Deportation of Indians in Handcuffs: సంకెళ్లు వేసి మరీ అమెరికా నుంచి భారతీయుల తరలింపు.. చట్టం ఏం చెబుతోందంటే!
ABN, Publish Date - Feb 06 , 2025 | 06:34 PM
అరెస్టు సందర్భంగా సంకెళ్ల వినియోగంపై భారత్, అమెరికా చట్టాల్లో ఏమి ఉందంటే..
మెరుగైన జీవితం కోసం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన అనేక భారతీయులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకీడుస్తున్నారు. వారితో పోలీసులకు కానీ స్థానికులకు కానీ ఎలాంటి ప్రమాదం లేదు. అయితే, అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కారు వారిని సంకెళ్లతో బంధించి సొంత దేశాలకు సైనిక విమానాల్లో పెద్ద ఎత్తున తరలిస్తోంది. భారతీయులను కూడా ఇదే విధంగా తరలిస్తుండంపై మన దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సంకెళ్లు వేసి మరీ తరలించడం అమానవీయమంటూ భారత్‌లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి (Viral).
ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు సహా ప్రముఖ నేతలు అనేక మంది సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అమానవీయ చర్య అని పేర్కొన్నారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా ఈ విషయమై వివరణ ఇచ్చారు. అమెరికాలో అరెస్టు సందర్భంగా వ్యక్తులకు బేడీలు వేయడం అక్కడి పోలీసులు అనుసరించే ప్రామాణిక పద్ధతి అని వివరించారు. ఈ నేపథ్యంలో బేడీల వినియోగానికి సంబంధించి రెండు దేశాల మధ్య తేడాలను న్యాయ నిపుణులు వివరిస్తున్నారు.
H-1b Registrations: హెచ్-1బీ రిజిస్ట్రేషన్స్‌లో 38 శాతం మేర తగ్గుదల!
న్యాయ నిపుణులు చెప్పేదాని ప్రకారం, అమెరికాలో చట్టబద్ధమైన అరెస్టు సందర్భంగా వ్యక్తులకు బేడీలు వేయడమనేది ప్రామాణిక పద్ధతి. వ్యక్తులు తప్పించుకోకుండా లేదా అరెస్టును ప్రతిఘటించకుండా ఉండేందుకు అక్కడి పోలీసులు బేడీలు, సంకెళ్లను వినియోగిస్తారు. అమెరికా న్యాయశాఖ వెబ్‌సైట్ ప్రకారం, అరెస్టు సందర్భంగా ఘటనా స్థలంలో ఉన్న వారి భద్రత దృష్ట్యా అరెస్టైన వారికి బేడీలు వేసే అధికారం పోలీసులకు ఉంది. నేరం ఎంత తీవ్రమైనదనే అంశంతో నిమిత్తం లేకుండా పోలీసులు సంకెళ్లను వినియోగించవచ్చు. విచారణ సందర్భాల్లో కూడా వ్యక్తుల చేతులకు బేడీలు వేయొచ్చు. అక్కడి పరిభాషలో దీన్ని టెర్రీ స్టాప్ అని పిలుస్తారు. బేడీలు వేయడమంటే వ్యక్తుల హక్కులకు భంగం కలిగిస్తూ బలప్రయోగం చేయడం కాదని అమెరికా చట్టాలు చెబుతున్నాయి.
Vivek Ramaswamy DOGE: మిమ్మల్ని మస్క్ తొలగించారా అన్న ప్రశ్నకు వివేక్ రామస్వామి సమాధానం ఏంటంటే..
ఇక భారత్‌లో బేడీల విషయంలో స్పష్టమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. వ్యక్తులకు బేడీలు వేయడమంటే ఆర్టికల్ 21 కింద వారికున్న జీవించే హక్కు స్వేచ్ఛా హక్కును ఉల్లంఘించడమేనని భారత సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టం చేసింది. బేడీల వినియోగం పరిపాటిగా మారరాదని పలు కోర్టులు కూడా అనేక తీర్పులు వెలువరించారు. ఈ తీర్పుల ప్రకారం, అవసరమైన సందర్భాల్లో మాత్రమే వ్యక్తుల అరెస్టు సందర్భంగా బేడీలు వినియోగించొచ్చు. ఇందుకు గల కారణాలను కూడా లిఖిత పూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంది.
బేడీల వినియోగానికి సంబంధించి సుప్రీం కోర్టు రెండు కీలక తీర్పులు వెలువరించిందని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తులకు బేడీలు వేయడం ప్రాథమికంగా చూస్తే అమానవీయమని, సహేతుకం కాదని ప్రేమ్‌శంకర్ శుక్లా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ (1980) కేసులో సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. వ్యక్తులు పారిపోయే అవకాశం లేదా హింసకు దిగే అవకాశం ఉందనేందుకు ఆధారాలు ఉన్న సందర్భాల్లోనే బేడీలు వేయాలని పేర్కొంది. వీలుంటే సంకెళ్లకు బదులు పోలీసు ఎస్కార్ట్‌ను వినియోగించాలని స్పష్టం చేసింది. ఇక సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ కేసులో కూడా సుప్రీం కోర్టు దాదాపుగా ఇదే తీర్పు వెలువరించింది. అకారణంగా వ్యక్తులకు సంకెళ్లు వేయడం అమానవీయమని స్పష్టం చేసింది. ఇక విచారణ ఖైదీలకు మేజిస్ట్రేట్ అనుమతి లేనిదే సంకెళ్లు వేయకూడదు. ఇలా చేసిన పోలీసులు తమ చర్యలకు బాధ్యత వహించ వలసి ఉంటుంది.
Updated Date - Feb 06 , 2025 | 06:54 PM