Sangareddy: ఆ ఊర్లో 500ఇళ్లు ప్రభుత్వ స్థలాల్లోనే...!
ABN, Publish Date - Feb 21 , 2025 | 05:33 AM
ఆ స్థలాలు వారి తాతముత్తాల నుంచి వారసత్వంగా వచ్చాయి. స్థలాల పత్రాలు వారి పేరిటే ఉన్నాయి. ఇళ్లు కట్టుకుని ఉంటున్నారు. కానీ అవన్నీ సర్కారు స్థలాలని తాజా రికార్డులు చెబుతుండటంతో ఆ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
ప్రైవేటువైనా ఈ-పంచాయతీలో ప్రభుత్వానివిగా నమోదు
సంగారెడ్డి జిల్లా చేర్యాల గ్రామస్థుల్లో ఆందోళన
కంది, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఆ స్థలాలు వారి తాతముత్తాల నుంచి వారసత్వంగా వచ్చాయి. స్థలాల పత్రాలు వారి పేరిటే ఉన్నాయి. ఇళ్లు కట్టుకుని ఉంటున్నారు. కానీ అవన్నీ సర్కారు స్థలాలని తాజా రికార్డులు చెబుతుండటంతో ఆ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల గ్రామంలోని సుమారు 500 ఇళ్ల స్థలాలు ప్రభుత్వ స్థలాలుగా ‘ఈ- పంచాయతీ’ వెబ్‌సైట్‌లో నమోదైనట్టు గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఒకరు తన ఇంటి పత్రాలతో రుణం కోసం బ్యాంకుకు వెళ్లగా.. ఇంటి స్థలం ప్రభుత్వ స్థలంగా ఉందని, రుణం ఎలా ఇస్తామనడంతో ఆశ్చర్యపోయాడు.
వెంటనే సదరు వ్యక్తి గ్రామ కార్యదర్శిని అడగ్గా.. ఆయన ఈ-పంచాతీయ వెబ్‌సైట్‌లో చూసి చేర్యాలలోని సుమారు 500 ఇళ్లు, ఇళ్ల స్థలాలు ప్రభుత్వానివిగా చూపుతున్నాయన్నారు. గ్రామంలో 846 ఇళ్లు ఉండగా సుమారు 500 ఇళ్లు ప్రభుత్వ స్థలాల్లో ఉన్నట్లు చూపడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల రికార్డులను 2012లో ప్రభుత్వ అధికారులు ఈ-పంచాయతీ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. ఈ సమయంలో అధికారుల నిర్లక్ష్యంతో గ్రామంలోని ప్రైవేట్ స్థలాలను ప్రభుత్వ స్థలాలుగా నమోదు చేసినట్లు అనుమానిస్తున్నారు. కాగా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చేర్యాల పంచాయతీ కార్యదర్శి సుధీర్ రెడ్డి తెలిపారు.
Updated Date - Feb 21 , 2025 | 05:33 AM