Yadadri Bhuvanagiri: మరణంలోనూ.. 8 మందికి జీవితం
ABN, Publish Date - Jan 19 , 2025 | 04:30 AM
ఓ యువకుడు బ్రెయిన్‌డెడ్ కావడంతో అతడి అవయవాలను మరో ఎనిమిది మందికి దానం చేసి కుటుంబసభ్యులు ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.
బ్రెయిన్‌డెడ్ అయిన యువకుడి అవయవాల దానం
మోటకొండూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఓ యువకుడు బ్రెయిన్‌డెడ్ కావడంతో అతడి అవయవాలను మరో ఎనిమిది మందికి దానం చేసి కుటుంబసభ్యులు ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. కుటుంబసభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూరుకు చెందిన మల్గా నవీన్(36) అతని కుమారుడు తనీశ్‌తో కలిసి ఈనెల 12న గ్రామంలోని వ్యవసాయ పొలానికి వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో మోటకొండూరు శివారులో విద్యుత్ స్తంభాలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయమై రక్తస్రావం అయింది.
వెంటనే చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 15న మృతి చెందాడు. నవీన్ అవయవాలను దానం చేయాలని వైద్యులు కోరగా కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. కాగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ శనివారం మండల కేంద్రంలోని సబ్ స్టేషన్‌కు తాళంవేసి గ్రామస్థులు, కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు, విద్యుత్ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Updated Date - Jan 19 , 2025 | 04:30 AM