రాష్ట్రంలో దస్ పర్సంటేజ్ సర్కారు: కవిత
ABN, Publish Date - Feb 25 , 2025 | 04:28 AM
తెలంగాణలో దస్ పర్సంటేజ్ సర్కార్ నడుస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాపాలన లేదని, పర్సంటేజీల పాలన నడుస్తోందని, పర్సంటేజీలు ఇచ్చిన వారికే బిల్లులు మంజూరవుతున్నాయని ఆమె ఆరోపించారు.
మహబూబాబాద్/ కేసముద్రం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో దస్ పర్సంటేజ్ సర్కార్ నడుస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాపాలన లేదని, పర్సంటేజీల పాలన నడుస్తోందని, పర్సంటేజీలు ఇచ్చిన వారికే బిల్లులు మంజూరవుతున్నాయని ఆమె ఆరోపించారు. మహబూబాబాద్‌లో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడ్‌లో నడుస్తోందని, మొదటి పీ- ఫోబియా, రెండో పీ- పాలిటిక్స్ అని, మూడో పీ- పర్సంటేజ్ అని వివరించారు. సీఎం సొంత జిల్లాలో టన్నెల్ కూలిపోతే సీఎం అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాల్సింది పోయి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి పోయారని విమర్శించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి పోయి మద్దతు ధర పై కొట్లాడుతుంటే రేవంత్ మాత్రం రైతుల పరిస్థితిని పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం సాయంత్రం వేళ కేసముద్రం మార్కెట్ మిర్చి యార్డును కవిత సందర్శించారు. గతేడాది క్వింటా రూ.25 వేలు అమ్మిన మిర్చి ఈసారి రూ.11 వేలకు పడిపోయిందని, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి మోదీ కాళ్లు పట్టుకొనైనా మిర్చికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
Updated Date - Feb 25 , 2025 | 04:28 AM