటుందని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కు 27 టీఎంసీలు
ఈ ఏడాది మిగిలిన కాలానికి వాటాలివే
ఇప్పటికే 639 టీఎంసీలు వాడిన ఏపీ
నీటి పంపకాలకు 2015 ఒప్పందానికి
కట్టుబడాలి.. మినిట్స్‌లో కృష్ణా బోర్డు
ట్రైబ్యునల్ తేల్చేదాకా 66:34 నిష్పత్తిలో
పంచుకోవాలని స్పష్టీకరణ
నీటి వినియోగానికి ప్రణాళికలు
సమర్పించాలని ఇరు రాష్ట్రాలకు సూచన
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం ముదిరిపోవడంతో కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) రంగంలోకి దిగి.. ఈ ఏడాది మిగిలిన కాలానికి నీటివాటాలను తేల్చింది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో ప్రస్తుతం మిగిలిఉన్న జలాల్లో ఏపీకి 27.03 టీఎంసీలు, తెలంగాణకు 131.75 టీఎంసీలవాటా ఉంటుందని స్పష్టం చేసింది. జూన్, జూలైనాటికి ఉండనున్న తాగు, సాగునీటి అవసరాలను తీర్చుకోవడం కోసం ఈనెల 21వ తేదీలోగా ప్రణాళికలు సమర్పించాలని ఇరు రాష్ట్రాలను కోరింది. వాటిపై చర్చించి, నీటిని పంచాలని నిర్ణయించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ ఆమోదంతో ఎస్‌ఈ జి.వరలక్ష్మి సోమవారం ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖల ఈఎన్‌సీలకు లేఖ రాశారు. నిజానికి, ప్రస్తుత (2024-25) నీటి సంవత్సరంలో కృష్ణా జలాలను కచ్చితంగా 50:50 నిష్పత్తితో పంచాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఏపీ మాత్రం 2015లో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ప్రకారం 66:34 (ఏపీ, తెలంగాణ) నిష్పత్తికి కట్టుబడి ఉండాలని పట్టుబట్టింది.
ఈనెల 11నాటికి ఏపీ 646.37 టీఎంసీలను తరలించిందని, తాము 214.683 టీఎంసీలను మాత్రమే వినియోగించుకున్నామని, రానున్న రోజుల్లో తాగు, సాగునీటి అవసరాల కోసం 116 టీఎంసీలను తమకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ఈఎన్‌సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ నేరుగా కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్‌ను కలిసి, లేఖ ఇచ్చి.. నిరసన వ్యక్తం చేశారు. అయినా, కృష్ణా బోర్డు తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే కేటాయింపులు చేశారు. కృష్ణా బేసిన్‌లో ప్రస్తుత నీటి సంవత్సరంలో 1010.134 టీఎంసీలు లభ్యతలోకి వచ్చాయి. తాత్కాలిక నీటి సర్దుబాటు ప్రకారం ఏపీకి 666.68 టీఎంసీలు, తెలంగాణకు 343.44 టీఎంసీల వాటాలుంటాయని బోర్డు తేల్చింది. ఏపీ ఇప్పటికే 639.652 టీఎంసీలు వాడుకోగా, ఆ రాష్ట్ర కోటాలో 27.03 టీఎంసీల జలాలు మాత్రమే మిగిలి ఉన్నట్టు స్పష్టం చేసింది. తెలంగాణ 211.691 టీఎంసీలు వాడుకుందని, దాని కోటా కింద మరో 131.75 టీఎంసీలు మిగిలి ఉన్నాయని లెక్క తేల్చింది. అదే సమయంలో, నాగార్జున సాగర్ కనీస నీటిమట్టం 510 అడుగులకిపైన 63.6 టీఎంసీలు, శ్రీశైలం జలాశయం కనీస నీటిమట్టం 834 అడుగులకిపైన 30.811 టీఎంసీల నిల్వలు మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉన్నాయని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, ప్రకాశం బ్యారేజీ, పులిచింతల ప్రాజెక్టుల ద్వారా ఇప్పటిదాకా ఇరు రాష్ట్రాలు 851.343 టీఎంసీలను వినియోగించుకున్నాయని గుర్తు చేసింది.
నీటి పంపకాలకు 2015 ఒప్పందానికి కట్టుబడాలి..
మినిట్స్‌లో కృష్ణా బోర్డు
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2015 జూన్‌లో జరిగిన ఒప్పందం మేరకు కృష్ణా జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 66:34 నిష్పత్తిలోనే పంచుకోవాలని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు జనవరి 21న జరిగిన 19వ బోర్డు సమావే శం మినిట్స్‌ను రెండు రాష్ట్రాలతో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం మంగళవారం విడుదల చేసింది. 2015కు ముందున్న ప్రాజెక్టులన్నీ అనుమతి ఉన్నవేనని, ఆ తర్వాత కృష్ణా బేసిన్‌లో ఏ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేదని గుర్తు చేసింది. కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో పంచాలని తెలంగాణ, 2015 ఒప్పందానికే కట్టుబడాలని ఏపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జనవరి 21న జరిగిన బోర్డు సమావేశంలోనూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇదే డిమాండ్ చేశారు. తెలంగాణకు 71 శాతం నీటిని పంచాలని, ఏపీకి 29 శాతం మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిని ఏపీ తిరస్కరించి.. 66:34 నిష్పత్తికే కట్టుబడాలని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే, నీటి పంపకాలపై ట్రైబ్యునల్‌లో విచారణ జరుగుతున్నందున 2015లో ఒప్పందాన్ని అనుసరించి, 66:34 నిష్పత్తితో పంచుకోవాలని బోర్డు చైర్మన్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నందున సాగర్, శ్రీశైలంలోని కాంపొనెంట్ల వ్యవహారంలో ముందుకెళ్లరాదని, ఇరు రాష్ట్రాల అంగీకారం మేరకే ప్రాజెక్టులను బోర్డు స్వాధీనం చేసుకుంటుందని మినిట్స్‌లో పేర్కొంది. మూడో విడతలో 11 ప్రాంతాల్లో టెలిమెట్రీ (నీటి తరలింపును లెక్కించే) యంత్రాలను పెట్టాలని జనవరి 10న తె లంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాశారని, వీటిని బనకచర్ల హెడ్ రెగ్యులేటరీ (తెలుగు గంగ ప్రాజెక్టు, శ్రీశైలం రైట్ బ్యాంకు కెనాల్, గాలేరు నగరి సుజల స్రవంతి, ఎస్కేప్ రెగ్యులేటర్)తోపాటు ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం కింద పెట్టాలని కోరారని, ఇందుకయ్యే వ్యయం తామే భరిస్తామని ప్రతిపాదించారని గుర్తు చేసింది. అయితే, తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తే లేదని ఏపీ తేల్చి చెప్పినట్లు బోర్డు తెలిపింది. తాగునీటికి 100 టీఎంసీలు తరలిస్తే.. అందులో 20 శాతం (20 టీఎంసీలు) మాత్రమే తరలించినట్లు లెక్కించాలన్న ఏపీ, తెలంగాణ ప్రతిపాదనలకు బోర్డు అంగీకరించింది. శ్రీశైలంలో ప్లంజ్‌పూల్ మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఈఎన్‌సీ డిమాండ్ చేయగా.. దీన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా బోర్డు పేర్కొంది. శ్రీశైలం, సాగర్ నిర్వహణపై యథాతథస్థితి కొనసాగించాలని నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి...
తప్పిన పెను విమాన ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా
Read Latest Telangana News And Telugu News
Updated Date - Feb 19 , 2025 | 03:33 AM