Home Tips: మెరిసే సింక్ కోసం...
ABN, Publish Date - Apr 30 , 2025 | 03:54 AM
ఇంటిలోని సింక్‌లు వాడుతూ వాడుతూ పాతదై మరకలు పట్టే అవకాశముంది. రసాయనాలు కాకుండా సహజమైన చిట్కాలతో వాటిని మళ్లీ మెరిపించవచ్చు.
ప్రస్తుతం ప్రతీ ఇంట్లో సింక్‌లు ఉంటున్నాయి. వంటగదిలో, బాత్‌రూమ్ లో, ఇంటి వెనక తప్పనిసరిగా సింక్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. సాధారణం గా వీటిని స్టీల్, పింగాణి, గ్రానైట్, సిమెంట్‌లతో రూపొందిస్తూ ఉంటారు. వాడుతున్న కొద్దీ అవి మరకలతో నిండి పాతబడుతూ ఉంటాయి. అలాంటి వాటిని ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా చిన్న చిట్కాలతో కొత్తవాటిలా మెరిపించవచ్చు. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం..!
ఒక గిన్నెలోకి కొద్దిగా శనగపిండిని తీసుకోవాలి. ఒక స్క్రబ్బర్‌ను నీళ్లతో తడిపి దానితో శనగపిండిని అద్దుకుంటూ సింక్‌ను తోమాలి. స్టీల్, గ్రానైట్ ఇలా ఏ రకం సింక్‌నైనా శనగపిండి పూర్తిగా శుభ్రపరుస్తుంది. సింక్‌లో ఏర్పడే టూత్‌పేస్టు, సబ్బు, డిటర్జెంట్, నూనె తదితర మరకలను పోగొడుతుంది. ఈ చిట్కాతో సింక్ నుండి వెలువడే వాసనలు కూడా తొలగిపోతాయి.
ఒక గిన్నెలో రెండు చెంచాల శనగపిండి, ఒక చెంచా వైట్ వెనిగర్ వేసి బాగా కలిపి పేస్టులా చేయాలి. సింక్‌లోని మరకలమీద ఈ మిశ్రమాన్ని పూసి పావుగంటసేపు ఆరనివ్వాలి. తరవాత నీళ్లు చల్లుతూ స్క్రబ్బర్‌తో రుద్దితే మరకలన్నీ పోయి సింక్ కొత్తదానిలా మెరుస్తుంది. ఈ చిట్కాతో స్టీల్ సింక్ మీద పేరుకున్న నీటి మరకలు పూర్తిగా పోతాయి. పాలరాతి సింక్‌లను శుభ్రం చేయడానికి వెనిగర్ ఉపయోగించకూడదు.
ఒక గిన్నెలో రెండు చెంచాల శనగపిండి, మూడు చెంచాల నిమ్మరసం వేసి బాగా కలిపి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని సింక్ మొత్తానికి పట్టించి అరగంటసేపు ఉంచాలి. తరవాత నీళ్లు చల్లుకుంటూ స్క్రబ్బర్‌తో తోమితే సింక్ మీద మరకలన్నీ తొలగిపోతాయి. ఈ చిట్కాని ఏ రకం సింక్‌కైనా ఉపయోగించవచ్చు.
నిమ్మ తొక్క లోపలి భాగంలో కొద్దిగా ఉప్పు చల్లి దానితో సింక్ మొత్తాన్ని రుద్దాలి. పావుగంటసేపు ఆరిన తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే సింక్ తాజాగా మెరుస్తుంది. నిమ్మ తొక్కలను పడేయకుండా తరచూ ఇలా చేస్తూ ఉంటే సింక్ ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
Pakistan: భారత 'గూఢచారి డ్రోన్'ను కూల్చేశామన్న పాక్
Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..
Viral News: పాకిస్తాన్‌ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..
Updated Date - Apr 30 , 2025 | 03:54 AM