ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Swati Das: సైబర్‌ వల లో పడకుండా

ABN, Publish Date - May 21 , 2025 | 07:40 AM

సైబర్‌ నేరాల బాధితులకు మానసికంగా అండగా ఉండేందుకు స్వాతి దాస్‌ కౌన్సెలింగ్‌ అందిస్తున్నారు. పిల్లల్లో సోషల్‌ మీడియా దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ వందల వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు.

‘‘సైబర్‌ నేరాల బాధితులు ఎదుర్కొనేది ఆర్థిక నష్టం మాత్రమే కాదు, అంతకుమించిన వేదన కూడా...

అటువంటి వేలాది సైబర్‌ నేరాల బాధితులకు మానసికంగా అండగా నిలుస్తున్నారు ఒడిశాకు చెందిన స్వాతి దాస్‌. మరోవైపు సైబర్‌ నేరాల గురించి, సోషల్‌ మీడియాకు బానిసలు కావడం వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఐటీ రంగంలో పని చేసేవారిలో ఎక్కువమంది వారాంతాల్లో విశ్రాంతికి ప్రాధాన్యం ఇస్తారు. 32 ఏళ్ళ స్వాతి దాస్‌ దీనికి మినహాయింపు. శని, ఆది వారాల్లో ఉదయాన్నే భువనేశ్వర్‌- కటక్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు చేరుకుంటారు. సైబర్‌ నేరాల బాధితులకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. అలాగే విద్యా సంస్థలకు వెళ్తారు. యువతకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తారు. గత రెండున్నర ఏళ్ళుగా క్రమం తప్పకుండా ఆమె ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ‘‘సాంకేతికత పెరుగుతున్నకొద్దీ నష్టపోయే ముప్పు కూడా పెరుగుతోంది. పెద్దగా చదువులేనివారే కాదు విద్యావంతులు కూడా బలైపోతున్నారు. వారికి ఊరట కలిగించి, ఆత్మస్థైర్యాన్ని పెంచాలనే ఆలోచనే నాకు ప్రేరణ’’ అని చెబుతున్నారు స్వాతి. ఒడిశాలోని కటక్‌కు చెందిన ఆమె ఒక ఐటీ సంస్థలో పని చేస్తున్నారు. తన బంధువులు, స్నేహితులు, తోటి ఉద్యోగుల్లో కొందరు సైబర్‌ నేరాల బారిన పడి... డబ్బుతోపాటు మనశ్శాంతిని సైతం పోగొట్టుకోవడం ఆమెకు వేదన కలిగించింది. అదే సమయంలో స్వాతి..

పని చేస్తున్న ఐటీ సంస్థ తమ ఉద్యోగుల కోసం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా మెంటల్‌ హెల్త్‌ కౌన్సెలింగ్‌లో ఆమె శిక్షణ పొందారు. తన పరిచయస్తులు కొందరికి కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన వాలంటీర్లతో ఆమెకు పరిచయం అయింది. వారి ప్రోత్సాహంతో... పోలీసులు నిర్వహిస్తున్న సైబర్‌ నేరాల అవగాహన కార్యక్రమాల్లో ఆమె పాల్గొనడం మొదలుపెట్టారు. ఈ సమస్య తీవ్రత అప్పుడే తనకు మరింత లోతుగా అర్థమయిందంటారు స్వాతి.


బాధ్యతగా భావించా...

‘‘సైబర్‌ నేరాలు ప్రజలను మానసికంగా, భావోద్వేగపరంగా కల్లోలానికి గురిచేస్తాయి. దీనివల్ల వాళ్ళ బ్యాంకు ఖాతాలు ఖాళీ కావడం మాత్రమే కాదు... మనశ్శాంతి నాశనమవుతుంది. చేతకానితనం వల్లే మోసపోయామనే అపరాధ భావం, నలుగురికీ తెలిస్తే ఎలా? అనే ఆందోళన, నిస్సహాయత కారణంగా మనస్థిమితం కోల్పోయే ప్రమాదం ఉంది.. తోటివారి మీద నమ్మకం తగ్గిపోతుంది. కొందరు జీవితకాలం దాచుకున్నదంతా పోగొట్టుకోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా చేస్తారు. ఇవన్నీ చివరికి పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్జర్‌ (పిటిఎస్‌డి)కి దారితీస్తాయి. తీవ్ర నిస్పృహలో ఉన్న ఇటువంటివారికి సామాజికమైన మద్దతు అవసరం. వారి సమస్యలను శ్రద్ధగా విని, కౌన్సెలింగ్‌ ద్వారా వారికి అండగా నిలవడం నా బాధ్యతగా భావించాను’’ అని చెబుతున్నారు స్వాతి. మన దేశంలో సగటున రోజుకు ఏడువేల సైబర్‌ నేరాలు నమోదవుతున్నట్టు ‘‘ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్‌’ (ఐఫోర్‌సి) నిరుడు మేలో విడుదల చేసిన నివేదిక చెబుతోంది. అంటే ప్రతి నిమిషానికి నలుగురైదుగురు మోసగాళ్ళ బారిన పడుతున్నారు. ఆ బాధితులకు సాయపడే కీలకమైన పాత్రను స్వాతి పోషిస్తున్నారు. సైబర్‌ నేరాలపై అవగాహన, మానసిక ఆరోగ్యంపై పాఠశాలల్లో, కళాశాలల్లో, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో కొన్ని వందల వర్క్‌షాపులను ఆమె నిర్వహించారు. వెయ్యి మందికి పైగా బాధితులు వారి సమస్యల నుంచి బయటపడడానికి వ్యక్తిగతంగా సాయపడ్డారు. ఆమె భువనేశ్వర్‌-కటక్‌ పోలీస్‌ కమిషనరేట్‌తో కలిసి సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించడానికి పని చేస్తున్న ఏకైక మహిళా వాలంటీర్‌ కూడా. తన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం నుంచి, వివిధ సంస్థల నుంచి పురస్కారాలు సైతం అందుకున్నారు.


అతి ఏదైనా అనర్థమే

‘‘సైబర్‌ నేరాల బాధితుల్లో రకరకాల వ్యక్తులు ఉంటారు. భారీ ఆర్థిక నష్టం కారణంగా కుమిలిపోతున్నవారు వారి వివరాలను చెబుతున్నప్పుడు ఏడ్చేస్తూ ఉంటారు. మరికొందరు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఇష్టపడరు. హనీట్రాపింగ్‌ లేదా డీప్‌ ఫేక్‌ బారిన పడి డబ్బు పోగొట్టుకున్నవారు కూడా ఎంతో మంది. వారితో సహానుభూతితో మాట్లాడతాను. ఇలాంటిది జరిగింది వారొక్కరికే కాదని చెబుతాను. మానసికంగా దృఢంగా ఉంటేనే మిగిలిన జీవితాన్ని సజావుగా సాగించగలరనీ ఆత్మస్థైర్యాన్ని ఇస్తాను. ఇప్పటివరకూ యాభైకి పైగా పాఠశాలల్లో పిల్లలకు సైబర్‌ నేరాల గురించి వివరించాను. దీనితోపాటు ప్రస్తుతం మన జీవితాల్లో సోషల్‌ మీడియా కారణంగా తలెత్తుతున్న దుష్పరిణామాల గురించి కూడా చెబుతున్నాను. చిన్న వయసులోనే పిల్లలు స్మార్ట్‌ ఫోన్లకు, దానిలో వచ్చే రకరకాల కంటెంట్‌కు బానిసలవుతున్నారు. అతి ఏదైనా అనర్థమే. సామాజిక సంబంధాలమీద సోషల్‌ మీడియా ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా పిల్లల్లో దాని వాడకాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కుటుంబాలపైనా, ఉపాధ్యాయులపైనా ఉంది’’ అని చెబుతున్నారు స్వాతి. ప్రస్తుతం భువనేశ్వర్‌, కటక్‌ నగరాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను మరిన్ని ప్రాంతాల్లోనూ ఆమె చేపట్టబోతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2025 | 07:50 AM