ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

One Handed Champion: ఒంటిచేత్తో పతకాలు పట్టేస్తోంది

ABN, Publish Date - Aug 06 , 2025 | 01:02 AM

మాది కర్నూలు జిల్లా మద్దికెర. ఈరన్న, లలిత నా తల్లిదండ్రులు. మాది వ్యవసాయ కుటుంబం..

ఆమెది సాధారణ వ్యవసాయ కుటుంబం...

పుట్టుకతోనే వైకల్యం... ఒకవైపు సమాజం చిన్నచూపు... మరోవైపు లోకుల సానుభూతి...

మానసిక స్థైర్యంతో వీటన్నిటినీ అధిగమించి...

పారా క్రీడల్లో రాణిస్తోంది హెచ్‌.శివాని.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏడు స్వర్ణ

పతకాలు సాధించి, ఎందరికో ప్రేరణగా నిలుస్తున్న శివాని కథ ఆమె మాటల్లోనే...

‘‘మాది కర్నూలు జిల్లా మద్దికెర. ఈరన్న, లలిత నా తల్లిదండ్రులు. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న రోజూ గుంతకల్లుకు వెళ్లి... ఆకుకూరలు అమ్మేవారు. పుట్టుకతోనే నా కుడి చెయ్యి మోచేతి వరకూ మాత్రమే ఉంది. అది చూసిన కొందరు బంధువులు, ఇరుగుపొరుగువారు ‘‘ఈ అమ్మాయి మీకెందుకు? ఎక్కడైనా బయట పడేయండి. ఇంట్లోకి తెచ్చుకోవద్దు’’ అని గట్టిగా చెప్పారట. కానీ మా అమ్మ, నాన్న ఆ మాటలేవీ పట్టించుకోలేదు. నా తరువాత పుట్టిన ఇద్దరు తమ్ముళ్లతోపాటు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అయితే ఇంటి బయట పరిస్థితి వేరేగా ఉండేది. సగమే ఉన్న నా చెయ్యిని చూసి చాలామంది ఏమైందని అడిగేవాళ్లు. సానుభూతి చూపించేవాళ్లు. అటువంటప్పుడు ‘నేను ఏమీ చేయలేనా? ఏమీ సాధించలేనా?’ అని ఎంతో బాధ కలిగేది. ఒకప్పుడు నన్ను ఎక్కడైనా పడేయమని చెప్పినవాళ్లు ఆశ్చర్యపడేలా ఏదైనా సాధించాలని అనుకునేదాన్ని. నేను ఐదవ తరగతిలో కొడుమూరులో మా మేనత్త ఇంట్లో ఉండేదాన్ని అక్కడే నవోదయ పరీక్షలకు కోచింగ్‌ తీసుకున్నాను. కర్నూలు నవోదయ స్కూల్‌లో సీటు వచ్చింది. అక్కడ స్నేహితులు నన్ను చాలా బాగా చూసుకునేవాళ్లు. .

అలా అన్నవారే మెచ్చుకున్నారు...

మా స్కూల్‌ ప్రిన్సిపాల్‌ (ప్రస్తుతం నవోదయ విద్యాలయ సమితి అసిస్టెంట్‌ కమిషనర్‌) సాగరిక మేడమ్‌ చొరవతో నా జీవితం కొత్త మలుపు తిరిగింది. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు.. తెలంగాణలోని రంగారెడ్డి నవోదయ స్కూల్‌లో జరుగుతున్న పారా స్పోర్ట్స్‌ కు పంపించారు. అక్కడ షాట్‌పుట్‌, జావెలిన్‌ త్రోలో నా టాలెంట్‌ను గుర్తించి నన్ను ఎంపిక చేశారు. నాకు చదువుతో పాటు క్రీడల్లో కూడా రోజూ శిక్షణ ఇచ్చారు. శిక్షణకు రోజూ మధ్యాహ్నం వెళ్లి, రాత్రికి వచ్చేవాళ్లం. ఒక వైపు శిక్షణ తీసుకుంటూనే... జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్నా. మొదట గుజరాత్‌లో జరిగిన ఈవెంట్లలో షాట్‌పుట్‌లో సిల్వర్‌ మెడల్‌, జావెలిన్‌ త్రోలో గోల్డ్‌ మెడల్‌ వచ్చింది. దాంతో ఒకప్పుడు మా కుటుంబాన్ని పట్టించుకోనివారు కూడా... మా ఇంటికి వచ్చి, మా అమ్మానాన్నలతో. నా గురించి గొప్పగా మాట్లాడారు. ‘‘ఈ అమ్మాయి ఏమీ చేయలేదని అనుకున్నాం.. అయితే చాలా గొప్పగా సాధించింది’’ అని అభినందించారు.

అందరిలోనూ నైపుణ్యం ఉంటుంది...

తమకు వైకల్యం ఉందనీ,. జీవితంలో ఏదీ సాధించలేమని కొందరు నిరుత్సాహపడుతూ ఉంటారు. ఇది సరైన ఆలోచన కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. నేను క్రీడల్లో పాల్గొనడానికి బయట రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఎంతోమందిని చూశాను. నాకు చెయ్యి మాత్రమే లేదు. వాళ్లకు ఇంకా చాలా అవయవాలు లేవు. ‘వాళ్లకన్నా నేనే అదృష్టవంతురాలిని కదా’ అనుకున్నాను. ఇప్పుడు నాకు చెయ్యి లేదన్న విషయమే గుర్తుకు రాదు. భవిష్యత్తులో బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం చేయాలనేది నా లక్ష్యం. అందుకే మదనపల్లె నవోదయ స్కూల్‌లో ఇంటర్‌లో చేరాను. మా ప్రిన్సిపాల్‌ గీత మేడమ్‌ నా సమస్యను కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి గారి దృష్టికి తీసురువెళ్లారు. ఆయన సాయంతో నాకు కృత్రిమమైన కుడి చేతిని అమర్చారు. ఆ చేతికి ఇంకా అలవాటు పడాల్సి ఉంది. మా స్కూల్‌లో నా పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.. నా డైట్‌, ప్రాక్టీస్‌ విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కోచ్‌ సహకారంతో రోజూ ప్రాక్టీస్‌ చే స్తున్నాను.’’

-గౌనిపల్లె శ్రీనివాసులు

చాలా గర్వంగా అనిపించింది

2023లో థాయ్‌లాండ్‌లో జరిగిన ఈవెంట్లలో రెండు బంగారు పతకాలు సాధించాను. అక్కడ మన జాతీయ గీతం ఆలపించడం, నా శరీరంపై మన త్రివర్ణ పతాకాన్ని కప్పుకోవడం మాటలకు అందని, ఎన్నటికీ మరచిపోలేని అనుభూతి. చాలా గర్వంగా అనిపించింది. 2024లో కూడా థాయ్‌లాండ్‌లో పతకాలు గెలిచాను. ఇప్పటికి నేను ఏడు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం సాధించాను. దీనికి మా కోచ్‌ వేణు వినకోటి సహకారం ఎంతో ఉంది. భవిష్యత్తులో దేశం కోసం మరిన్ని పతకాలు గెలవాలన్నదే నా లక్ష్యం.

Updated Date - Aug 06 , 2025 | 01:02 AM