Floral Waste Startup: పూలకు సరికొత్త పరిమళాలు
ABN, Publish Date - May 22 , 2025 | 08:29 AM
పూల వృథాను అరికట్టడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి జమ్ములోని యువతి పాయల్ శర్మ అగర్‌బత్తీల తయారీ ప్రారంభించింది. ఆమె వ్యాపారం ద్వారా స్థానిక మహిళలకు జీవనభృతి కల్పిస్తూ పర్యావరణ సురక్షణలో భాగంగా మారింది.
జమ్ములోని ఆలయాల్లో పూజలకు ఉపయోగించిన పూలు చెత్తకుప్పల్లోకి చేరిపోవడం, పర్యావరణాన్ని నష్టపరచడం నచ్చని, స్థానిక యువతి పాయల్ శర్మ, వాటితో పరిమళాలు వెదజల్లే అగర్‌బత్తీల తయారీకి పూనుకుంది. జీవనభృతి, ఆధ్యాత్మికత, పర్యావరణ సంరక్షణలను సమ్మిళితం చేసిన పాయల్ గురించిన కథ ఆసక్తికరమైన ఇది.
జమ్ము నగరం చుట్టూరా లెక్కలేనన్ని ఆలయాలు, మసీదులు ఉన్నాయి. వాటిలో అనునిత్యం ఉపయోగించే టన్నులకొద్దీ పూలు చివరకు చెత్తకుప్పల్లోకీ, లేదా వీధిమూలల్లోకీ చేరిపోయి, పర్యావరణానికి హానికారకంగా మారుతూ ఉంటాయి. ఎంతో కాలంగా ఈ పరిస్థితిని గమనించిన పాయల్ శర్మకు, పవిత్రమైన పూలు అలా వృథా అయిపోవడం నచ్చలేదు. ఈ పవిత్రమైన వ్యర్థాలను ఆధ్యాత్మిక ఉపయోగాల కోసం సుస్థిరమైన మార్గంలో ఉపయోగించే వీలుందా? అనే దిశగా ఆలోచించింది. చివరకు ఈ వ్యర్థ పూలలో ఆమెకొక గొప్ప ప్రయోజనం కనిపించింది.
వ్యతిరేకతలను అధిగమించి...
పూల వృథాను అరికట్టడంతో పాటు, స్థానిక మహిళలకు జీవనభృతిని కూడా కల్పించవచ్చనే ఆలోచన తట్టడంతో మరో ఆలోచన లేకుండా, జెకె ఆరొమాటిక్ అండ్ హెర్బ్స్ అనే స్టార్టప్‌ను మొదలుపెట్టి, పూలతో అగర్‌బత్తీల తయారీ మొదలు పెట్టింది పాయల్. అయితే అనుకున్నదే తడవుగా ప్రయత్నాలు మొదలుపెట్టినా, ఆమెకు పూల సేకరణలో పలు సవాళ్లు ఎదురయ్యాయి. ఆమె వ్యాపారాన్ని సప్లయర్లు ప్రశ్నించారు. ప్రారంభంలో ఆలయాలు కూడా వ్యర్థ పూలను ఏరుకోడానికి ఆమెను అనుమతించలేదు. అయినప్పటికీ అవగాహనా కార్యక్రమాలు చేపడుతూ, వ్యర్థ పూలతో జరిగే పర్యావరణ నష్టం గురించీ, తన ప్రయత్నం లక్ష్యం గురించీ వివరిస్తూ, అందరి మనసులనూ చూరగొంది. అలా వాలంటీర్ల సహాయంతో పూలను సేకరించడం మొదలుపెట్టి, అగర్‌బత్తీల తయారీకి పూనుకుంది.
అన్నీ పర్యావరణహితమే...
సాధారణంగా వాణిజ్యపరమైన అగర్‌బత్తీల తయారీలో హానికారకమైన రసాయనాలు లేదా బొగ్గునూ వాడుతూ ఉంటారు. ఇవి పర్యావరణానికీ, ప్రజల ఆరోగ్యానికీ హానికరం. కానీ పాయల్ బొగ్గు ఏమాత్రం ఉపయోగించని అగర్‌బత్తీలను తయారు చేస్తోంది. అగరొత్తుల తయారీ కోసం ఉపయోగించే పూలను ముందుగా ఎండబెట్టి, పొడిచేసి, గుగ్గలు, చెట్ల బంకను జోడించి ఆ మిశ్రమాన్ని అగరొత్తులుగా చుడుతుంది. ఈ పని కోసం ఆమె స్థానిక గ్రామాల్లోని మహిళలను నియమించు కుంది. పాయల్ దగ్గర గులాబీ, గంథం, లావెండర్, తులసి అగరొత్తులు తయారవుతాయి. ఇవన్నీ ఆలయాలు, ఇళ్లలో వాడకానికి ఎంతో సురక్షితమైనవి. పాయల్ బ్రాండ్ ఇన్సెన్స్ కోన్స్, ధూప్ స్టిక్స్, సేంద్రియ నూనెలను కూడా తయారు చేస్తోంది. ఇవన్నీ సింథటిక్ అడిటివ్స్ ఉపయోగించ కుండా తయారుచేసిన స్వచ్ఛమైన, సహజ సిద్ధమైన ఉత్పత్తులే కావడం విశేషం.
Updated Date - May 22 , 2025 | 08:39 AM