హైదరాబాద్-బెంగుళూరు డిఫెన్స్ కారిడార్ ప్రకటించండి
ABN, Publish Date - Mar 01 , 2025 | 04:21 AM
రక్షణ రంగంలో దేశం మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు హైదరాబాద్- బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌ను ప్రకటించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు.
‘రక్షణ’లో మరిన్ని పెట్టుబడులు ఖాయం
విజ్ఞాన్ వైభవ్-2025లో సీఎం రేవంత్
దేశ ఆర్థికాభివృద్ధిలో సైన్స్ పాత్ర కీలకం
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రక్షణ రంగంలో దేశం మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు హైదరాబాద్- బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌ను ప్రకటించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్స్‌లెన్స్ సంయుక్తంగా హైదరాబాద్, గచ్చిబౌలి స్టేడియంలో ‘విజ్ఞాన్ వైభవ్-2025’ పేరిట ఏర్పాటు చేసిన రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శనను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి సీఎం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ హైదరాబాద్, బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ ప్రకటిస్తే పెద్దఎత్తున పెట్టుబడులు వస్తాయని అన్నారు. రక్షణ రంగ ఉత్పత్తుల అంశంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు. యువతకు దేశభక్తి పట్ల అవగాహన కల్పించడానికి సైన్స్ ఎగ్జిబిషన్ దోహదపడుతుందని తెలిపారు. దేశానికి సాంప్రదాయక ఇంజనీర్ల అవసరం ఉందని, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ పట్టభద్రులను దేశానికి అందించేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తున్నామని వివరించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. దేశ ఆర్థికాభివృద్ధిలో సైన్ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజా జీవితంలోకి రాక ముందు తాను భౌతికశాస్త్ర అధ్యాపకునిగా పని చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం, వారిని వినూత్న ఆవిష్కరణలు, పరిశోధనల వైపు ప్రోత్సహించడమే జాతీయ విద్యా విధానం-2020లక్ష్యమని తెలిపారు. యువత శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఇక, 2024లో రూ.245 లక్షల కోట్ల విలువైన 171 బిలియన్ యూపీఐ లావాదేవీలు జరిగాయని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆధునిక యుద్ధాల్లో సాఫ్ట్‌వేర్ ప్రధాన పాత్ర పోషిస్తోందని అన్నారు.
అస్త్రాలు.. ఆవిష్కరణలు
యువతకు విజ్ఞాన్ వైభవ్-2025 ఎగ్జిబిషన్ ఓ గొప్ప అనుభూతి ఇస్తోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎ్‌స) సహా పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, రక్షణ రంగానికి చెందిన పలు కంపెనీలు తమ ఉత్పత్తులు, ఆవిష్కరణలను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తున్నాయి. హైదరాబాద్‌లోని పాఠశాలలు, కళాశాలలకు చెందిన వారితోపాటు సమీప జిల్లాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సినిమాలు, పత్రికలు, పుస్తకాల్లో చూసే క్షిపణులు, రాకెట్ లాంచర్లు, టార్పిడోలను ప్రత్యక్షంగా చూసి సంబరపడిపోయారు. ఈ ప్రదర్శనను తిలకించిన తర్వాత తమకు దేశ రక్షణలో భాగం కావాలని ఉందని, ఈ రంగంలో ఆవిష్కరణలు చేయాలనే ప్రేరణ కలిగిందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. తమ పర్యటన వృథా కాలేదని, ప్రదర్శనకు రాకపోయి ఉంటే ఎంతో కోల్పోయేవాళ్లమని ఖమ్మం న్యూఎరా స్కూల్ విద్యార్థులు పేర్కొన్నారు. అగ్ని-5 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి, రుద్ర ఎం-2 క్షిపణి, పినాకా- మల్టీ బారెల్ రాకెట్ లాంచర్, గైడెడ్ పినాకా(ఆర్టిలరీ మిస్సైల్ వ్యవస్థ), లాంగ్ రేంజ్ హైపర్‌సోనిక్ గ్లైడ్ మిస్సైల్, మౌంటెడ్ గన్ సిస్టమ్, అర్జున్ ఎంకె 1 ఏ యుద్ధట్యాంక్ , మరిన్ని ఆయుధాలు ఈ ప్రదర్శనలో విద్యార్థులను అమితంగా ఆకట్టుకున్నాయి. అలాగే, ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు పంపే చిత్రాలను విశ్లేషించి సమాచారం ఇచ్చే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ స్టాల్, భారత వాయుసేనకు దన్నుగా నిలిచే హిందుస్థాన్ ఏరోనాటికల్స్ సంస్థ స్టాల్, చంద్రయాన్ స్టాల్‌లు ఆకట్టుకున్నాయి. ఇక, యుద్ధ ట్యాంకులు శత్రువుల ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు అభివృద్ధి చేసిన ఎలక్ర్టోమాగ్నటిక్ షీల్డ్ సాంకేతికతను డీఆర్‌డీవో ప్రదర్శించింది.
Updated Date - Mar 01 , 2025 | 04:21 AM