Uppada Weavers: శారీగమే... పైథానీ సే...
ABN, Publish Date - Sep 22 , 2025 | 07:03 AM
అతివల అందాన్ని మరింత పెంచేవి చీరలు. వాటిలో ఉప్పాడ జాంధానీ చీరలకు ఉన్న ప్రత్యేకతే వేరు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ములాంటి ఎందరో ప్రముఖుల మనసుల్ని దోచుకున్న ఈ చీరలకు ఎంతో ఆదరణ ఉంది.
జాంధానీ చీరల తయారీలో చేయితిరిగిన ఉప్పాడ నేతన్నలు కొత్త పద్ధతులను తెరపైకి తెస్తున్నారు. కాలానుగుణంగా వస్తోన్న మార్పులకు తగ్గట్టుగా మగ్గాలపై మెరుపులు మెరిపిస్తున్నారు. మహారాష్ట్రలో పేరుపొందిన పైథానీ పట్టు, ఖాదీ వస్త్రం కలగలిపిన కొత్త రకం చీరల్ని సృష్టిస్తున్నారు. ప్రసిద్ధ సంస్థల షోరూంలను సైతం అలంకరిస్తున్న ఈ చీరల విశిష్టత ఏమిటంటే...
అతివల అందాన్ని మరింత పెంచేవి చీరలు. వాటిలో ఉప్పాడ జాంధానీ చీరలకు ఉన్న ప్రత్యేకతే వేరు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ములాంటి ఎందరో ప్రముఖుల మనసుల్ని దోచుకున్న ఈ చీరలకు ఎంతో ఆదరణ ఉంది. టాటా గ్రూప్, రిలయన్స్, ఆదిత్య బిర్లా లాంటి బడా వ్యాపార సంస్థలు ఇక్కడ తయారు చేసే చేనేత వస్త్రాలపై ఆసక్తి చూపడానికి కారణం ఈ చీరలే. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ గ్రామం జాంధానీ చీరలకు ప్రసిద్ధి. ఉప్పాడలో కొన్ని వేల కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా చేనేత రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. గంటల తరబడి మగ్గాల మీద పని చేసే ఉప్పాడ చేనేత కళాకారులు... మగువలను మైమరపించే జాంధానీ చీరలను రూపొందించడంలో సిద్ధహస్తులు. టాటా గ్రూప్, ఆదిత్య బిర్లా, రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉప్పాడ జాంధానీ నేతపై దృష్టిసారించాయి. ఉప్పాడలో చీరలు నేయిస్తున్నాయి. తమ షోరూమ్‌లలో వాటిని విక్రయిస్తున్నాయి. టాటా ప్రతినిధుల బృందం నేరుగా ఉప్పాడ వచ్చి, తమకు నచ్చిన డి జైన్లు ఇచ్చి, చీరలు నేయిస్తున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఇక్కడి నేతన్నలకు గుర్తింపు కార్డులు ఇచ్చి, వారే తమ షోరూమ్‌కు వస్ర్తాలు సరఫరా చేసేలా ఒప్పందం చేసుకుంది. రిలయన్స్‌తో పాటు, తమిళనాడులోని పోతీస్ వస్త్ర దుకాణాలకు కూడా ఉప్పాడ చీరలు సరఫరా అవుతున్నాయి.
ఎటు చూసినా ఒకేలా...
ఉప్పాడ చేనేత కళాకారులు కాలానుగుణంగా పద్ధతులవైపు వారు మళ్లుతున్నారు. ఆధునిక మహిళల అభిరుచులకు తగినట్టు మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు వారు పైథానీ పట్టు, ఖాదీ వస్త్రాలతో కొత్త రకం చీరల తయారీ చేపట్టారు. ఇప్పటివరకు ఇలాంటి చీరలు ఈ ప్రాంతంలో ఎక్కడా తయారు చేయడం లేదు. మహారాష్ట్రలోని ఔరంగబాద్ నగరం ఈ చీరలకు ప్రసిద్ధి. షిరిడీ సమీపంలోని ఎవ్లా ప్రాంతం పైథానీ చీరల తయారీకి పేరుపొందింది. ఆ విధానాన్ని తాజాగా ఉప్పాడ తీసుకొచ్చారు. ఎటు చూసినా ఒకే తరహాలో కనిపించడం ఈ చీరల ప్రత్యేకత. ఈ విధానం ద్వారా ఖరీదైన పట్టు చీరలను తయారు చేస్తున్నట్టు ఉప్పాడ చేనేత కళాకారులు చెబుతున్నారు. ఒక చీరలో పల్లు వరకు పైథానీ, తర్వాత ఖాదీతో పేపర్ వ ర్క్ ఉంటుంది. ఒక చీర తయారీకి ఇద్దరు కార్మికులు పనిచేస్తారు. పూర్తి చేయడానికి సుమారు మూడు నెలల నుంచి ఏడాది వరకూ సమయం పడుతుంది. పట్టును బెంగళూరు నుంచి, జరీని సూరత్ నుంచి తీసుకువస్తారు. మార్కెట్లో ఈ చీర ధర రూ.50 వేల నుంచి రూ.లక్షన్నర వరకు ఉంటుంది. రాజస్థాన్, బెంగళూరు నుంచి ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని, ఇప్పటి వరకు 30 నుంచి 40 వరకు చీరలు విక్రయించామని తయారీదారుడు శిలామంతుల నరేష్ చెప్పారు. ఇక్కడ ఈ తరహా చీరల తయారీదారులు 12 మంది మాత్రమే ఉన్నారని, దీంతో ఆర్డర్లు వస్తున్నా... తయారీకి నాలుగు నెలల సమయం పడుతోందని ఆయన వివరించారు.
పీవీవీ వరప్రసాద్, కాకినాడ
ఎం. సూర్యనారాయణమూర్తి, ఉప్పాడ
Updated Date - Sep 22 , 2025 | 07:23 AM