Women Entrepreneur: చిరు ప్రయత్నం..
ABN, Publish Date - May 22 , 2025 | 08:42 AM
ఢిల్లీకి చెందిన ఆంచల్ సక్సేనా, ఆరోగ్యకరమైన చిరుధాన్యాలతో తయారైన చిరుతిళ్ల బ్రాండ్ ‘మ్యాడ్ ఓవర్ మిల్లెట్స్’ ను స్థాపించి, పోషక విలువలు ఉండేలా ప్రత్యేకంగా తయారీ చేపట్టారు. అవగాహన సృష్టిస్తూ, పర్యావరణహిత ప్రక్రియలతో స్థానిక రైతులకు మద్దతు ఇస్తూ సంస్థను దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచిదే. అయితే రుచికరంగా వండే క్రమంలో వాటిలోని పోషకాలు చాలావరకు పోతాయి. అలా కాకుండా వాటిల్లోని పోషకాలు నిలిచి ఉండేలా చిరుతిళ్లు తయారు చేస్తున్నారు ఢిల్లీకి చెందిన ఆంచల్ సక్సేనా. ఇతర దేశాలకు విస్తరించాలనుకుంటున్న తన ‘మ్యాడ్ ఓవర్ మిల్లెట్స్’ ప్రయాణంలోని విశేషాలు ఆమె మాటల్లోనే...
‘‘బయట దొరికే చాలావరకు చిరుతిళ్లు ఎక్కువగా ప్రాసెస్ చేయడం వల్ల పోషకాలు తక్కువగా ఉంటున్నాయని కొవిడ్ సమయంలో నేను గుర్తించాను. అప్పుడే పూర్వీకుల కాలం నుంచి ఆరోగ్యానికి మంచివైన చిరుధాన్యాలను రోజువారీ చిరుతిళ్లలో భాగం చేయాలన్న ఆలోచన వచ్చింది. ఇంట్లోనే రాగులు, జొన్నలు, అవిసెగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, సేంద్రీయ బెల్లం, నెయ్యి వంటి వాటితో ప్రయోగాలు చేశాను. ఆ తరువాత నా ఆలోచనను నా చిరకాల స్నేహితుడు హిమాన్షు మిశ్రాతో పంచుకున్నాను. హిమాన్షుకు వ్యాపార కార్యకలాపాలు, నిర్వహణపై అనుభవం ఉండడం, నాకు వంటపై మక్కువ ఉండడంతో ప్రజలకు చిరుధాన్యాలతో రుచికరమైన, ఆరోగ్యకరమైన చిరుతిళ్లు అందించడమే లక్ష్యంగా మేమిద్దరం కలిసి 2022లో ‘మ్యాడ్ ఓవర్ మిల్లెట్స్’ సంస్థను స్థాపించాం.
అవగాహన కల్పించడమే సవాలు
ఇప్పుడంటే ప్రజలకు చిరుధాన్యాలపై అవగాహన ఉంది. కానీ ‘మ్యాడ్ ఓవర్ మిల్లెట్స్’ ప్రారంభించినప్పటికి చిరుధాన్యాల ప్రయోజనాల గురించి ప్రజలకు సరైన అవగాహన లేదు. అదే మాకు పెద్ద సమస్యగా మారింది. దాంతో వినియోగదారులకు అవగాహన కల్పించడం కోసం ఎంతో కష్టపడ్డాను. చిరుధాన్యాల ఆహారపదార్థాలపై పలు చర్చల్లో పాల్గొన్నాను. వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసగించా. డిజిటల్ మీడియా, సోషల్‌మీడియా ద్వారా, ఇన్‌ఫ్లూయెన్సర్ల ద్వారా ప్రచారం చేశాను. హైదరాబాద్‌లోని ఏకైక మిల్లెట్ ఇన్‌స్టిట్యూట్ న్యూట్రిహబ్ నుంచి కూడా గుర్తింపు సాధించాం. అలాగే జిమ్‌లు, ఆర్గానిక్ దుకాణాలు, కొన్ని కార్పోరేట్ కార్యాలయాలకు తమ ఉత్పత్తుల నమూనాలను ఉచితంగా అందించాం. ఇలా ఎంతో శ్రమించి చివరికి వినియోగదారుల నమ్మకం గెలుచుకోగలిగాం. మేము రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్) నుంచి చిరుధాన్యాలు సేకరిస్తున్నాం. దీని వలన రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతోంది.
లో హీట్ బేకింగ్
తక్కువ వేడితో వండడం(లో-హీట్ బేకింగ్), వ్యాక్యూమ్ ప్యాకింగ్(ప్యాకెట్ లోపల గాలి తీసివేయడం) వంటి ఆవిష్కరణలు మా ‘మ్యాడ్ ఓవర్ మిల్లెట్స్’ సంస్థ ఎదుగుదలలో ఎంతో ఉపయోగపడ్డాయి. లో-హీట్ బేకింగ్ వల్ల చిరుతిళ్లలో ఫైబర్, ఇతర పోషకాలు పోకుండా ఉండడంతో పాటు చిరుతిళ్లు మనకు కావాల్సినట్టు క్రంచీగా(కరకరలాడుతూ) ఉంటాయి.
భవిష్యత్ ప్రణాళికలు
మ్యాడ్ ఓవర్ మిల్లెట్స్‌ను వచ్చే ఐదేళ్లలో పలు దేశాలకు విస్తరించాలనుకుంటున్నా. మిడిల్ ఈస్ట్, దక్షిణాసియాలకు విస్తరించాలని ప్రణాళికలు కూడా రూపొందించుకుంటున్నాం. అలాగే మన దేశంలో పెద్ద ఆహార పదార్ధాల కంపెనీల సహకారం కోసం ప్రయత్నిస్తున్నాం.
ఓపికతో ఎదురుచూడండి
ఓ మహిళా వ్యవస్థాపకురాలి(ఎంటర్‌ప్రెన్యూర్)గా నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. అయితే నాలా నచ్చిన రంగంలో లేదా వ్యాపారంలో ఎదగాలనుకునే మహిళలకు నేనిచ్చే సలహా ఏంటంటే మార్కెట్ పోకడ గురించి తెలుసుకొని ముందు చిన్నగా మొదలు పెట్ట్టి, తర్వాత విస్తరించుకోమని. అలాగే తక్కువ ఖర్చుతో ప్రచారం కోసం డిజిటల్ మార్కెటింగ్‌ను ఉపయోగించుకోమని, విజయం కోసం ఓపికగా ఎదురుచూడమని చెప్తాను.’’
Updated Date - May 22 , 2025 | 08:43 AM