Police Transfers: పోలీసు శాఖలో భారీగా బదిలీలు?!
ABN, Publish Date - Jan 20 , 2025 | 04:41 AM
పోలీసుశాఖలో భారీ స్థాయిలో బదిలీలకు రంగం సిద్ధమైంది. డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, పలువురు ఐపీఎస్ అధికారులను విడతల వారీగా బదిలీ చేయడానికి ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు
శాఖలో ప్రక్షాళన జరిగే అవకాశం
పని తీరు ఆధారంగానూ మార్పులు
సీఎం విదేశాల నుంచి రాగానే నిర్ణయం
హైదరాబాద్, జనవరి19 (ఆంఽధ్రజ్యోతి): పోలీసుశాఖలో భారీ స్థాయిలో బదిలీలకు రంగం సిద్ధమైంది. డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, పలువురు ఐపీఎస్ అధికారులను విడతల వారీగా బదిలీ చేయడానికి ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే ఈ శాఖలో ప్రక్షాళన జరగవచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది రెండు, మూడు సార్లు మాత్రమే పోలీసుల బదిలీలు జరిగాయి. ప్రధానంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న డీఎస్పీ స్ధాయి అధికారులపై ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. మరోవైపు కొందరు జిల్లా ఎస్పీల పనితీరు ఆశించిన విధంగా లేదని నిఘావర్గాల నుంచి ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లోని పోలీసు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు డీజీపీ కార్యాలయానికి చేరినట్లు సమాచారం. కమిషనరేట్లలో పనిచేస్తున్న కొందరు ఏసీపీలపై సైతం నిఘా వర్గాల నుంచి ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది.
అదనపు బాధ్యతలతో మార్పులు
మరోవైపు డీజీపీ కార్యాలయంలో సైతం కొంతమంది అధికారులు తమ విభాగంతో పాటు పలు విభాగాల బాధ్యతను అదనంగా చూడాల్సి రావడంతో కొన్ని మార్పులు తప్పవని పోలీసు వర్గాలు ద్వారా తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి హోంశాఖను కూడా చూస్తున్న నేపఽథ్యంలో పార్టీ నాయకుల నుంచి చాలామంది పోలీసులపై ఏకంగా సీఎంకే ఫిర్యాదులు అందినట్లు సమాచారం. అవినీతి ఆరోపణలు వచ్చినపుడు అవి బయటపడిన సమయంలో ఒకరిద్దరు పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకున్నా చాలా ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది.
త్వరలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగనున్న క్రమంలో ఆ లోపే పోలీసుల బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ వింగ్‌లను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విభాగాల్లో ఇంకా సీనియర్ అధికారుల కొరత ఉన్న నేపఽథ్యంలో బదిలీల్లో సమర్ధులైన పోలీసు అధికారులను ఈ విభాగాలకు కేటాయించనున్నారని తెలుస్తోంది. కొంతమంది పోలీసు అధికారులు ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో కొనసాగుతున్నారని ఎస్‌ఐగా ఏ జోన్‌లో పనిచేశారో అక్కడే ఏసీపీలు అయ్యారని, ఇలాంటి వారిని అదే ప్రాంతంలో కొనసాగించడం వల్ల అవినీతి, సివిల్ దందాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఫిర్యాదులు పోలీసు ఉన్నతాధికారులకు అందినట్లు తెలుస్తోంది.
Updated Date - Jan 20 , 2025 | 04:41 AM