Minister Tummala: మంచి చేయాలని చూస్తుంటే అడ్డుకుంటున్నారు: మంత్రి తుమ్మల ఆగ్రహం..
ABN, Publish Date - Jan 23 , 2025 | 01:47 PM
యాదాద్రి: తెలంగాణ రాష్ట్రంలో అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలని చూస్తుంటే బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. పదేళ్లపాటు రేషన్ కార్డులు ఇవ్వలేని సిగ్గులేని నేతలు గ్రామసభలకు అడ్డుతగులుతున్నారని మంత్రి ఘాటుగా స్పందించారు.
యాదాద్రి: తెలంగాణ రాష్ట్రంలో అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలని చూస్తుంటే బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. పదేళ్లపాటు రేషన్ కార్డులు ఇవ్వలేని సిగ్గులేని నేతలు గ్రామసభలకు అడ్డుతగులుతున్నారని మంత్రి ఘాటుగా స్పందించారు. దీక్షలు, నిరసనల పేరుతో అడుగడుగునా అడ్డం పడుతున్నారని తుమ్మల ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంస పాలనకు గురైన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. అందుకే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు రుణమాఫీ చేసినట్లు చెప్పుకొచ్చారు.
ఎందుకు చేయలేదు..
అన్నదాతలకు మేలు చేస్తుంటే నల్లగొండలో రైతు దీక్ష చేస్తున్నారంటూ మంత్రి తుమ్మల నిప్పులు చెరిగారు. నల్లగొండ రైతు దీక్ష చేయాలని భావిస్తున్న బీఆర్ఎస్ నేతలు పదేళ్లపాటు అధికారంలో ఉండి రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదని మంత్రి నిలదీశారు. జనవరి 26 నుంచి అన్నదాతలకు రైతు భరోసా ఇవ్వనున్నట్లు మంత్రి తుమ్మల మరోసారి గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టుపెట్టి కొంతమంది రైతులకు రైతు బంధు వేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో దొడ్డు బియ్యం మాఫియా ఉందని, అందుకే ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు తీసుకువస్తారని మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు.
మంత్రుల జోక్యం ఉండదు..
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో మంత్రులుగా తమ జోక్యం ఉండదని, న్యాయంగా అర్హులైన వారందరికీ మంజూరు చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అధికారులు ప్రజాపాలన సభల్లో ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తిస్తారని మంత్రి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ 15వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమాన్ని పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరిగేలా సాఫ్‌వేర్ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రూ.2 లక్షలకు పైగా ఇంకా రుణమాఫీ కాని రైతులకు మార్చి నెలలో షెడ్యూల్ పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, ముందు సమస్యలను అధికారులు, తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజా సమస్యలు పరిష్కరించడం తన బాధ్యతంటూ మంత్రి పొన్నం చెప్పారు.
Updated Date - Jan 23 , 2025 | 02:18 PM