Patancheru Congress: పటాన్‌చెరు కాంగ్రెస్‌లో అసలు ఏం జరుగుతోంది
ABN, Publish Date - Jan 23 , 2025 | 10:08 PM
Patancheru Congress: పటాన్ చెరు కాంగ్రెస్‌లో రాజకీయాలు రచ్చకెక్కాయి. ఇద్దరు నేతల మధ్య మరోసారి గోడవ జరిగింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ మధ్య వివాదం రాజుకుంది.
సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ మధ్య వివాదం రాజుకుంది. మహిపాల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. క్యాడర్‌ను మహిపాల్‌రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ ఫొటో లేదని మండిపడ్డారు.ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లారు. కేసీఆర్ ఫొటో తీసి రేవంత్‌రెడ్డి ఫొటోను కార్యకర్తలు పెట్టారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో కుర్చీలు ధ్వంసం చేశారు. క్యాంపు ఆఫీసులో కుర్చీలను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో పటాన్‌చెరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వివాదంపై పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పందించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం పిరికిపందల చర్య అని ఆక్షేపించారు. రాజకీయ పరిపక్వత లేని వ్యక్తులు ఇది చేశారని మండిపడ్డారు. ఈ వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మహిపాల్ రెడ్డి మాట్లాడారు. దమ్ముంటే టైం చెప్పి రండి... నేనంటో ఏంటో చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. అధికారిక కార్యక్రమాలకు పార్టీ కార్యక్రమాలకు తేడా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ ఈరోజు దాడి చేయించారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ధర్నా చేయొచ్చు కానీ దాడులు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. తాము తలుచుకుంటే మీరు బయట తిరగలేరు... రెండుసార్లు ఓడిపోయినా కాటా శ్రీనివాస్ గౌడ్‌కు బుద్ది రాలేదన్నారు. భవిష్యత్తులో ఇలాగే చేస్తే తీవ్ర పరిణామాలుంటాయి...తప్పుకుండా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఫొటోలు ఎవరివైనా పెట్టుకోవచ్చు... రాజకీయాలకు సంబంధం లేదని చెప్పారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాల వెనుక కొందరు జిల్లా నేతలు ఉన్నారు .. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. సమయం వచ్చినపుడు ఖచ్చితంగా బయటపెడతానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు .
దొంగ ఓట్లతో గెలిచిన వ్యక్తి మహిపాల్ రెడ్డి: కాటా శ్రీనివాస్ గౌడ్
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో ఉందని... ఇందుకు కారణం మహిపాల్ రెడ్డే అని చెప్పారు. ఈ రోజు క్యాంపు కార్యాలయంపై జరిగింది దాడి కాదు...నిఖార్సాన కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన మాత్రమేనని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ కార్యకర్త విషయంలో తనదే బాధ్యత అని చెప్పారు. ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేతలను వెంటబెట్టుకుని తిరుగుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే అసలు ఏ పార్టీలో ఉన్నారో తెలీదు... రెండు పడవల ప్రయాణం చేయెద్దన్నారు. ఏ పార్టీలో ఉండాలో మహిపాల్ రెడ్డి తెల్చుకోవాలని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారుసీఎం రేవంత్ ఫొటోను క్యాంపు కార్యాలయంలో ఎందుకు పెట్టలేదు.. అందుకే కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. గతంలోనే ఎమ్మెల్యేపై పీసీసీతో సహా మంత్రులకు ఫిర్యాదు చేశానని గుర్తుచేశారు. పదేళ్ల కాలంలో ఎంతోమంది కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టి.. ఇప్పుడు అదే పార్టీలోకి ఎమ్మెల్యే రావడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకుకోవడం లేదన్నారు. దొంగ ఓట్లతో గెలిచిన వ్యక్తి మహిపాల్ రెడ్డి అని ఆరోపించారు. మహిపాల్ రెడ్డి విషయంలో పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని కాటా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Updated Date - Jan 23 , 2025 | 10:14 PM