American mom in India: అసలైన ఆనందం భారత్‌లోనే
ABN, Publish Date - Apr 07 , 2025 | 03:44 AM
క్రిస్టెన్ ఫిషర్ అనే అమెరికన్ తల్లి, తన పిల్లల భవిష్యత్తు కోసం అమెరికాను వదిలి భారతదేశంలో జీవించేందుకు నిర్ణయించారు. భారతదేశ సంస్కృతి, కుటుంబ విలువలు, విద్యా విధానం పిల్లల ఎదుగుదల కోసం చాలా అనుకూలమని ఆమె అంటున్నారు.
ప్రతి తల్లిదండ్రులూ... తమ పిల్లలు బాగా చదివి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఓ అమెరికన్ తల్లి మాత్రం తన పిల్లలు భారత్‌లో పెరిగితేనే ప్రయోజకులు అవుతారంటూ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. దానికి కారణాలు వివరిస్తూ సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. ‘అమెరికాలో డబ్బు సంపాదించడం సులువే కావచ్చు కానీ అసలైన ఆనందం భారత్‌లోనే ఉంద’ని అంటూ మన దేశ ఔన్నత్యాన్ని ఆకాశానికి ఎత్తేసింది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు ఆమె విశ్లేషణను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఎవరీ విదేశీ అమ్మ? ఆమె పోస్టులో ఏముంది?
ఆమె పేరు క్రిస్టెన్ ఫిషర్. ముగ్గురు ఆడపిల్లల తల్లి. ఓ సంస్థలో కంటెంట్ క్రియేటర్‌గా పని చేస్తున్నారు. భర్త, పిల్లలతో కలసి గత నాలుగేళ్లుగా ఢిల్లీలో నివశిస్తున్నారు. ‘ఇండియా వర్సెస్ అమెరికా’ ట్యాగ్‌లైన్‌తో రెండు దేశాల మధ్య ఉండే భిన్నత్వం గురించి చిన్నచిన్న వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. ఆహారపు అలవాట్లు, వేషధారణ, పండుగలు-వేడుకలు జరుపుకోవడం, విద్యా విధానం, కుటుంబంతో అనుబంధం, స్నేహం ఇలా ఎన్నో అంశాలను ఇతివృత్తంగా తీసుకుని ఇప్పటికే వందల వీడియోలు రూపొందించారు. ప్రతి వీడియోలో ఆమె మన దేశాన్ని గొప్పగా అభివర్ణించడం కనిపిస్తుంది. ఆమె నిర్వహిస్తున్న యూట్యూబ్ చానెల్‌కు అమెరికాలోనే కాదు ఇండియాలో కూడా పెద్ద సంఖ్యలో సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. అమెరికాను వదిలి భారత్‌లోనే నివశించాలనుకోవడానికి కారణాలు చెబుతూ గత ఏడాది ఆమె ఒక వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. అందులో చాలా విషయాలు వివరించారు. తాను మొదటిసారి 2017లో భారత దేశాన్ని సందర్శించాననీ, ఇక్కడి సంస్కృతి తనకు బాగా నచ్చిందని, అప్పుడే భారత్ వచ్చేయాలని నిర్ణయించుకున్నానని ఆ వీడియోలో చెప్పుకున్నారు.
ఇక్కడే బాగుంటుంది...
అమెరికాలో కంటే భారత్‌లోనే పిల్లలు తమ బాల్యాన్ని ఆనందంగా గడుపుతారని అంటున్నారు క్రిస్టెన్. ఆమె పలు అంశాలను ఇన్‌స్టా వేదిక మీద ప్రస్తావిస్తూ... భారత్‌లో పెరగడంవల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలను చక్కగా విశ్లేషించారు. ఎందుకు తన పిల్లలు ఇక్కడే పెరగాలని అనుకుంటున్నారో ఆ కారణాలను ఇలా పంచుకున్నారు.
సాంస్కృతిక అవగాహన: భారత దేశంలో భిన్న సంస్కృతులు కనిపిస్తాయి. ఎన్నో భాషలు, ఆచారాలు, నమ్మకాలు ఉంటాయి. వీటన్నింటినీ చూస్తూ, అర్థం చేసుకుంటూ ఎదిగే పిల్లలకు విశాల దృక్పథం అలవడుతుంది. కొత్తగా ఆలోచించడం, ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం, పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం లాంటి వాటిని పిల్లలు నేర్చుకుంటారు.
బహుభాషా నైపుణ్యం: ఇక్కడ ఎన్నో భాషలు, మాండలికాలు మాట్లాడుతూ ఉంటారు. హిందీ, ఇంగ్లీ్‌షతోపాటు వీటన్నింటినీ పిల్లలు చాలా తేలిగ్గా నేర్చుకోగల్గుతారు. ఓర్పుగా వినడం, అర్థం చేసుకోవడంతోపాటు స్పష్టంగా మాట్లాడడం, చక్కని భావ వ్యక్తీకరణ పిల్లలకు అలవడుతుంది. ఇవన్నీ భవిష్యత్తులో ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు వాళ్లకి ఉపయోగపడతాయి.
ప్రాపంచిక దృక్పథం: భారత సమాజం... పిల్లలకు ప్రాపంచిక దృక్పథాన్ని పరిచయం చేస్తుంది. ప్రపంచ సమస్యలు, స్థానిక సమస్యలు, సాంస్కృతిక వైవిధ్యం, సామాజిక నిబంధనల్లో తేడాలు అవగతమయ్యేలా చేస్తుంది. దీంతో పిల్లలు ప్రపంచాన్ని లోతుగా విభిన్న కోణాల నుంచి అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు.
తొణకని తత్వం: పుట్టిన దేశాన్ని వదిలి వేరే దేశంలో ఉండడమంటే అది పిల్లలకు పెద్ద సవాల్ అనే చెప్పాలి. వాళ్లు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడి పాఠశాల విధానానికి అలవాటు పడాలి. కొత్త స్నేహితులతో సర్దుకుపోవాలి. ఇలాంటివాటివల్ల పిల్లలు స్వతంత్రంగా సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యాన్ని సాధిస్తారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తొణకకుండా నిలబడడం నేర్చుకుంటారు.
భావోద్వేగాలు: ఇక్కడి సమాజంలో రకరకాల వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో నేపథ్యం ఉంటుంది. వీళ్లని కలిసినప్పుడు పిల్లల్లో సహజంగానే రకరకాల భావోద్వేగాలు కలుగుతూ ఉంటాయి. స్నేహం, దయ, జాలి, బాధ ఇలా ఎన్నో భావాలు వాళ్ల అనుభవంలోకి వస్తాయి. వ్యక్తులను అర్థం చేసుకోవడం, సున్నితంగా వ్యవహరించడం, సామాజిక బాధ్యత పిల్లలకు అలవడతాయి.
కుటుంబ వ్యవస్థ: భారతదేశంలో బలమైన కుటుంబ వ్యవస్థ ఉంటుంది. కుటుంబ సభ్యులంతా ప్రేమాభిమానాలతో వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ అమెరికాలో కనిపించవు కాబట్టి పిల్లలు ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. దీనివల్ల పిల్లలకు తమవారు అనే భావన, భావోద్వేగాల వ్యక్తీకరణ, బంధువర్గ సమీకరణ గురించి తెలుస్తుంది.
సాధారణ జీవనం: ఇక్కడ పిల్లలు..... ధనిక, పేద తారతమ్యాలను చూస్తూ పెరుగుతారు. క్రమంగా సాధారణ జీవన మాధుర్యాన్ని, సంతృప్తి విలువను అర్థం చేసుకుంటారు.
భారత్‌లో పెరిగే పిల్లలు... ప్రపంచంలో ఏ ప్రాంతం వారితోనైనా స్నేహపూర్వకంగా మెలగుతారు. స్నేహబంధాలను పెంచుకుంటారు. ఇది అంతర్జాతీయంగా సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ కార్యకలాపాల విస్తరణకు దోహదం చేస్తుంది.
అమెరికా వర్సెస్ భారత్
అమెరికా... వ్యక్తిగత దేశంలా వ్యవహరిస్తుంది. సామాజికంగా ఒంటరిగా ఉంటుంది. కానీ భారత్... అందరినీ ఆహ్వానిస్తుంది. మానవ సంబంధాలకు విలువ ఇస్తుంది. పరస్పర సహకారాన్ని కోరుతుంది. అందుకే నా పిల్లలను భారత్‌లోనే పెంచాలని అనుకుంటున్నా...! అని చెప్పుకొచ్చారు క్రిస్టెన్.
ఇవి కూడా చదవండి:
జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి
Read Latest and International News
Updated Date - Apr 07 , 2025 | 03:44 AM