Mango Peel Nutrition: మామిడి తొక్క మంచిదేనా
ABN, Publish Date - May 26 , 2025 | 01:13 AM
మామిడి తొక్కలో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అయితే పురుగు మందుల అవశేషాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో శుభ్రంగా కడిగి తినడం అవసరం.
మామిడి పళ్లను ఇష్టపడని వారు ఉండరు. కానీ చాలామంది మామిడి తొక్కను తినకుండా పడేస్తారు. అయితే ఆ తొక్కలో కూడా పోషకాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..
మామిడి తొక్కలో ఫైబర్, విటమిన్ సి, ఇ, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గించడంతో పాటు ఆకలిని నియంత్రిస్తుంది. తొక్కలోని కెరోటినాయిడ్‌లు చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడతాయి. మామిడి తొక్కలోని పాలిఫెనాయిల్స్, కెరోటినాయడ్స్ వలన గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మామిడి తొక్క మధుమేహాన్ని నియంత్రించడంలోనూ సహాయపడుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది.
పురుగుమందుల అవశేషాలు: మామిడి తొక్కలో ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ దానిని తినడం వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. మామిడి తొక్కలోని ఉరుషియోల్ వలన కొందరికి చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు తలెత్తే ప్రమాదముంది. మామిడి తోటల్లో వాడే క్రిమి సంహారక మందుల అవశేషాలు మామిడి తొక్కపై ఉంటాయి. వాటి వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
సేంద్రీయ పళ్లు మేలు: ఎలాంటి పురుగు మందులు వాడకుండా పెంచే సేంద్రీయ(ఆర్గానిక్) పళ్లు తినడం మంచిది. అవి దొరకని పక్షంలో పళ్లను బాగా శుభ్రం చేసుకొని తినాలి.
ఇలా శుభ్రం చేద్దాం : నీళ్లలో ఉప్పు, పసుపు కలిపి పావు గంటసేపు పళ్లను అందులో నానబెట్టాలి. ఆ తరువాత తీసి బాగా రుద్దుతూ కడగాలి. ఇలా చేయడం వలన పళ్ల మీద ఉన్న పురుగు మందుల అవశేషాలు తొలగిపోతాయి.
నీళ్లతో వెనిగర్ లేదా బేకింగ్ సోడా వేసి ఓ ఇరవై నిమిషాల పాటు మామిడి పళ్లను వాటిలో నానబెట్టాలి. తరువాత మంచినీటితో శుభ్రంగా కడగాలి.
ఇవి కూడా చదవండి
Sheikh Hasina: మహ్మద్ యూనస్ దేశాన్ని అమెరికాకు అమ్మేశాడు.. మాజీ ప్రధాని షేక్ హసీనా..
Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..
Updated Date - May 26 , 2025 | 01:13 AM