Carbonated Water: సోడాతో ఇలాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయా? ఆసక్తి రేపుతున్న అధ్యయనం!
ABN , Publish Date - Jan 25 , 2025 | 07:23 PM
సోడాతో బరువు తగ్గే ఛాన్స్ కూడా ఉందని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. బీఎమ్‌జే న్యూట్రిషన్ ప్రివెన్షన్ అండ్ హెల్త్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. అయితే, సోడా ఏమీ దివ్యౌషధం కాదని, కసర్తుతలు, డైట్ ఫాలో అయితేనే పూర్తి స్థాయి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: సోడా.. ఇంగ్లిష్‌లో దీన్ని కార్బోనేటెడ్ వాటర్ అని అంటారు. కడుపులో అరగనట్టుగా ఉంటేనో లేదా మరే ఇతర కారణంతో జనాలు సోడా తాగుతుంటారు. అయితే, సోడా ఉపయోగాలకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర అధ్యయనం జరిగింది. సోడాతో బరువు తగ్గే అవకాశం కూడా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. బీఎమ్‌జే న్యూట్రిషన్ ప్రివెన్షన్ అండ్ హెల్త్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది (Health).
సోడా తాగితే జీవక్రియల వేగం పెరుగుతుందట. ఫలితంగా శరీరంలోని శక్తి నిల్వలు త్వరగా ఖర్చవుతాయట. దీంతో, సోడా తాగితే బరువు తగ్గే అవకాశం పెరుగుతుందని శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు. అయితే, సోడాతో పెరిగే జీవ క్రియల వేగం స్వల్పమే అని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు సోడాతో పాటు ఇతర ఆహార నియమాలు, కసరత్తు వంటివి తప్పనిసరిగా అనుసరించాలని చెబుతున్నారు.
Man leaks Cholesterol: బాబోయ్ ఇదేం వింత వ్యాధి! వ్యక్తి చేతుల్లోంచి లీకైపోతున్న కొలెస్టెరాల్
నిపుణులు చెప్పే దాని ప్రకారం, సోడాతో కడుపు నిండుగా అనిపిస్తుంది. దీంతో, ఆకలి కేకలు తగ్గుతాయి. అంతేకాకుండా, ఇది జీర్ణ క్రియను కూడా వేగవంతం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిరోధిస్తుంది. అంతిమంగా ఇవన్నీ కలగలిసి బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సోడాలోని కార్బన్‌డైఆక్సైడ్‌ను కడుపు వేగంగా గ్రహిస్తుంది. ఆ తరువాత ఇది రక్తంలో కలిసిపోతుంది. ఇక రక్తంలోని ఎర్ర రక్తకణాలు ఈ కార్బన్ డైఆక్సైడ్‌ను బైకార్బోనేట్‌గా మారుస్తాయి. ఫలితంగా రక్తంలో క్షార లక్షణం పెరుగుతుంది. తద్వారా, రక్తంలోని గ్లూకోజ్‌ను కణాలు వేగంగా గ్రహించి, వినియోగించుకుంటాయని నిపుణులు ప్రతిపాదిస్తున్నారు.
Health: మాంసంపై నిమ్మరసం ఎందుకు పిండుతారో తెలుసా..
సోడాకు, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలకు మధ్య సంబంధం ఉన్నట్టు ఈ అధ్యయనం తేలినప్పటికీ దీనిపై మరిన్ని అధ్యయనాలు జరిగితేనే స్పష్టమైన అంచాకు రాగలమని వైద్యులు చెబుతున్నారు. ఇక సోడాతో బరువు తగ్గొచ్చన్న సంబరంలో దీన్ని అతిగా తాగితే ఉదర సంబంధిత సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు.