DeepSeek: డీప్‌సీక్ ఏఐ వాడేవాళ్లకు అలర్ట్! మీ సమాచారం ఎవరి చేతుల్లోకి వెళుతోందో తెలుసా?
ABN, Publish Date - Feb 06 , 2025 | 02:52 PM
యూజర్ల సమాచారాన్ని డీప్‌సీక్ చైనాకు తరలిస్తోందంటూ ఓ యూట్యూబర్ ఆధారాలతో సహా నిరూపించిన వైనం ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మీ సమాచారం మా వద్ద భద్రంగా ఉంటుందని హామీ ఇచ్చిన సంస్థ సైలెంట్‌గా మాట తప్పితే ఒళ్లు మండిపోవడం పక్కా. అయితే, చైనా ఏఐ సంస్థ డీప్‌సీక్ ఇదే చేస్తోందని చెబుతున్నారు ఓ ఐటీ ట్రెయినర్. ఈ అంశంపై డేవిడ్ బొంబాల్ అనే ఐటీ నిపుణుడు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. యూజర్ల సమాచారాన్ని డీప్‌సీక్ ఎక్కడికి చేరవేస్తోందీ అతడు ఆధారాలతో సహా నిరూపించాడు. దీంతో, అంశంపై పెద్ద చర్చ మొదలైంది ( Technology).
ఎథర్‌నెట్ కేబుల్, వైర్ టాప్‌తో డేవిడ్ బొంబాల్.. డీప్‌సీక్ యూజర్ల సమాచారం చైనా రాజధానికి తరలిపోతున్న విషయాన్ని రుజువు చేసే ప్రయత్నం చేశారు. తన సమాచారం ఎక్కడికి చేరుతోందీ రియల్ టైంలో చూపించిన తన వాదన నిజమని చెప్పే ప్రయత్నం చేశాడు. సమాచారం బదిలీని విశ్లేషించేందుకు వినియోగించే వైర్‌షార్క్ అన సాధనంతో డీప్‌సీక్‌లోని తన సమాచారం అంతిమంగా ఎక్కడకు చేరుతోందో గుర్తించాడు.
ChatGPT: డీప్‌సీక్‌కు పోటీగా చాట్‌జీపీటీ నుంచి కొత్త ఫీచర్..
డీప్‌సీక్‌ను చైనా కంపెనీ రూపొందించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో, తొలి నుంచి యూజర్ల సమాచార భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఈ టెన్షన్ అవసరం లేదని డీప్‌సీక్ భరోసా ఇచ్చింది. యూజర్ల సమాచారాన్ని తాము చైనాకు తరలించట్లేదని చెప్పింది. కానీ వాస్తవంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోందని డేవిడ్ బొంబాల్ నిరూపించే ప్రయత్నం చేశాడు. డీప్‌సీక్ ఇచ్చిన హామీకి వాస్తవ పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని అన్నాడు.
ట్రాయ్ రూ.20 రూల్.. మీ సిమ్ వాడకపోయినా డీయాక్టివేట్ కాకుండా ఉండాలంటే..
వైర్‌షార్క్‌తో తన ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి బయటకు వెళుతున్న సమాచారాన్ని అతడు విశ్లేషించగా మొత్తం 51 డేటా ప్యాకెట్లు బీజింగ్‌కు చేరినట్టు తేలిందన్నాడు. ఈ డేటా అలీబాబా క్లౌడ్ ద్వారా కూడా చైనాకు చేరుతున్నట్టు ఉండటం తనకు ఆందోళన కలిగిస్తోందని అన్నాడు. దీంతో, యూజర్ల సున్నితమైన సమాచారంపై డీప్‌సీక్ తీసుకుంటున్న చర్యలపై అనుమానాలు వస్తు్న్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే, బీజింగ్‌కు చేరిన డేటా ప్యాకెట్లలో ఏ తరహా సమాచారం ఉందో ఇంకా తెలియలేదని, దీనిపై మరిన్ని పరీక్షలు జరపాల్సి ఉందని అన్నాడు.
కాగా, ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు డీప్‌సీక్ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అడ్డుకునే విధంగా అమెరికాలో కొత్త చట్టం రావొచ్చని అన్నారు. మరికొందరు మాత్రం ఇందులో అసాధారణమైన అంశం ఏదీ లేదని కొట్టి పారేశారు. చైనా సంస్థ యూజర్ల సమాచారాన్ని తమ దేశానికి తరలించుకుపోవడం ఊహించినదేనని అన్నారు.
Read Latest and Technology News
Updated Date - Feb 06 , 2025 | 03:02 PM