ఎస్బీఐ చేతికిరూ.30.71 కోట్ల శీతల్ రిఫైనరీస్ స్థిరాస్థులు
ABN, Publish Date - Feb 16 , 2025 | 04:48 AM
బ్యాంకులను మోసం చేసిన కేసులో హైదరాబాద్‌కు చెందిన శీతల్ రిఫైనరీస్ నుంచి ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిన రూ.30.71 కోట్ల స్థిరాస్థులను ఎస్బీఐకి ఈడీ అధికారులు అప్పగించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): బ్యాంకులను మోసం చేసిన కేసులో హైదరాబాద్‌కు చెందిన శీతల్ రిఫైనరీస్ నుంచి ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిన రూ.30.71 కోట్ల స్థిరాస్థులను ఎస్బీఐకి ఈడీ అధికారులు అప్పగించారు. నకిలీ బ్యాంకు గ్యారంటీలు సమర్పించి శీతల్ రిఫైనరీస్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.190 కోట్ల రుణం తీసుకుంది. అయితే బ్యాంకు అధికారుల విచారణలో మోసం జరిగినట్లు వెల్లడికావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 21 నకిలీ బ్యాంకు గ్యారంటీల ద్వారా ఈ మొత్తం సొమ్ము బదిలీ అయినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ క్రమంలో ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించి బ్యాంకులను మోసం చేసిన డబ్బును షెల్ (డొల్ల) కంపెనీలకు మళ్లించి వాటి ద్వారా శీతల్ రిఫైనరీస్ యాజమాన్యం ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో 2016 నుంచి 2022 వరకు విడతల వారీగా శీతల్ రిఫైనరీ్‌సకు చెందిన రూ.52.77 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. అయితే ఇటీవల ఎస్బీఐ.. ఈడీ న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేసి ఈడీ ఆధీనంలో ఉన్న శీతల్ రిఫైనరీస్ ఆస్తులను వేలం వేసేందుకుగాను తమకు అప్పగించాలని అభ్యర్థించింది. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో రూ.30.71 కోట్ల స్ధిరాస్తులను ఎస్బీఐకి అప్పగించాలని ఆదేశించింది.
Updated Date - Feb 16 , 2025 | 04:48 AM