Costa Rica Drug Lord: భార్య చేసిన మిస్టేక్.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన క్రిమినల్ గ్యాంగ్ లీడర్!
ABN, Publish Date - Jan 27 , 2025 | 02:01 PM
కోస్టారీకాకు చెందిన ఓ పేరుమోసిన గ్యాంగ్ లీడర్‌ను అమెరికా పోలీసులు లండన్‌లో అరెస్టు చేశారు. భార్యతో విదేశీ టూర్‌లో ఉండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. తమ టూర్‌కు సంబంధించి నిందితుడి భార్య పెట్టిన ఫొటోల ఆధారంగా అతడి ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అతడు ఓ మాదకద్రవ్యాల ముఠా గ్యాంగ్ లీడర్. గతంలో అతడిపై రెండు సార్లు హత్యా యత్నం జరిగింది. అయినా మరణాన్ని తప్పించుకోగలిగాడు. అమెరికా పోలీసులు అతడి కోసం తెగ గాలిస్తున్నా దొరక్కుండా ముప్ప తిప్పలు పెడుతున్నాడు. కానీ, భార్యతో దిగిన సెల్ఫీ అతడి కొంప ముంచింది. చివరకు పోలీసులకు చిక్కేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే (Viral)..
కోస్టారీకాకు చెందిన లూయీ గ్రిజాల్బా పేరు మోసిన గ్యాంగ్‌స్టర్. అమెరికాకు మాదకద్రవ్యాలను రవాణా చేస్తూ అగ్రరాజ్య పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అతడిని తమ దేశం పంపించాలని కోరినా కోస్టారీకా వినిపించుకోలేదు. తమ దేశస్తులను ఇతర దేశాలకు అప్పగించేందుకు సంప్రదాయం కోస్టారీకాకు లేదు. దీంతో, అమెరికా పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. లూయీ భార్య ఎస్టఫేనియా మెక్‌డొనాల్డ్ రోడ్రీగెజ్ సోషల్ మీడియా పోస్టులపై నిఘా పెట్టారు (Costa Rica Drug Lord arrested in London).
Wells: బావులన్నీ వలయాకారంలోనే ఉంటాయి? ఇలా ఎందుకని డౌటొచ్చిందా?
ఇవేవీ తెలియని లూయీ కొత్త ఏడాది భార్య ముచ్చట తీర్చేందుకు భారీ విదేశీ టూర్ ప్లాన్ చేశాడు. బ్రిటన్, ఫ్రాన్సుల్లో పర్యటించాడు. అక్కడి దర్శనీయ స్థలాల వద్ద సెల్ఫీలు దిగాడు. కుటుంబంతో టూర్‌ను ఆసాంతం ఎంజాయ్ చేశాడు. ఈలోపు అతడి భార్య కూడా తన ఆనందాన్ని నెట్టింట పంచుకుంది. తమ టూర్ విశేషాలు, ఫొటోలు, వీడియోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయసాగింది. ఇవన్నీ గమనిస్తున్న అమెరికా పోలీసులు లూయీని అదుపులోకి తీసుకునేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. అతడిపై అంతర్జాతీయ అరెస్టు వారెంట్ జారీ కాగానే అధికారులు లండన్‌లో అతడి అరెస్టు చేశాడు. సడెన్‌గా పోలీసుల ప్రత్యక్షం కావడంతో షాకైపోవడం లూయీ వంతైంది.
Pesticide: భార్య చెప్పినా వినక.. చేతులు కడుక్కోకుండా భోజనం చేసి యువకుడి దుర్మణం!
ఈ అరెస్టుపై తాము చేయగలిగింది ఏమీ లేదని కోస్టారీకా అధికారులు తేల్చి చెప్పారు. ‘‘వారి విధులు వారు నిర్వర్తించారు. మా దేశంలో మాత్రం అతడిపై ఎలాంటి దర్యాప్తు జరగట్లేదు’’ అని కోస్టారీకా జ్యుడీషియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పేర్కొంది. మరోవైపు, అతడిని తమ దేశానికి తీసుకెళ్లి విచారించాలని అమెరికా అధికారులు ప్రయత్నిస్తుంటే లూయీ మాత్రం ఈ ప్రయత్నాలను న్యాయస్థానం ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతడి కేసుపై కోర్టు వచ్చే నెలలో విచారణ చేపట్టనుంది.
Carbonated Water: సోడాతో ఇలాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయా? ఆసక్తి రేపుతున్న అధ్యయనం!
Updated Date - Jan 27 , 2025 | 02:08 PM