Bengaluru: గిఫ్ట్‌గా మెుబైల్.. ఆపై కోట్లు మాయం.. సైబర్ కేటుగాళ్ల వలకు చిక్కిన టెకీ..
ABN, Publish Date - Jan 20 , 2025 | 10:50 AM
దేశంలో సైబర్ మోసాలు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కళ్లు మూసి తెరిచే లోపే బ్యాంకు ఖాతాల్లో నగదు ఖాళీ అవుతోంది. బ్యాంకు అధికారులమని, లాటరీ తగిలిందని, మీ పేరు మీద కొరియర్ వచ్చిందంటూ సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
బెంగళూరు: దేశంలో సైబర్ మోసాలు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కళ్లు మూసి తెరిచే లోపే బ్యాంకు ఖాతాల్లో నగదు ఖాళీ అవుతోంది. బ్యాంకు అధికారులమని, లాటరీ తగిలిందని, మీ పేరు మీద కొరియర్ వచ్చిందంటూ సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. రూపాయి పెట్టుబడి పెడితే లక్షలు వస్తాయని, అమాయకులను అత్యాశకు గురి చేసి వారి నుంచి కోట్లు కొల్లగొడుతున్నారు. వివిధ రూపాల్లో నేరాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. మోసపోయామని తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. నిరక్ష్యరాసులు, విద్యావంతులు అనే తేడా లేకుండా అంతా చోరీకి గురవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి టెక్ నగరం బెంగళూరులో చోటు చేసుకుంది.
సైబర్ నేరగాళ్ల చేతిలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాయ్ రూ.2.8 కోట్లు పోగొట్టుకున్నారు. గతేదాడి నవంబర్‌లో బ్యాంకు అధికారులమంటూ రాయ్‌కి వాట్సాప్ కాల్ వచ్చింది. క్రెడిట్ కార్డు అప్రూవ్ అయ్యిందని, ప్రాసెస్ కూడా పూర్తయిందని చెప్పారు. ఆ తర్వాత క్రెడిట్ కార్డు అప్రూవల్‌పై మీకు గిఫ్ట్ వచ్చిందని చెబుతూ డిసెంబర్ 1న రాయ్‌కి మొబైల్ గిఫ్టుగా పంపించారు. అందులో సిమ్ కార్డ్ వేసుకోవాలని మెస్సేజ్ రాగా అది నిజమేనని రాయ్ నమ్మారు. అనంతరం అదే రోజు వారి చెప్పినట్లు కొత్త ఫోన్లో సిమ్ వేశాడు. అనంతరం వివరాలు నమోదు చేశాడు. దాని తర్వాత రాయ్‌కు బ్యాంకు నుంచి ఎలాంటి నోటిఫికేషన్లు, మెస్సేజ్‌లు రాలేదు.
అయితే రోజుల తర్వాత రాయ్ తన బ్యాంకు ఖాతాను తనిఖీ చేసుకున్నాడు. అక్కడ కనిపించిన బ్యాలెన్స్ చూసి నోరెళ్లబెట్టాడు. రాయ్ ఖాతా ఏకంగా రూ.2.8 కోట్లు సైబర్ కేటుగాళ్లు స్వాహా చేసి ఖాతాను ఖాళీ చేశారు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ బెంగళూరు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. తన డబ్బులను ఎలాగైనా తిరిగి ఇప్పించాలని వేడుకున్నాడు. ఘటనపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన వైట్ ఫీల్డ్ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని వైట్ ఫీల్డ్ డీసీపీ శివకుమార్ తెలిపారు. లాటరీ, పెట్టుబడులు, లోన్ యాప్స్ వంటి వాటితో సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారని, అలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అనుమానిత కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు.
Updated Date - Jan 20 , 2025 | 10:50 AM