Hyderabad: మాజీ మంత్రి హరీశ్ రావుకు భారీ ఊరట.. అప్పటివరకూ అరెస్టు చేయెుద్దంటూ ఆదేశాలు..
ABN, Publish Date - Feb 05 , 2025 | 06:32 PM
హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు మాజీ మంత్రి హరీశ్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కాగా నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
హైదరాబాద్: తెలంగాణ(Telangana)లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao)కు మరోసారి ఊరట లభించింది. ఈ కేసులో హరీశ్ రావును ఫిబ్రవరి 12 వరకూ అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును మాజీ మంత్రి ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు గతంలో విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయన్ను అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వాటిని పొగడిస్తూ ఈనెల 12 వరకూ అరెస్టు చేయవద్దని చెప్పింది. విచారణ సందర్భంగా ఈనెల 12న సీనియర్ లాయర్‌తో వాదనలు వినిపిస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గడువు కోరారు.
కాగా, ఇదే కేసులో అరెస్టయిన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు తెలంగాణ హైకోర్టు ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మెుదట వారు నాంపల్లి కోర్టును ఆశ్రయించగా.. బెయిల్ పిటిషన్‌ను రెండు సార్లు తిరస్కరించింది. దీంతో ఇద్దరూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పది నెలలుగా జైలులో ఉన్నామని, అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. రూ.లక్ష పూచీకత్తుతో రెండు షూరిటీలూ సమర్పించాలని ఆదేశించింది. అలాగే వ్యక్తిగతమైన పాస్ పోర్టులు సైతం సమర్పించాలని చెప్పింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న దృష్ట్యా పోలీసులకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయెుద్దంటూ భుజంగరావు, రాధాకిషన్ రావును హైకోర్టు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి...
Read Latest Telangana News And Telugu News
Updated Date - Feb 05 , 2025 | 06:40 PM