ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Meenakshi Natarajan: అసామాన్యురాలైన సామాన్యురాలు!

ABN, Publish Date - Mar 01 , 2025 | 04:18 AM

ఆమె కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌! రైల్లో కాచిగూడ స్టేషన్‌లో దిగారు. అక్కడికొచ్చిన కొద్ది మంది పార్టీనేతలు.. శాలువాలు కప్పబోతే.. బొకేలు ఇవ్వబోతే సున్నితంగా వారించారు.

  • మీనాక్షి నటరాజన్‌కు గాంధీ మార్గమే స్ఫూర్తి

  • గత రాష్ట్ర ఇన్‌చార్జులకు పూర్తి భిన్నంగా ఆమె వైఖరి

  • నిరాడంబరతకు పట్టం

  • రైల్లో రాష్ట్రానికి రాక.. ప్రభుత్వ అతిథి గృహంలోనే బస

  • స్వాగతం పలికేందుకు స్టేషన్‌కు రావొద్దని ముందే స్పష్టం

  • ఆమె సూచనతో గాంధీభవన్‌ వద్ద కనిపించని ఫ్లెక్సీలు, కటౌట్లు

  • ఎన్‌ఎ్‌సయూఐ నుంచి సీడబ్ల్యూసీ సభ్యురాలి దాకా..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ఆమె కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌! రైల్లో కాచిగూడ స్టేషన్‌లో దిగారు. అక్కడికొచ్చిన కొద్ది మంది పార్టీనేతలు.. శాలువాలు కప్పబోతే.. బొకేలు ఇవ్వబోతే సున్నితంగా వారించారు. ఎవరైనా శాలువా కప్పినా కూడా వెంటనే తీసేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కదా? విమానంలో కాకుండా రైల్లో రావడం ఏమిటి? అంటారా! ఆమె నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం! సింపుల్‌గా పంజాబీ డ్రెస్సు, హవాయి చెప్పులు, సాదాసీదా కళ్లజోడు.. ఇదీ ఆమె ఆహార్యం. అడుగడుగునా గాంధీయిజాన్ని అనుసరించే ఆమె.. ఫ్లెక్సీలు, కటౌట్లతో ఆర్భాటంగా కనిపించే గాంధీభవన్‌ను అవేవీ లేకుండా చేసి సింపుల్‌గా మార్చేశారు. తద్వారా ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క అన్న సంకేతాన్ని పరోక్షంగా రాష్ట్రంలోని పార్టీ శ్రేణులకు పంపారు. కళాశాలలో చదువుకునే సమయంలో ఎన్‌ఎ్‌సయూఐలోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి, ఎంపీగా పని చేసిన మీనాక్షి, రాహుల్‌ గాంధీ బృందంలో కీలకసభ్యురాలు. 51 ఏళ్ల మీనాక్షీ నటరాజన్‌ అవివాహిత. 1973 జూలై 23న మధ్యప్రదేశ్‌లోని నగ్డాలో మీనాక్షి జన్మించారు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీలో సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితురాలి స్థాయికి ఎదిగినా ఆమెకు స్థిరాస్తులంటూ ఏమీలేవు. రూ.67 లక్షల చరస్తులున్నాయి. వీటిలో.. మాజీ ఎంపీగా వచ్చే పెన్షన్‌ డబ్బులే ఎక్కువ. మీనాక్షి, ఎమ్మెస్సీలో బయోకెమిస్ట్రీ చదివారు. లా కూడా పూర్తి చేశారు. కాంగ్రెస్‌ నేతగానే కాకుండా.. రచయిత్రిగానూ పేరొందారు. ఆమె రాసిన రెండు నవలలు ‘అప్నే అప్నే కురుక్షేత్ర’, ‘1857 భారతీయ పరిపేక్ష’ ప్రాచుర్యం పొందాయి. కాగా 1999 నుంచి 2002 వరకు ఎన్‌ఎ్‌సయూఐ అధ్యక్షురాలిగా మీనాక్షి పనిచేశారు. ఆ వెంటనే యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎన్నికై.. ఆ పదవిలో 2005 వరకూ కొనసాగారు. ఆమె సాధారణ జీవితం, పార్టీ పట్ల ఆమె అంకిత భావాన్ని గమనించిన రాహుల్‌గాంధీ.. 2008లో ఆమెను ఏఐసీసీ కార్యదర్శిగా తన బృందంలో చేర్చుకున్నారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని మండసోర్‌ నుంచి పోటీ చేసిన మీనాక్షి, బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ్‌ పాండేపై గెలుపొందారు. తదనంతర కాలంలో పార్టీలో అత్యున్నతమైన సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితురాలి స్థాయికి ఎదిగారు. తాజాగా కీలకమైన తెలంగాణకు ఇన్‌చార్జిగా నియమితులయ్యా రు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె ఇక్కడ పార్టీ అబ్జర్వర్‌గా పని చేశారు.


రైల్లో రాక.. ప్రభుత్వ గెస్ట్‌ హౌస్‌లో బస

అధికార పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న మీనాక్షీ నటరాజన్‌.. శుక్రవారం కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒక సాధారణ ప్రయాణికురాలిగా దిగారు. తన రాక సందర్భంగా ఎలాంటి హంగూ ఆర్భాటాలు ఉండకూడదని, ఫ్లెక్సీలు, స్వాగతతోరణాలు ఏర్పాటు చేయకూడదని ఆమె ముందే చెప్పడంతో ఆ మేరకు పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌.. రైల్వే స్టేషన్‌కు వెళ్లి ఆమెకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన కారులో ఆమె దిల్‌కుషా గెస్ట్‌ హౌస్‌కు చేరుకున్నారు. కొద్ది సేపటికే సీఎం రేవంత్‌రెడ్డి దిల్‌కుషా గెస్ట్‌ హౌస్‌కు చేరుకుని ఆమెకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆమె నేరుగా గాంధీభవన్‌కు చేరుకుని టీపీసీసీ విస్తృత సమావేశంలో పాల్గొన్నారు.


నా బ్యాగ్‌లు మోయ్యాల్సిన అవసరం లేదు

విస్తృత సమావేశంలో మీనాక్షీ నటరాజన్‌ మాట్లాడుతూ తన దృష్టిలో పడేందుకు నేతలెవ్వరూ ప్రయత్నాలు చేయొద్దని.. ముఖస్తుతి, ఆర్భాటాలు తన వద్ద పనిచేయవని గట్టిగా చెప్పారు. తన కోసం రైల్వే స్టేషన్‌కు ఎవరూ రావొద్దని, తన బ్యాగ్‌లు ఎవరూ మోయాల్సిన అవసరం లేదని, ఒకవేళ మోసే బలం లేకుంటే తానే సాయం అడుగుతానని వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు ఏమైనా సమస్యలుంటే తనకు ఫోన్‌ చేస్తే మాట్లాడతానని చెప్పారు. ఆ క్షణంలో ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోతే.. మిస్డ్‌ కాల్‌ చూసుకునైనా తర్వాతైనా మాట్లాడతానని చెప్పారు. కాగా, తన రాక సందర్భంగా హంగూ ఆర్భాటాలు వద్దంటూ మీనాక్షీ నటరాజన్‌ ముందుగానే తేల్చి చెప్పడంతో పార్టీ నాయకత్వమూ అలాగే నడుచుకుంది. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షీ నటరాజన్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు గాంధీభవన్‌లో సమావేశమైనా అక్కడ ఎలాంటి హడావుడి కనిపించలేదు.

Updated Date - Mar 01 , 2025 | 04:18 AM