R Krishnaiah: తప్పులతడకగా కులగణన నివేదిక
ABN, Publish Date - Feb 04 , 2025 | 03:46 AM
కులగణన సర్వే నివేదిక తప్పుల తడకగా ఉందని బీసీ ఉద్యమ నేత, బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. గతంలో కన్నా బీసీల జనాభా తగ్గిందని, ఓసీల జనాభా పెరిగిందని చూపడం వెనుక కుట్ర ఉందన్నారు.
‘ఈడబ్ల్యూఎ్‌స’ను కాపాడే కుట్ర.. సీఎం సమీక్షించాలి: ఆర్.కృష్ణయ్య
బీసీ జనాభా మాత్రమే ఎలా తగ్గింది?.. నివేదికను ఒప్పుకోం: జాజుల
నివేదికలో వివరాలన్నీ గందరగోళం: గుజ్జ సత్యం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): కులగణన సర్వే నివేదిక తప్పుల తడకగా ఉందని బీసీ ఉద్యమ నేత, బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. గతంలో కన్నా బీసీల జనాభా తగ్గిందని, ఓసీల జనాభా పెరిగిందని చూపడం వెనుక కుట్ర ఉందన్నారు. ఈడబ్ల్యూస్ రిజర్వేషన్‌ను కాపాడే, బీసీ రిజర్వేషన్‌ను నీరు గార్చే కుట్రలో భాగంగానే బీసీల జనాభాను తక్కువ చేసి చూపించారని ఆరోపించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నివేదికపై సీఎం రేవంత్ సమగ్రంగా సమీక్షించాలని, పూర్తి పారదర్శకతతో గణంకాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా బీసీల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 10శాతం ఉన్న ఓసీల జనాభా.. ప్రస్తుతం 15శాతానికి పెరిగినప్పుడు, బీసీల జనాభా మాత్రం 52 శాతం నుంచి 46శాతానికి ఎలా తగ్గుతుందని నిలదీశారు. కులగణన సర్వే నివేదిక గందరగోళంగా ఉందని, ఈ వివరాలపై సమగ్ర సమీక్ష జరపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 2.20కోట్ల మంది బీసీలు ఉంటే.. 1.64కోట్లు మాత్రమేనని ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. కాగా, స్థానిక ఎన్నికల్లో గెలవాలన్న కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ తప్పుడు నివేదికను ప్రకటించిందని మాజీ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్ ఆరోపించారు. తమ అంచనా ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 60శాతానికి పైగా ఉండాలని, అరకొర సర్వేలతో కాంగ్రెస్ సర్కార్ బీసీలను మోసంచేస్తోందని విమర్శించారు. వారి మోసాలను తిప్పి కొట్టేందుకు తెలంగాణలో మరో బీసీ ఉద్యమం రానుందని పేర్కొన్నారు. కాగా, బీసీ కులగణన నివేదిక ఆధారంగా ఎన్నికలతోపాటు విద్యా, ఉద్యోగ రంగాలలో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జీవో జారీ చేయాలని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ వీజీఆర్ నారగోని డిమాండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రత్యేక జీవోను జారీ చేయాలని సూచించారు. త్వరలో భర్తీ చేయనున్న ఆరు మంత్రుల పోస్టులను బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో బీసీ జనాభా మాత్రమే తగ్గిందా? ఈ నివేదికను తాము ఒప్పుకోబోమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్, బీసీ మేధావుల ఫోరం వ్యవస్థాపకుడు టి.చిరంజీవులు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం, పట్టణాల్లో 40శాతం కుటుంబాల్లో మాత్రమే సర్వే జరిగిందని, ఈ నివేదికను అసెంబ్లీలో ఆమోదిస్తే బీసీలకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈ లెక్కలను సరి చేయడానికి రెండో సారి కులగణన నిర్వహించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..
Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు
Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Feb 04 , 2025 | 03:46 AM