World Record for hairiest face: అరుదైన వ్యాధి ఉన్న మధ్యప్రదేశ్ యువకుడికి గిన్నిస్ రికార్డు
ABN, Publish Date - Mar 06 , 2025 | 10:06 PM
మధ్యప్రదేశ్ టీనేజర్‌కు అరుదైన గుర్తింపు దక్కింది. ముఖంగా అత్యంత దట్టంగా రోమాలున్న వ్యక్తిగా లలిత్ అనే టీనేజర్ గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్ మధ్యప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల లలిత్ పాటీదార్ అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ముఖంపై అత్యధికంగా రోమాలు గల వ్యక్తిగా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు గిన్నిస్ రికార్డుల్లో చోటు సాధించాడు.
హైపర్ ట్రైకోసిస్ అనే అరుదైన వ్యాధితో లలిత్ ఇబ్బంది పడుతున్నాడు. ఈ వ్యాధిని వేర్‌వుల్ఫ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఈ జన్యు సమస్య ఉన్న వారిలో రోమాలు శరీరమంతా మొలుస్తాయి. ఈ సమస్యకు సంబంధించి ఇప్పటివరకూ కేవలం 50 కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఇక లలిత్ ముఖంపై ప్రతి చదరపు సెంటీమీటరుకు సగటున 201.72 వెంట్రుకలు ఉన్నాయి. దీంతో ప్రపంచంలోనే ముఖంపై అత్యధికంగా రోమాలు కలిగిన వ్యక్తిగా లలిత్ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అతడి ముఖ్యంలో దాదాపు 95 శాతం రోమాలతో కప్పి ఉన్నట్టు గిన్నిస్ రికార్డు వారు పేర్కొన్నారు.
Gold allowed on Flights: ఈ కస్టమ్స్ రూల్స్ తెలుసా.. విమాన ప్రయాణికులు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చంటే..
అయితే, చిన్నతనంలో తాను చాలా ఇబ్బంది పడ్డానని లలిత్ మీడియాకు తెలిపాడు. క్లాస్‌లో స్నేహితులతో పాటు ముక్కూముఖం తెలియని వారు కూడా తనను ఆటపట్టించే వారని అన్నాడు. ‘‘కొందరు మొదట్లో నన్ను చూసి బయపడే వారు. ఆ తరువాత నా గురించి పూర్తిగా తెలుసుకున్నాక నాతో మాట్లాడం ప్రారంభించే వారు. నేను చూడటానికి భిన్నంగా ఉండొచ్చేమో కానీ అందరు లాంటి వ్యక్తినే’’ అని అన్నాడు.
ఇతరుల పరుష వ్యాఖ్యలు తనను కాయపరచవని అతడు చెప్పుకొచ్చాడు. ఇదే తన గుర్తింపుగా స్వీకరించినట్టు కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తానో యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తున్నానని, రోజు వారి జీవితపు విశేషాలను పంచుకుంటున్నానని తెలిపాడు.
ఇక గిన్నిస్ రికార్డు కోసం అతడు ఇటలీలోని మిలాన్ నగరానికి వెళ్లారు. అక్కడి వారు అతడి ముఖంపై వెంట్రుకలను కొలిచి రికార్డుల్లోకి చేర్చి గిన్నిస్ రికార్డును బహూకరించారు. గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడంపై కూడా లలిత్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘నాకు నోట మాటరావట్లేదు. ఈ గుర్తింపు దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా ముఖం మీద ఉన్న రోమాలు షేవ్ చేసుకోవాలని చాలా మంది చెబుతుంటారు. కానీ నా ఈ తీరు నాకెంతో ఇష్టం. నా లుక్స్‌ను మార్చదలుచుకోలేదు’’ అని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు లలిత్.
Updated Date - Mar 06 , 2025 | 10:06 PM