Bhatti Vikramarka: రూ.3 వేల కోట్లతో.. ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు
ABN, Publish Date - Feb 22 , 2025 | 04:51 AM
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ యువతకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.3 వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలను అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు.
సంక్షేమం కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం
వివిధ సంక్షేమ శాఖల బడ్జెట్ ప్రతిపాదనల భేటీలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ యువతకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.3 వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలను అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల బడ్జెట్ ముందస్తు సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయా శాఖల బడ్జెట్ ప్రతిపాదనలను భట్టి సమీక్షించారు. ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమ పథకాలకు ఎన్ని నిధులైనా వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. గత పదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ యువతకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేయలేదన్నారు. ఈ దృష్ట్యా కాంగ్రెస్ సర్కారు హయాంలో ఈ పథకాలను తేవాల్సి ఉందని.. వాటికి సంబంధించిన ప్రణాళికలను వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల అద్దెలు, డైట్ చార్జీలను ఎప్పటికప్పుడు చెల్లించాలన్నారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను అధికారులు ఆర్థికశాఖ నుంచి ఎప్పటికప్పుడు క్లియర్ చేయించుకోవాలన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు నిరంతరం తనిఖీ చేసేలా సంక్షేమ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్ర పథకాల యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించి, నిధులు రాబట్టడంలో వేగం పెంచాలని పేర్కొన్నారు.
జర్నలిస్టులకు ఆరోగ్య, జీవిత బీమా: భట్టి
జర్నలిస్టులకు ఆరోగ్య బీమా కల్పించడంతోపాటు జీవిత బీమా కల్పించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయిస్తామని చెప్పారు. జర్నలిస్టుల ఇండ్ల సమస్య కోర్టు పరిధిలో ఉన్నందున.. దానిపై ఎలా ముందుకు వెళ్లాలన్నదీ ఆలోచిస్తున్నామని తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలి్‌స్ట్స(హెచ్‌యూజే)-2025 డైరీని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను యూనియన్ ప్రతినిధులు భట్టి దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని జర్నలిస్టులకు భట్టి హామీ ఇచ్చారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.అరుణ్, జగదీష్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నేతలు దండా రామకృష్ణ తదితరులుపాల్గొన్నారు.
Updated Date - Feb 22 , 2025 | 04:51 AM