కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు
ABN, Publish Date - Jan 24 , 2025 | 03:21 AM
రాష్ట్రంలో కొత్తగా 40 లక్షల రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందజేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.
కోటి కుటుంబాలకు సన్న బియ్యం
బీఆర్‌ఎస్ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్/ఇబ్రహీంపట్నం/ఆదిభట్ల, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 40 లక్షల రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందజేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. మొత్తం కోటి కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందజేస్తామని ప్రకటించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కొత్తగా ఒక్క కార్డు మంజూరు చేయలేదని, ఇప్పుడు పనిగట్టుకుని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు.
గురువారం రంగారెడ్డి జిల్లాలో ఆదిభట్ల- మంగల్‌పల్లి మధ్య రూ.25 కోట్లతో నిర్మించనున్న నాలుగు లేన్ల రహదారికి మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. కోహెడ రెవెన్యూలో 200 ఎకరాల్లో రూ.2వేల కోట్లతో మోడల్ మార్కెట్ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. విజయవాడ ప్రధాన రహదారి పెద్ద అంబర్‌పేట్ నుంచి కోహెడ మీదుగా నాగార్జునసాగర్ ప్రధాన రహదారికి కలిపే లింకు రోడ్డును రూ.96 కోట్లతో డబుల్ రోడ్డుగా విస్తరించనున్నట్లు తెలిపారు. మున్ముందు ఆదిభట్ల ప్రాంతం మరో కోకాపేట్, ఫైనాన్షియల్ జిల్లాగా మారనుందని చెప్పారు. డిండి ప్రాజెక్టుతో నల్లగొండ జిల్లా సస్యశ్యామలం అవుతుందని, ఈ పథకానికి రూ.6,190 కోట్లను కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు.
Updated Date - Jan 24 , 2025 | 03:21 AM