Women Entrepreneurs India: అమ్మ సంకల్పమే ఆసరాగా..
ABN, Publish Date - May 28 , 2025 | 07:13 AM
డౌన్ సిండ్రోమ్‌తో పుట్టిన అనసూయశర్మను ఆమె తల్లి అరితా పెర్సాడ్ అవిశ్రాంతంగా అభివృద్ధి చేసి, ‘లవ్‌బర్డ్స్ బై అను’ అనే లిప్‌బామ్ బ్రాండ్‌ను స్థాపించింది. కూతురి కోసం త్యాగాలు చేసి, ఆత్మవిశ్వాసాన్ని నింపిన తల్లి సంకల్పమే విజయానికి మూలం అయింది.
సంకల్పం
ఒక తల్లి సంకల్పం డౌన్ సిండ్రోమ్‌తో పుట్టిన కూతురికి మరో జన్మనిచ్చింది. చదువు చెప్పి... ఆత్మవిశ్వాసం నింపి... ఆమె అభిరుచినే వ్యాపారంగా మార్చేలా తీర్చిదిద్దింది. ఇప్పుడు లెక్కకు మించిన ఆర్డర్లతో... ఒక ప్రముఖ లిప్‌బామ్ బ్రాండ్‌గా ఆ కంపెనీ అవతరించింది. కూతురు అనసూయ శర్మ విజయవంతమైన ప్రయాణం... ఆమె తల్లి అరితా పెర్సాడ్ మాటల్లో...
‘‘మొదటి సంతానంగా అబ్బాయి పుట్టాక... అమ్మాయి కావాలనుకున్నాం. మా ప్రార్థనలు ఫలించి రెండో కాన్పులో నాకు అమ్మాయి పుట్టింది. ఇంట్లో ఆనందానికి హద్దులు లేవు. సంబరాలు చేసుకున్నాం. కానీ ఆ సంతోషం ఎంతోకాలం లేదు. మా అమ్మాయి అనసూయశర్మకు డౌన్ సిండ్రోమ్ వ్యాధి ఉందని వైద్యులు నిర్థారించారు. అది మా కుటుంబాన్ని కుదిపేసింది. దుఃఖంలో మునిగిపోయాం. తన భవిష్యత్తు తలుచుకొని చాలా బాధపడ్డాం. కొన్ని రోజుల తరువాత అనిపించింది... అన్నీ తెలిసిన మేమే ఇంతలా కుంగిపోతే లోకం తెలియని మా అమ్మాయి పరిస్థితి ఏంటని! బాధను పక్కన పెట్టేశాం. ఇక ఆలస్యం చేయలేదు. తనే నా లోకం అనుకున్నాను. సాధారణ పిల్లలకు దీటుగా పాపను పెంచాలని దృఢంగా సంకల్పించుకున్నాను. దేశ రాజధాని ఢిల్లీ మాది. అను పుట్టే సమయానికి నేను ఒక కార్పొరేటు కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాను. బిజినెస్ పాఠాలు చెప్పేదాన్ని. తన కోసం ఉద్యోగం మానేశాను. కూతురు దిగులుతో నేను ఏమైపోతోనో అని మావారు మొదట్లో ఆందోళన పడ్డారు. ఒక్కసారి బాధలో నుంచి బయటకు వచ్చాక... ఆయన మనసు కాస్త కుదుటపడింది.
సవాళ్లు కొత్త కాకపోయినా...
కెరీర్‌లో ఉన్నత స్థానంలో ఉన్న ఒక మహిళగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. కానీ కూతురు విషయంలో ఎదురైన సవాలు నా జీవితంలోనే అతిపెద్దది. వ్యక్తిగతమైనది. ‘భవిష్యత్తులో అను వేరొకరి సాయం లేకుండా జీవించగలదా? ఎదగాలంటే తనకు ఉన్న అవకాశాలేమిటి? ఈ సమాజం తనను ఎలా చూస్తుంది?’ ఈ ప్రశ్నలు నాకు నిద్ర పట్టనిచ్చేవి కావు. ఈ క్రమంలో నేను, మావారు... అనులాగా డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న పిల్లలు, వారి కుటుంబాలను కలిశాం. మా పరిధిమేర లోతుగా వ్యాధి గురించి, వారికి ఇచ్చే శిక్షణ గురించి తెలుసుకున్నాం. ఎక్కడో చిన్న నమ్మకం కలిగింది... తను కూడా అందరిలా అద్భుతాలు చేయగలదని.
యోగాతో మొదలుపెట్టి...
ముందుగా అనూకు యోగాను పరిచయం చేశాను. చిన్న చిన్నవాటితో మొదలై క్రమంగా క్లిష్టమైన ఆసనాలు నేర్పించాను. దానివల్ల శరీరంలో కదలికలే కాదు... క్రమశిక్షణ కూడా అలవడింది. ఏకాగ్రత కుదిరింది. స్కూల్లో చేర్పిస్తే... అక్కడ మళ్లీ సమస్యలు ఎదురయ్యాయి. చాలా నెమ్మదిగా రాసేది. లెక్కల్లో అయితే ఇంకా నిదానం. ఎంతో ఓర్పుతో ఒకటికి పదిసార్లు అనూతో చేయించాను. దాంతో నిదానంగా పుంజుకుంది. ఒక్కసారి తన మెదడులోకి వెళితే అలా గుర్తుండిపోతుంది. అదే తన బలం. 2020లో కరోనాతో అందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. ఆ సమయంలో మా గ్యారేజీలో ఒక లెమనేడ్ స్టాండ్ ఏర్పాటు చేశాను. స్టాండ్ అంటే ఒక చిన్న కొట్టులాగా. అందులో నాణేల లెక్కలు, నిమ్మకాయ రసం తయారీకి అవసరమైన పదార్థాలను కొలవడం నేర్పించాను. అన్నిటికంటే తనకు బాగా ఇష్టమైంది... ఇరుగుపొరుగుతో మాట్లాడడం. ఆ స్టాండ్ పెట్టాక చుట్టుపక్కలవారు వచ్చి అనూను సరదాగా పలుకరించేవారు.
మక్కువనే వ్యాపారంగా మలిచి...
క్రమంగా అనూలో ఆత్మవిశ్వాసం పెరిగింది. చదువుతో పాటు చిన్నపాటి వ్యాపార మెళకువలు కూడా నేర్పిస్తే బాగుంటుందని అనిపించింది. ఏంచేయాలని ఆలోచిస్తుంటే.. అనూకు లిప్‌స్టిక్‌పై ఉన్న ఇష్టం గుర్తుకువచ్చింది. లిప్‌స్టిక్ తను వేసుకోదు కానీ... ఆ రంగులు, అందమైన ప్యాకింగ్‌లవల్ల వాటిని ఎంతో ఆసక్తిగా చూస్తుండేది. ఆ సమయంలో తన కళ్లల్లో మెరుపు కనిపించేది. తనకు నచ్చిన లిప్‌బామ్స్ తయారు చేస్తే ఎలా ఉంటుంది? ఆలోచన బాగుంది. కానీ ఎలా? యూట్యూబ్‌లోకి వెళ్లి తయారీ నేర్చుకున్నా. తనకూ చూపించి, వివరించి చెప్పాను. బానే అర్థం చేసుకునేది.
ఎన్నో ప్రయత్నాల తరువాత...
లిప్‌బామ్ తయారీ కోసం గంటలతరబడి ఇద్దరం వీడియోలు చూసేవాళ్లం. ఒకరోజు ప్రయోగాత్మకంగా మొదలుపెట్టాం. తొలి ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. ఒకటి రెండు కాదు... ఎన్నోసార్లు ప్రయత్నించాం. పట్టు విడవలేదు. చివరకు మా కష్టం ఫలించింది. మంచి లిప్‌బామ్ తయారైంది. బంధువులు, స్నేహితులకు ఇచ్చాం. వారి నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దాంతో అందంగా ప్యాకింగ్ చేసి, విక్రయానికి పెట్టాం. అనుకున్నదాని కంటే పది రెట్లు అమ్ముడయ్యాయి. తెలిసినవారి నుంచే కాదు, కార్పొరేటు కంపెనీల బహుమతుల జాబితాలో కూడా మా ‘లవ్‌బర్డ్స్ బై అను’ లిప్‌బామ్ చేరింది. మేం లేకపోయినా... ఇప్పుడు అను సొంతంగా లిప్‌బామ్ తయారు చేయగలుగుతుంది. మా అమ్మాయికి ప్రస్తుతం పంథొమ్మిదేళ్లు. ఎవరైనా వచ్చి తనను పలుకరిస్తే... ‘ఇప్పుడు నేను కంపెనీకి సీఈఓ’ అంటూ చాలా గర్వంగా చెబుతుంది. ఇదే కదా నేను కోరుకున్నది.’’
Updated Date - May 28 , 2025 | 07:16 AM