ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Miss World Indian Achievements: మాజీల వెనక మజిలీలు

ABN, Publish Date - May 12 , 2025 | 05:40 AM

ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న భారతీయ అందగత్తెలు ఎన్నో కష్టాలన్నింటినీ ఎదుర్కొని విజయం సాధించాయి. వీరి కష్టం, పట్టుదల మరియు తెలివితేటలతో ఆ కిరీటాలు కైవసం చేసుకోవడమే కాక, దేశం గర్వించదగిన ప్రదర్శనలిచ్చారు.

అందాల పోటీల్లో అందానికే తొలి ప్రాధాన్యం కాబట్టి అందం ఉంటే చాలు అందాల కిరీటం ఎగరేసుకుపోవచ్చు అనుకుంటాం. కానీ నిజానికి ఆ స్థాయికి చేరుకోవడం కోసం అందగత్తెలు పడే పాట్ల గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. మాజీ భారతీయ ప్రపంచ సుందరి విజేతలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. వాళ్లు కైవసం చేసుకున్న కిరీటాల వెనకున్న కథలివి..

ప్రపంచ సుందరి కిరీటం సొంతం చేసుకోడానికి అందంతో పాటు తెలివితేటలు, ఆర్థిక స్థోమత, పట్టుదలలు కూడా మెండుగా ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి లోపించినా కిరీటం చేజారిపోతుంది. మన భారతీయ ప్రపంచ సుందరులైన రీటా ఫారియా, డయానా హేడెన్‌, ఐశ్యర్యా రాయ్‌, యుక్తా ముఖేలు కూడా అందలాల్ని అందుకోవడం కోసం ఎన్నో అవరోధాలను అధిగమించారు.

అరువు దుస్తులతో అందలానికి

1966లో మహారాష్ట్రకు చెందిన ఒక యువతి ఈత దుస్తుల్లో ర్యాంప్‌ మీద నడిచి, ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఏదో సరదా కోసం అందాల పోటీలో పాల్గొనాలనుకున్న ఆమె, పర్సులో మూడంటే మూడు పౌండ్లతో, స్నేహితుల దగ్గరి నుంచి అరువు తెచ్చుకున్న దుస్తులు, చెప్పులు నింపిన సూట్‌కేసుతో లండన్‌కు ప్రయాణించింది. ఆమే... ప్రపంచ సుందరి కిరీటాన్ని పొందిన మొట్టమొదటి ఆసియా వాసి, రీటా ఫారియా. రీటాకు ఆ పోటీల్లో పాల్గొనడానికి తగిన ఆర్థిక స్థోమత ఒక్కటే కాదు. అందుకు తగిన ముందస్తు శిక్షణ, దుస్తులు, పాస్‌పోర్టు కూడా లేవు. అసలు ర్యాంప్‌ మీద నడిచేటప్పుడు ఏ దుస్తులు వేసుకోవాలో కూడా తెలియదామెకు. ఆ విషయంలో రీటాకు తల్లి సహాయపడింది. ఆమె తన స్నేహితుల నుంచి కొన్ని చీరలను, పెర్సిస్‌ ఖంబట్టా అనే నటి నుంచి ఈత దుస్తులను అరువు తెచ్చి కూతురికి అందించి, పోటీలకు సాగనంపింది. చివరకు వాళ్ల శ్రమ వృథా పోలేదు. అంతిమంగా 1966 ప్రపంచ సుందరి పోటీల్లో, ఒక వైద్యురాలిగా భారతదేశ జనాభా నియంత్రణ ఆవశ్యకత గురించిన తన సంచలనాత్మకమైన సమాధానంతో చరిత్ర సృష్టించి, ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకోగలిగింది రీటా ఫారియా. అందాల పోటీలో విజయం సాధించినప్పటికీ, రీటా, తన వైద్య వృత్తిని కొనసాగించి, ఐరిష్‌ వ్యక్తిని పెళ్లాడి, ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో గైనకాలజిస్ట్‌గా స్థిరపడిపోయింది.


హైదరాబాద్‌కు వన్నె తెచ్చి...

1997 ప్రపంచ సుందరి అందాల పోటీలో గెలవడం ద్వారా, ప్రపంచానికి హైదరాబాద్‌ను పరిచయం చేసిన అందాల భామ, డయానా హేడెన్‌! ప్రపంచ సుందరి బిరుదుతో పాటు అదే అందాల పోటీలో, మిస్‌ వరల్డ్‌ ఆసియా అండ్‌ ఓషనియా, మిస్‌ ఫొటోజెనిక్‌ అండ్‌ స్పెక్టాక్యులర్‌ స్విమ్‌వేర్‌ అనే మరో మూడు బిరుదులను కూడా పొందిన అరుదైన భామ ఆమె. డయానా, 14 ఏళ్ల వయసులోనే బడి మానేసి, కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఉద్యోగం చేయడం మొదలుపెట్టిందనే విషయం ఎంతో కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఉద్యోగం పొందడం కోసం వయసుతో పాటు, తన విద్యార్హతల గురించి కూడా ఆమె అబద్ధాలు చెప్పవలసి వచ్చింది. ప్రపంచ సుందరి పోటీల్లో గెలుపు తర్వాత, ఆత్వవిశ్వాసం, గ్రూమింగ్‌కు సంబంధించిన తన అనుభవాలను పంచుకుంటూ, సాటి అందాల భామలకు మార్గదర్శిగా మారిందామె. వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు సంబంధించి ఎన్నో సెమినార్లు, వర్క్‌షాప్స్‌ కూడా నిర్వహించింది.


గౌన్‌ జిప్‌ ఊడిపోయినా...

1994 ఫెమినా మిస్‌ ఇండియా పోటీలో సుస్మితా సేన్‌ చేతిలో పరాజయం పాలైన ఐశ్వర్యా రాయ్‌, అదే ఏడాది ప్రపంచ సుందరి పోటీ నెగ్గి తన తడాఖా చాటుకుంది. ఆ రెండు వేడుకల్లో చోటు చేసుకున్న ఏకరూప సంఘటనలను గుర్తు చేసుకుంటూ, మిస్‌ ఇండియా, మిస్‌ వరల్డ్‌ పోటీల చివరి ట్రయల్‌లో తన గౌన్‌కు జిప్‌ ఊడిపోవడం గురించీ, ఆ రెండు సందర్భాల్లో కురిసిన కుంభవృష్టి గురించీ మీడియాతో ప్రస్థావించింది. చివరిగా తన విజయాన్ని ప్రస్థావిస్తూ... ‘‘ఏదేమైతేనేం భారతదేశం మళ్లీ గెలిచింది’’ అని నినదించి, ప్రపంచ సుందరి పోటీలకే వన్నె తీసుకొచ్చింది.


కిరీటాన్ని తెచ్చిపెట్టిన తెలివైన సమాధానం

అందాల కిరీటాన్ని సొంతం చేసుకోవడమొక్కటే కాదు, దేశం గర్వించేలా ప్రపంచ వేదిక మీద భారతీయ సంస్కృతి సంప్రదాయాలను చాటడం చాలా ముఖ్యం. 1999 ప్రపంచ సుందరి విజేత యుక్తా ముఖే అదే చేసింది. ఒక కూతురిగా తన తల్లితండ్రులకిచ్చే ముఖ్యమైన సలహా ఏదనే ప్రశ్నకు, ‘‘ఏది ఏమైనా నేను మీకు అండగా ఉంటాను. మీరు నాకు నేర్పిన విలువలకు కట్టుబడి నడుచుకుంటూ, కుటుంబ విలువలను చాటడంలో మనదరం కలిసి మిగతా ప్రపంచానికి ఆదర్శవంతంగా నిలుద్దామని నా తల్లితండ్రులకు చెప్తాను’’ అని సమాధానమిచ్చింది యుక్తా ముఖే! ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకోవడంలో ఆమెకు ఈ సమాధానమే తోడ్పడింది. 2000 సంవత్సరంలో ప్రియాంకా చోప్రా మరొక తెలివైన సమాధానంతో ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. 18 ఏళ్ల వయసుకే ప్రపంచ సుందరిగా ఎంపికైన ప్రియాంక, చివరి రౌండ్‌లో ఒక ప్రశ్నకు సమాధానంగా, మదర్‌ థెరెసాను తానెంతో ఆరాధిస్తాననీ, ఆ కరుణామయి నిస్వార్థ గుణం, అంకితభావాలే తనకు ప్రేరణలని చెప్పి అందర్నీ మెప్పించి, ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకోవడం విశేషం.


మరింత స్త్రీత్వం ఉట్టిపడేలా...

2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్నప్పుడు మానుషి చిల్లర్‌ ఆనందానికి పట్టపగ్గాలే లేకుండా పోయాయి. అయితే ఆ సమయంలో తన ప్రతిస్పందన మరింత స్త్రీత్వం ఉట్టిపడేలా ఉంటే బాగుండేదని బాధపడింది మానుషి. పోటీల తదనంతరం వీడియోలో తన ప్రతిస్పందనను పలు మార్లు పరిశీలించాననీ, ఆ సమయంలో తాను మరికాస్త స్త్రీత్వం ఉట్టిపడేలా ప్రవర్తించి ఉంటే బాగుండేదనీ, కానీ ఆ సమయంలో తాను సహజసిద్ధంగా ప్రతిస్పందించాననీ మీడియాతో చెప్పుకుంది.

Updated Date - May 12 , 2025 | 05:41 AM