Hyderabad: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి: మంత్రి ఉత్తమ్..
ABN, Publish Date - Feb 04 , 2025 | 09:20 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కులగణన రిపోర్ట్ వచ్చినట్లు ఎమ్మెల్యేగా ఉన్న తనకే తెలియలేదని, ఇక ప్రజలకు ఎలా తెలుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకూ కులగణన చేయలేదని, అలాంటి వారు ఇక్కడ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు.
హైదరాబాద్: తెలంగాణ కులగణన సర్వేలో బీసీ జనాభా తగ్గిందని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు. బీఆర్ఎస్ సర్వేలో ముస్లిం బీసీలను కలిపిన తర్వాత బీసీ జనాభా 51 శాతం వచ్చిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ సర్వేలో బీసీ జనాభా 56 శాతంగా ఉందని మంత్రి వెల్లడించారు. బీఆర్ఎస్ చేసిన సర్వే కంటే తాము చేసిన సర్వేలో బీసీ జనాభా పెరిగిందని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. గులాబీ పార్టీ సర్వేతో పోలిస్తే తమ కులగణనలో ఓసీల సంఖ్య తగ్గిందని తెలిపారు. ఓటర్ల సంఖ్యతో సర్వే సంఖ్యను పోల్చలేమని, ఓటర్ల లిస్టు ప్రకారం గ్రామాల్లో ఉన్నవారే హైదరాబాద్‌లోనూ ఉంటారని మంత్రి వెల్లడించారు. మంగళవారం జరిగింది సామాజిక న్యాయ అసెంబ్లీ సమావేశాలని ఉత్తమ్ అన్నారు.
కేసీఆర్ హయాంలో సమగ్ర కులగణన రిపోర్ట్ వచ్చినట్లు ఎమ్మెల్యేగా ఉన్న తనకే తెలియలేదని, ఇక ప్రజలకు ఎలా తెలుస్తుందని ఉత్తమ్ అన్నారు. బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకూ కులగణన చేయలేదని, అలాంటి వారు ఇక్కడ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు. తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్ఫూర్తితో నేడు కులగణన జరిగిందని మంత్రి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే ఒక జిరాక్స్ లాగా ఉపయోగపడుతుందని చెప్పారు. అన్ని రకాల సంక్షేమ పథకాల అమలుకు తాము చేసిన సర్వే రిపోర్ట్ వినియోగించుకోవచ్చని చెప్పుకొచ్చారు. కులగణన క్రెడిట్ అంతా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకే ఇవ్వాలని మంత్రి అన్నారు. సర్వే రిపోర్టును అందరికీ అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
కాగా, బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కులగణనపై అసెంబ్లీ కమిటీ హలులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్, పలువురు బీసీ, ఎస్సీ సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ గణాంకాలను పవర్ పాయింట్ ద్వారా క్యాబినెట్ సబ్ కమిటీ వివరించనుంది.
Updated Date - Feb 04 , 2025 | 09:20 PM