Kishan Reddy: రేవంత్.. దమ్ముంటే నిరూపించు
ABN, Publish Date - Feb 28 , 2025 | 04:11 AM
తెలంగాణకు సంబంధించిన ఏ ప్రాజెక్టునైనా తాను అడ్డుకున్నానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు.
నేను ఒక్క ప్రాజెక్టు అడ్డుకున్నట్లు తేలినా.. దేనికైనా రెడీ
మెట్రో ప్రాజెక్టు రెండో దశకు రాష్ట్రం వద్ద పైసలే లేవు
కావాలనే నన్ను, కేంద్ర సర్కారును బద్నాం చేసే కుట్ర
మోదీ అనుమతితోనే హామీలిచ్చారా?: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణకు సంబంధించిన ఏ ప్రాజెక్టునైనా తాను అడ్డుకున్నానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. గురువారం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మెట్రో రెండో దశను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ‘‘ఎన్నికల ముందు హామిలిచ్చేటప్పుడు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ డబ్బులు ఇస్తేనే తెలంగాణను అభివృద్ధి చేస్తానని రేవంత్ చెప్పారా..? కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకుని ప్రాజెక్టులకు రూపకల్పన చేశారా..?’’ అని నిలదీశారు. తాను అనేక ఏళ్లుగా తెలంగాణకు సంబంధించిన ఒక్కో ప్రాజెక్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. సంబంధిత అధికారులతో చర్చిస్తున్నానని తెలిపారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రికి కూడా ఉత్తరాలు రాశానని గుర్తు చేశారు. ‘‘రేవంత్ బెదిరింపు రాజకీయాలకు భయపడే వారెవరూ లేరు. ఆయన అసమర్థతను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు రేవంత్ బాధ్యుడవుతారు కానీ.. నేనెందుకు అవుతాను. చేతకాని మాటలు చెప్పి, చేతులు దులుపుకోవాలని చూస్తున్నాడు. మెట్రో రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూపాయి లేదు. కనీసం కార్యాచరణ ప్రణాళిక లేదు. ఇవన్నీ పక్కన పెట్టి.. కేంద్రాన్ని, కిషన్ రెడ్డిని బద్నాం చేయాలని చూస్తారా..?’’ అని కిషన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టు నివేదికను మొన్ననే పంపించారని తెలిపారు. దానిని అన్ని మంత్రిత్వ శాఖలకు పంపాలని, ఆ తర్వాత ప్రధాని కార్యాలయం సమీక్షిస్తుందని, అప్పుడు కేంద్ర మంత్రి వర్గానికి చేరుతుందని వివరించారు. కేంద్రంలో ఒక వ్యవస్థ ఉంటుందని, రేవంత్ దుందుడుకు వైఖరితో మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
మైనింగ్‌లో రాష్ట్రాల పాత్ర కీలకం..
మైనింగ్ రంగంలో రాష్ట్రాల పాత్ర కీలకమని కిషన్ రెడ్డి అన్నారు. మినరల్ బ్లాకుల వేలం, ఉత్పత్తిపై రాష్ట్రాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పదేళ్లుగా ప్రధాని మోదీ నేతృత్వంలో మైనింగ్ రంగంలో ఎంతో ప్రగతిని సాధించామని తెలిపారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఏడాది 448 కొత్త ప్రాజెక్టులను అన్వేషించిందని, అందులో 195 క్లిష్టమైన మినరల్ ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో స్వాతంత్య్రం తర్వాత గనుల తవ్వకం తగ్గిందని, దాన్ని ఒకటిన్నర రెట్లు పెంచామన్నారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎ్‌ఫ)లో రూ.లక్ష కోట్లకు పైగా నిధులు జమయ్యాయని తెలిపారు. ఈ నిధుల్లో విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, తాగునీరు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. డీఎంఎ్‌ఫలో కొత్తగా గృహ, వ్యవసాయ, పశుపోషణ తదితర అంశాలను చేర్చామని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి సముద్రపు నీటి నుంచి పొటాషియం వంటివి వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
Updated Date - Feb 28 , 2025 | 04:11 AM