‘సంగీత భిక్షాటన’కు 60 ఏళ్లు
ABN, Publish Date - Mar 09 , 2025 | 08:59 AM
త్యాగరాజస్వామి జన్మస్థలమైన తిరువాయూర్లో ఏటా ఆయన శిష్యగణం, భక్తగణం భిక్షమెత్తి సంగీతోత్సవాలు జరపడం ఒక సంగీత సంప్రదాయం. ఇది ఈనాటికీ వైభవోపేతంగా జరుగుతోంది. ఈ ఉత్సవాలలో పాల్గొని కచేరీ చేయడం ఒక మహద్భాగ్యంగా కర్ణాటక సంగీత విద్వాంసులు భావిస్తుంటారు.
కాల ప్రవాహంలో ఆరు దశాబ్దాల పాటు, క్రమం తప్పకుండా త్యాగరాజ స్వామి సంగీత ఉత్సవాలు జరగటం ఒక మరుపురాని చరిత్ర. అందులోనూ భిక్షాటన పూర్వక సంగీత ఉత్సవాలు అనేది సింహపురి సీమకు లభించిన ఒక వరం.
పచ్చని గరిక అంచుల్లో మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తుంటాయి. తెలతెలవారు తుంటే నెల్లూరు నగరవీధుల్లో ‘నగుమోము గనలేని...’ అనే సంకీర్తన చల్లని గాలిలో అలవోకగా తేలి వస్తుంది. కంచుకంఠం శ్రావ్యంగా వినిపిస్తుంది. ఇళ్ళ ముంగిట ముగ్గులువేసే ఆడపడుచులు ఆ శ్రావ్యగానం వినగానే, ఆ మధురగాయకునికి నమస్కరిస్తారు. ఆయన పేరు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి... నెల్లూరుకి ఆయన త్యాగరాజ భిక్షువు. ఫిబ్రవరి మొదలు ఏప్రిల్‌దాకా రెండు మూడు నెలలపాటు తన శిష్యబృందంతో నెల్లూరు వీధుల్లో నగర సంకీర్తనం చేస్తూ బిచ్చమెత్తడం ఆయన సంగీత సంస్కారం. భిక్ష తన కడుపు నింపుకోవడానికి కాదు... నెల్లూరువాసులకు వీనులవిందు చేయడానికి. ఇల్లిల్లు, వీధి వీధి తిరిగి సేకరించిన భిక్షతో ఆయన చేసేది అనితరసాధ్యమైన కార్యక్రమం. అదే ‘త్యాగరాజ ఆరాధనోత్సవాలు’.
తిరువాయూర్ నుంచి నెల్లూరుకు...
త్యాగరాజస్వామి జన్మస్థలమైన తిరువాయూర్లో ఏటా ఆయన శిష్యగణం, భక్తగణం భిక్షమెత్తి సంగీతోత్సవాలు జరపడం ఒక సంగీత సంప్రదాయం. ఇది ఈనాటికీ వైభవోపేతంగా జరుగుతోంది. ఈ ఉత్సవాలలో పాల్గొని కచేరీ చేయడం ఒక మహద్భాగ్యంగా కర్ణాటక సంగీత విద్వాంసులు భావిస్తుంటారు. సాంబమూర్తిగారు ఆ సంప్రదాయాన్ని నెల్లూరుకు తీసుకువచ్చారు. దాదాపు 60 ఏళ్ళ కిందట నెల్లూరులో ఆయన ప్రారంభించిన ‘త్యాగరాజ ఆరాధనోత్సవాలు’ నేటికీనిరాటకంగా సాగుతున్నాయి. ఆ ఉత్సవాలు నిజంగా సంగీత తిరునాళ్ళే. సాంబమూర్తి గారు సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు, హరికథకులు. మహాకవి కాళిదాసు తదితర నాటకాలలో తన గాంధర్వ విద్యను ప్రదర్శించి ప్రేక్షకావళిని అలరించారు. నెల్లూరులో త్యాగరాజోత్సవాలు జరపాలన్న ఆలోచనకు సంగీతాభిమానులైన ఆయన మిత్రులు చేదోడయ్యారు. కొందరు స్వరంతో తోడయ్యారు. 1965 మార్చి చివరిలో ‘భిక్షాటన పూర్వక త్యాగరాజ సంస్కరణోత్సవ సంఘం’ ఏర్పడింది. దీనికి సాంబమూర్తి ఊపిరి అయితే, డాక్టర్ ఎనమండ్ర వెంకటేశ్వర శాస్త్రి దేహమయ్యారు. వీరికి తోడు సంగీతాభిమానులు బృందం ఏర్పడింది.
నెల్లూరులో సాంబమూర్తిగారు ఆయన సంగీతబృందం ఈ ఉత్సవ నిర్వహణకు ఏ దాతను ఆశ్రయించాలనుకోలేదు. పౌరుల కోసం చేస్తున్న సంగీతోత్సవాలు ఇవి. వీటిని ప్రజలే జరుపుకోవాలన్నది వారి అభిమతం.
కార్తీక, ఆశ్వయుజ మాసాలలో సాంబమూర్తి సంగీత బృందం నెల్లూరు నగరవీధుల్లో త్యాగరాజ కీర్తనలు గానంచేస్తూ బిచ్చమెత్తుతుంది. వారు ఎప్పుడు తమ వీధికొస్తారా అని ప్రజలు ఎదురుచూస్తుండడం ఒకనాటి ముచ్చట కాదు, ప్రతి ఏటా ఆ సుదినం కోసం ఎదురుచూస్తారంతా. హుండీలో డబ్బులు వేసే వాళ్లు వేస్తారు. జోలెలో బియ్యం పోసేవాళ్ళు పోస్తారు.
సంగీత విందుభోజనం...
మార్చి, ఏప్రిల్ మాసాలలో నెల్లూరు పురమందిరం ప్రాంగణంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభమవుతాయి. వారం రోజులు ఉదయం, సాయంత్రం రోజంతా సంగీతవిందులే. ఉదయం ఔత్సాహికులు కచేరీలు. సాయంకాలం సుప్రసిద్ధుల గాన సభలు. ఆకాశమంత పందిరి... విశాలమైన ఆవరణం. ఇసుక వేస్తే రాలని సంగీతాభి మానులు. రాత్రి పొద్దుపోయేదాకా కచేరీలు జరుగుతాయని పట్టణ ప్రజలకు తెలుసు కనుక, భోజనాలు పూర్తిచేసుకున్న తరువాత వచ్చి చివరిదాకా శ్రద్ధగా వినేవాళ్ళే ఎక్కువ. ఈ ఉత్సవాల్లో ఇప్పటిదాకా ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో వైద్యనాథ భాగవతార్, డికె పట్టమ్మాళ్, బొంబాయి సిస్టర్స్, బాలమురళీకృష్ణ, ఈమని శంకరశాస్త్రి, షేక్ మదీనా సాహెబ్, శ్రీరంగం గోపాలరత్నం, ఏసుదాసు, బాలచందర్ లాంటివాళ్లు ఉన్నారు. ఇంకా ఎందరో మహామహులు ఈ ఉత్సవాలలో పాల్గొని తమ సంగీతతృష్ణ తీర్చుకున్నారు. సాంబమూర్తిగారు జీవించి ఉన్నంతకాలం ఉత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. తరువాత కూడా ఉత్సాహానికి కొదువలేదు. డాక్టర్ వై వెంకటేశ్వరశాస్త్రి ఈ సంగీత చైతన్యానికి ముగ్ధుడై నెల్లూరులో త్యాగరాజస్వామి ఆలయ నిర్మాణానికి విలువైన స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. 1983లో ఆలయం పూర్తయింది. నిత్యం శ్రద్ధగా పూజాదికాలు జరుగుతున్నాయి.
సాంబమూర్తిగారు ఇప్పుడు లేరు. కానీ ప్రతి ఏటా ఈ ఉత్సవాలు జరిగే 10 రోజులు ఆయన ఆ పందిరిలో సజీవంగా ఉన్నట్టే. గానగంధర్వుడు సినీ నేపథ్య గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, గాయని శైలజ, వసంత వీరి సంతానమే. సాంబమూర్తిగారు నెలకొల్పిన సంగీత సంప్రదాయాన్ని నేటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎస్పీ బాలు, వెంకటేశ్వరశాస్త్రి కుమారుడు నాగదేవి ప్రసాద్ ఈ కార్యభారాన్ని వైభవంగా నిర్వహిస్తూ వచ్చారు. బాలు జీవించి ఉన్నంతకాలం ఎక్కడ ఉన్నా ఉత్సవాలకు ఏదో ఒకరోజు వచ్చి హాజరయ్యేవారు. సాంబమూర్తిగారి నిలువెత్తు విగ్రహం నగర కస్తూర్భా కళాక్షేత్రంలో ఉంది. బాలు మరణానంతరం ఆయన వారసులు హాజరవుతున్నారు. ఈ ఏడాదితో ఉత్సవాలకు 60 ఏళ్లు. ఆరు దశాబ్దాలుగా సంగీత ఉత్సవాలు సింహపురి సీమలో జరుగుతూ ఉండటం ఒక చారిత్రక విశేషమే కదా.
- ఈతకోట సుబ్బారావు,నెల్లూరు
Updated Date - Mar 09 , 2025 | 08:59 AM