Wheel Chair Denied in Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఉదంతం.. వీల్‌చెయిర్ దొరక్క కిందపడి గాయాలపాలైన వృద్ధురాలు
ABN, Publish Date - Mar 08 , 2025 | 08:08 AM
ఎయిర్‌పోర్టులో తన అమ్మమ్మకు సకాలంలో వీల్‌చెయిర్ లభించకపోవడంతో కింద పడి ఆసుపత్రి పాలైందంటూ ఓ మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నె్ట్ డెస్క్: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తాజాగా షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. ఎయిర్‌పోర్టుకు వచ్చిన వృద్ధురాలికి వీల్ చెయిర్ లభించక నడవాల్సి రావడంతో కింద పడి గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వైద్యులు వృద్ధురాలిని ఆసుపత్రిలో ఉంచి వైద్యం చేస్తున్నారు. బాధితురాలు దివంగత మాజీ సైనికాధికారి భార్య అని కూడా సమాచారం. తమకు ఎయిర్ ఇండియా సకాలంలో వీల్ చెయిర్ అందించలేదని మహిళ మనవరాలు ఆరోపించారు (Denied Wheelchair, Old Woman Falls, Lands In Hospital).
వృద్ధురాలి మనవరాలు పారుల్ కన్వర్ సోషల్ మీడియాలో తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానం టిక్కెట్‌లు బుక్ చేసుకున్నారు. అంతేకాకుండా ఓ వీల్ చెయిర్ కూడా ముందుగానే బుక్ చేసుకున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ తలుపు వరకూ వీల్ చెయిర్ బుక్ చేసుకోగా ఈ అభ్యర్ధనను ధ్రువీకరించినట్టు టిక్కెట్‌పై స్పష్టంగా ఉంది.
Gold allowed on Flights: ఈ కస్టమ్స్ రూల్స్ తెలుసా.. విమాన ప్రయాణికులు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చంటే..
అయితే, ఎయిర్‌పోర్టుకు వచ్చాక గంట పాటు వేచి చూసినా తమకు వీల్ చెయిర్ లభించలేదని ఆమె పేర్కొన్నారు. మూడవ టర్మినల్ వద్దకు చేరుకున్నాక తాము వీల్ చెయిర్ కావాలని కోరినట్టు తెలిపారు. గంట పాటు వేచి చూసినా అక్కడి సిబ్బంది చక్రాల కుర్చీని ఏర్పాటు చేయలేకపోయారని అన్నారు. ఆ తరువాత వృద్ధురాలు బంధువు సాయంతో నడుస్తూ మూడు పార్కింగ్ లేన్లను దాటుకుని ఎయిర్‌పోర్టులోకి వచ్చినా అక్కడ కూడా వీల్ చెయిర్ లభించలేదని అన్నారు. చివరకు వృద్ధురాలు నడవలేక ఒక్కసారిగా కౌంటర్ వద్ద కూలబడటంతో ఆమెకు గాయాలయ్యాయని అన్నారు.
ఆ తరువాత ఫస్ట్ ఎయిర్ కూడా లభించలేదని, కుటుంబసభ్యులే మెడికల్ రూంకు వెళ్లి కిట్ తెచ్చుకోవాలని సిబ్బంది భావించినట్టు కనిపించిందని అన్నారు. ఎట్టకేలకు వీల్ చెయిర్ రావడంతో సిబ్బంది వృద్ధురాలి ఆరోగ్యాన్ని సరిగా చెక్ చేయకుండానే విమానం ఎక్కించి పంపించేశారని అన్నారు. బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగాక వృద్ధురాలికి డాక్టర్లు రెండు కుట్లు వేసి పంపించార అన్నారు. గత రెండు రోజులుగా ఆమెకు ఆసుపత్రి ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారని, ఆమె ఎడవైపు క్రమంగా బలహీనంగా మారుతోందని చెప్పారు.
ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా.. ఆందోళన వ్యక్తం చేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని భరోసా ఇచ్చింది. పూర్తి వివరాలతో త్వరలో సంప్రదిస్తామని పేర్కొంది.
Updated Date - Mar 08 , 2025 | 08:08 AM