ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Madhu Appasani Life Coach: కలలను నిజం చేసేలా...

ABN, Publish Date - May 22 , 2025 | 08:57 AM

లక్ష్యాలు, కలల దిశగా ప్రజలను నడిపించే లైఫ్‌ కోచ్‌గా మధులిక అప్పసాని అనేకరిని ప్రేరేపిస్తున్నారు. తగిన ప్రణాళికలతో, మానసిక అవరోధాలను తొలగించి, వారిని విజయానికి చేర్చడమే ఆమె లక్ష్యం.

లక్ష్యం తెలుసు... కానీ దాన్ని చేరుకోవడంలో తడబడుతుంటాం. కలలు కంటాం... వాటిని నెరవేర్చుకొనే మార్గం తెలియక ఇబ్బందులు పడుతుంటాం. నైపుణ్యం ఉండి... సాధించగల సామర్థ్యం ఉండి... ఎక్కడో వెనకపడిపోతాం. ఇలాంటి అవరోధాలను దాటించి... ప్రేరణ కల్పించి... జీవితంలో ముందడుగు వేయించేవారే లైఫ్‌ కోచ్‌ అంటారు మధులిక అప్పసాని. అవార్డులందుకున్న లైఫ్‌ కోచ్‌గా వందల మందికి తమ లక్ష్యాలు, కలలను సాకారం చేసుకోవడంలో దోహదపడిన ఆమె... ‘నవ్య’తో ముచ్చటించారు.

‘‘ఒకప్పుడు లైఫ్‌ కోచింగ్‌ అంటే చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు అత్యంత డిమాండ్‌ ఉన్న రంగంగా ఎదుగుతోంది. ముఖ్యంగా కరోనా తరువాత దీని అవసరం బాగా పెరిగింది. నేను కొవిడ్‌ ముందు 2019 నుంచి లైఫ్‌ కోచ్‌గా పని చేస్తున్నా. కొవిడ్‌వల్ల ఆన్‌లైన్‌ తరగతులు, ఉద్యోగాలతో ఇంట్లోనే అధిక సమయం గడపడంవల్ల శారీరకంగానే కాదు, మానసికంగానూ చాలామంది గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. వాటి నుంచి బయటకు రావడానికి లైఫ్‌ కోచ్‌లను ఆశ్రయించడం అధికమైంది. ఇదీ సైకాలజీలో ఒక భాగమే. కానీ సైకాలజీ కాదు. అంటే స్పోర్ట్స్‌ కోచింగ్‌ లాగా. ఒత్తిడి, మానసిక ఆందోళనలు, గాయాల నుంచి బయటకు రావాలనుకొంటే అది సైకాలజీకి సంబంధించింది. అలాగే భార్యాభర్తలు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల్లో సమస్యలు వచ్చినా సైకాలజిస్టులను సంప్రతిస్తారు. కానీ లైఫ్‌ కోచ్‌లుగా మేము... చేసే పనికి, జీవితానికి మధ్య సమతుల్యత ఉండేలా కృషి చేస్తాం. సమయం, శక్తిసామర్థ్యాల నిర్వహణ (టైమ్‌, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌) చూస్తాం. భావాలను, ఆలోచనలను స్పష్టంగా, సులభంగా ఎలా పంచుకోవాలనేది చెబుతాం. చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించి, తద్వారా అసలైన లక్ష్యాన్ని చేరుకొనేలా ప్రేరణనిచ్చి, ఒక ప్రణాళికను రూపొందిస్తాం.


వారి లక్ష్యానికి మా భరోసా...

నా దగ్గరకు వచ్చే క్లయింట్‌ తన కలను నా ముందు పెడతాడు. అతడి కలను సాకారం చేయాల్సిన బాధ్యత నాది. ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతా. నాకు ఒక క్లయింట్‌ ఉంది. కంపెనీ టర్నోవర్‌ను 25 కోట్ల నుంచి 100 కోట్లకు పెంచాలనేది తన లక్ష్యం. కానీ ‘ఇది నావల్ల కాదు’ అనే అపనమ్మకం ఆమె మెదడులో పాతుకుపోయింది. తనకు అంతటి సామర్థ్యం లేదనుకొంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే... మనం కొన్నిసార్లు ఆత్మవిమర్శ చేసుకొంటూ ఎదిగేస్తాం. వేరొకరితో పోల్చుకొంటూ, అందులోనే ప్రేరణ వెతుక్కొనే ప్రయత్న చేస్తాం. కానీ ఒక స్థాయికి వెళ్లాక పోల్చుకోవడానికి ఆ స్థాయిలో మన చుట్టూ ఎవరూ ఉండరు. ఆమె విషయంలో అదే జరిగింది. ఆమె సర్కిల్‌లో తనకంటే శక్తిమంతమైన మహిళలు ఎవరూ లేరు. అలాంటప్పుడు ఆత్మవిమర్శ, పోలిక పని చేయవు. కనుక ఆమె మదిలో మెదిలే ఆలోచనల మీద దృష్టి పెట్టి, సమయపాలన, రోజువారీ కార్యక్రమాల జాబితాను క్రమపద్ధతిలో పెట్టాం. అన్నిటినీ బేరీజు వేసుకొని, వేరొకరితో పోల్చుకోకుండా... లక్ష్యం నుంచి వెనక్కి పోకుండా... అనుకున్నది ఎలా సాధించగలదనే విషయంపై ఒక అంచనాకు వచ్చాం. దానికి అనుగుణంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించి ఇచ్చాం.


అదే మా పని...

పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, లేదా ఆ కుటుంబాల నుంచి వచ్చే వ్యక్తులు కావచ్చు, నీట్‌ లాంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనుకొనే విద్యార్థులు కావచ్చు... వీళ్లు నా వద్దకు వస్తారు. ఎక్కువగా ఒన్‌ టు ఒన్‌ కోచింగ్‌ ఇస్తాను. అలాగే మహిళా బృందాలకు వర్క్‌షా్‌పలు, కార్పొరేటు సంస్థల్లో సెషన్స్‌ నిర్వహిస్తుంటాను. ఒక రకంగా లైఫ్‌ కోచింగ్‌ అనేది ఒలింపిక్స్‌కు వెళ్లే క్రీడాకారుడిని అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా తీర్చిదిద్దడం లాంటిది. అంటే ఇక్కడకు వచ్చేవారు అప్పటికే నైపుణ్యం సంపాదించి ఉంటారు. నిరూపించుకొని ఉంటారు. కాకపోతే ఫినిషింగ్‌ లైన్‌ దగ్గర్లో ఉన్నప్పుడు... ‘నీవల్ల కాదు’ అని ఎప్పుడో వాళ్ల అమ్మో, నాన్నో చెప్పిన మాటలో, ఇంకేదో హఠాత్తుగా గుర్తుకువస్తాయి. దాంతో ఉన్నట్టుండి వారి ప్రయాణం నెమ్మదిస్తుంది. ఈ గందరగోళాన్ని, అపనమ్మకాన్ని పారద్రోలి, లక్ష్యం వైపు నడిపించడమే మా పని.

అందుకే ఇటు వైపు...

మా అమ్మానాన్నలది పశ్చిమ గోదావరి జిల్లా అయినా... నా బాల్యం, విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే సాగింది. నాన్నకు కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ ఉంది. ఎంబీయే ఫైనాన్స్‌ పూర్తయిన తరువాత పుణె సింబియాసిస్‌ యూనివర్సిటీలో బీబీఏ చదివాను. పెళ్లి తరువాత చెన్నైలోని మా మామగారి కంపెనీలో ఎనలి్‌స్టగా, ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పని చేశాను. 2016లో పెద్ద నోట్ల రద్దు తరువాత మా కంపెనీని ఒక ఫ్రెంచ్‌ ఎమ్మెన్సీకి అమ్మేశాం. తరువాత మావారు ఏరోస్పే్‌సకు సంబంధించి వేరే కంపెనీ కొన్నారు. అప్పటికి నాకు పెళ్లయి నాలుగేళ్లు అయిందనుకొంటా. మాకు ఇద్దరు పాపలు. ఇల్లు, పిల్లలు, కుటుంబ బాధ్యతలు ఉన్నప్పుడు... దానికి అనుగుణమైన కెరీర్‌ను ఎంచుకోవాలి కదా. అందుకే నేను లైఫ్‌ కోచింగ్‌లోకి వచ్చాను. నాది బిజినెస్‌, ఎంబీయే నేపథ్యం కాబట్టి... ఎక్కువగా పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన సమస్యలు చూస్తుంటాను. కొన్ని పత్రికలు, మ్యాగజైన్లకు ఆర్టికల్స్‌ కూడా రాశాను. మా నాన్న, మా మామగారే నాకు స్ఫూర్తి.


సవాళ్లు ఎన్నో...

లైఫ్‌ కోచ్‌ కావాలనుకొనేవారికి ఐసీఎఫ్‌ (ఇంటర్నేషనల్‌ కోచింగ్‌ ఫెడరేషన్‌), ఎన్‌ఎల్‌పీ (న్యూరో లింగ్విస్టిక్‌ ప్రోగ్రామింగ్‌) లాంటి ప్రముఖ సంస్థలు ఈ కోర్సులు అందిస్తున్నాయి. కోర్సు పూర్తయితే సర్టిఫికెట్‌ ఇస్తారు. నేను ఎన్‌ఎల్‌పీ చేశాను.

అయితే ఒక్కదాంతోనే సరిపోదు. మెరుగైన సేవలు అందించాలంటే ప్రముఖ కోచ్‌ల వద్ద శిక్షణ తీసుకొంటూ, ఇలాంటి కోర్సులు మరికొన్ని చేస్తుండాలి. లైఫ్‌ కోచ్‌కు ప్రధానంగా ఉండాల్సిన లక్షణం... చెప్పింది ఓపిగ్గా వినగలగడం. వారి సమస్యలపై ఒక అవగాహనకు వచ్చేవరకు సలహాలు ఇవ్వకుండా ఉండడం. అలాగే ప్రశ్నలో స్పష్టత, పొంతన తప్పనిసరి. మనం అడిగే ప్రశ్నకు అతడు నిస్సంకోచంగా బదులిస్తాడా? లేక చిన్నబుచ్చుకొంటాడా? అనేది గ్రహించగలగాలి. ఇక్కడ విద్య, విజ్ఞానం చాలా ముఖ్యం.

ఎన్నో సవాళ్లతో కూడుకున్న వృత్తి ఇది.

నా క్లయింట్స్‌కు నేను సాధారణంగా ఎనిమిది సెషన్స్‌ తీసుకొంటాను. తొలి సెషన్‌లోనే వారేమిటి అనేదానిపై స్పష్టత వస్తుంది. ఇప్పటివరకు వర్క్‌షా్‌పల పరంగా, వ్యక్తిగతంగా వెయ్యి మందిని కలిశాను. తమ లక్ష్యాలను, కలలను నెరవేర్చుకొనేలా ఎంతోమందికి లైఫ్‌ కోచింగ్‌ ఇచ్చాను. మా పిల్లలు చిన్నవాళ్లు కనుక ఉదయం 9 నుంచి సాయంత్రం 3 వరకు మాత్రమే ఆఫీసులో ఉంటున్నాను. ఇంటికి వచ్చాక యూరప్‌ తదితర ప్రాంతాల నుంచి కాల్స్‌ వస్తాయి. వారికి ఆన్‌లైన్‌లోనే కౌన్సెలింగ్‌ ఇస్తాను.’’

-హనుమా

Updated Date - May 22 , 2025 | 08:58 AM