Scientist Kazumi Ozaki: భూమిపై ఆక్సిజన్ అయిపోతుందా.. శాస్త్రవేత్తలు చెప్పిన సంచలన విషయాలు..
ABN, Publish Date - Feb 19 , 2025 | 12:07 PM
విశ్వం ఆవిర్భావం సహా భూమి ఇతర గ్రహాల గురించిన విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అందుకే అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటారు. అందులో భాగంగానే వాతావరణం, జీవం ఆవిర్భావం, భౌగోళిక వ్యవస్థల్లో మార్పులను అర్థం చేసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు నివాసయోగ్యమైన కొత్త గ్రహాల కోసం వెతుకుతున్నారు. అక్కడ జీవం ఉందా, లేదా? అని తలమునకలు అవుతున్నారు. అంగారక గ్రహం నుంచి చంద్రుని వరకూ దేన్నీ వదిలిపెట్టకుండా పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇటీవల భూమిపై శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. భూమిపై ఆక్సిజన్ అంతా అయిపోయే రోజు రాబోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ జాతి అంతం అవుతుందని హెచ్చరిస్తున్నారు. వారి పరిశోధనలకు సంబంధించిన సంచలన విషయాలను శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు.
విశ్వం ఆవిర్భావం సహా భూమి ఇతర గ్రహాల గురించిన విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అందుకే అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటారు. అందులో భాగంగానే వాతావరణం, జీవం ఆవిర్భావం, భౌగోళిక వ్యవస్థల్లో మార్పులను అర్థం చేసుకున్నారు. అలాగే భూమిపై వాయువులు ఎలా ఉద్భవించాయో సైతం కనుగొన్నారు. అయితే తాజాగా ఓ అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైన కథనం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. భూమిపై ఆక్సిజన్ తగ్గిపోయి భారీ మొత్తంలో మీథేన్ వాయువు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆక్సిజన్ ఎప్పుడు అయిపోతుంది?
బయోజెకెమికల్, వాతావరణ నమూనాలను ఉపయోగించి ఇటీవల పరిశోధనలు చేసినట్లు శాస్త్రవేత్త కజుమి ఓజాకి తెలిపారు. ఈ పరిశోధనలో భూమిపై ఆక్సిజన్ క్షీణించి మీథేన్ వాయువు భారీ పరిమాణంలో పెరుగుతుందని వెల్లడైనట్లు ఆయన చెప్పారు. భూమిపై ఆక్సిజన్ తగ్గేందుకు ఓ బిలియన్ సంవత్సరాల కాలం పడుతుందని ఓజాకి వెల్లడించారు. ఆక్సిజన్ కొరత అనేది సూర్యుడి సహా నక్షత్రాల నుంచి వెలువడే సౌర ప్రవాహంలో మార్పుల వల్ల సంభవిస్తుందని తాము కనిపెట్టినట్లు చెప్పారు ఓజాకి. నక్షత్రాల ఉష్ణోగ్రత భవిష్యత్తులో పెరుగుతుందని, దీని ప్రభావంతోనే భూమిపై ఆక్సిజన్ క్షీణిస్తుందని వెల్లడించారు.
అయితే గతంలోనూ ఇలాంటి పరిస్థితి భూమిపై ఏర్పడిందని శాస్త్రవేత్త కజుమి ఓజాకి చెబుతున్నారు. భూమిపై ఆక్సిజన్ కొరత అనేది ఆర్కియన్ ఇయాన్ యుగంలో జరిగిందని తెలిపారు. ఈ పరిస్థితి 2.4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఏర్పడిందని చెప్పారు. వాతావరణంలో ఆక్సిజన్ శాతం ప్రస్తుతం 21 శాతంగా ఉందని, అయితే భవిష్యత్తులో తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో ఖండాలన్నీ వేడెక్కి అగ్నిపర్వతాలు పేలే ప్రమాదం ఉందన్నారు. అలా జరిగితే భూమి ఇక ఏమాత్రం నివాసం యోగ్యం కాదని హెచ్చరించారు ఓజాకి.
కొత్త ఖండం ఏర్పడే అవకాశం..
మరోవైపు భూమి లోపల అనేక మార్పులు జరిగి కొత్త ఖండం ఏర్పడుతుందని బ్రిస్టల్ విశ్వవిద్యాలయం పరిశోధన వెల్లడించింది. అలా ఏర్పడిన ఖండంలో విపరీతమైన వేడి ఉంటుందని, దీంతో అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 50 సెల్సియస్ డిగ్రీలకు (122 °F) చేరుకుంటాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇలాంటి వాతావరణంలో క్షీరదాలు జీవించడం దాదాపు అసాధ్యం కావొచ్చని తెలిపారు. ఒకవేళ భూమిపై మార్పుల వల్ల సముద్రాలు మాయమైతే అగ్నిపర్వతాలు పేలి విపరీతంగా కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందని.. ఇది గ్రీన్‌హౌస్ ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని తెలిపారు. అలా జరిగితే ఆక్సిజన్ తగ్గిపోయి మానవ జాతి సహా అన్నీ జీవుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని పరిశోధన వెల్లడించింది.
Updated Date - Feb 19 , 2025 | 12:44 PM