Zarna Garg: నవ్వుల బాటసారి
ABN, Publish Date - May 01 , 2025 | 04:29 AM
పదహెనేళ్ల వయసులో ఇల్లు వదిలి అమెరికా చేరిన జర్నా గార్గ్ అక్కడ ఉన్నత చదువులు పూర్తి చేసి స్టాండప్ కమెడియన్‌గా ప్రపంచాన్ని నవ్విస్తున్నారు. ఆమె కథ ఒక సాధారణ గృహిణిగా ప్రారంభమై రచయితగా, నటిగా, హాస్య నటిగా వెలుగొందిన ఆదర్శప్రాయమైన ప్రయాణం.
పధ్నాలుగేళ్లకే తల్లిని పోగొట్టుకున్నారు. ఆ వయసులో పెళ్లి చేసుకోమని తండ్రి బలవంతం పెట్టడంతో... ఇల్లు వదిలి వెళ్లిపోయారు. అనుకోకుండా అమెరికా చేరి... ఉన్నత చదువులు చదివి... స్టాండప్ కమెడియన్‌గా నవ్వులు విరబూయిస్తున్నారు. స్ర్కీన్ రైటర్‌గా... పాడ్‌కాస్టర్‌గా... రచయితగా... వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్న ఆమె... ఇటీవల నటిగా మరో కొత్త పాత్రలో ఒదిగిపోయారు. అమెరికాలో స్థిరపడిన భారత స్టాండప్ కమెడియన్... యాభై ఏళ్ల జర్నా గార్గ్ ముచ్చట ఇది.
‘‘చిన్నప్పటి నుంచే కలలు కనడం... ఆ కలను నిజం చేసుకోవడానికి అహర్నిశలూ శ్రమించడం... నా జీవితంలో ఇవేవీ లేవు. నా బాల్యం, కౌమారం అంతా ముంబయి మహానగరంలోనే సాగింది. పధ్నాలుగేళ్లప్పుడు అనారోగ్యంతో మా అమ్మ మరణించింది. కొద్ది రోజులకే నాకు పెళ్లి చేయాలని నిశ్చయించారు మా నాన్న. ఇప్పుడే పెళ్లి వద్దంటే... వినలేదు.
నాలో నేనే ఎంతో బాధపడ్డాను. నా చుట్టూ ఉన్న గోడలు మీద కూలుతున్న అనుభూతి. అందరూ ఉన్నా... ఒంటరినయ్యానన్న బాధ. నా ముందు ఉన్నవి రెండే దారులు... నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం. లేదంటే ఇల్లు వదిలి వెళ్లిపోవడం. టీనేజీ వయసు కదా... ఉడుకు రక్తం. నా దారి నేను చూసుకోవాలనుకున్నా. విశేషమేమంటే... అడుగు బయట పెట్టగానే బంధువులు, స్నేహితులు నా కోసం ఇంటి తలుపులు తెరిచారు. అది ఎంతో ధైర్యాన్నిచ్చింది. నేను ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు విరబూస్తాయని అందరూ అంటుండేవారు. వారందరూ నన్ను ఆదరించడానికి అది కూడా ఒక కారణమైంది.
సాహసోపేత నిర్ణయం...
అయితే ఇంటి నుంచి బయటకు వచ్చేశాక... ముంబయిలో ఎక్కువ రోజులు లేను. ఉన్నట్టుండి నా మనసు అమెరికా వైపు మళ్లింది. దానికి కారణం... మా అక్క. తను ఓహియోలోని ఆక్‌రన్‌లో ఉండేది. ‘నేనూ అక్కడికి వచ్చేస్తా’నంటే సరేనంది. మరో ఆలోచన లేకుండా అమెరికా వెళ్లిపోయాను. అక్క, తన కుటుంబం నన్ను ఎంతో ఆదరించారు. నిజంగా నా జీవితంలోనే అది ఒక సాహసోపేత నిర్ణయం. ‘యూనివర్సిటీ ఆఫ్ ఆక్‌రన్’ నుంచి ఫైనాన్స్‌లో డిగ్రీ పూర్తి చేశాను. తరువాత ‘కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా’లో లా చదివాను. కాలేజీ రోజులను ఎంతో ఆస్వాదించాను.
పదహారేళ్లు ఇంట్లోనే...
చదువు అవ్వగానే 1998లో షలబ్ గార్గ్‌ను పెళ్లి చేసుకున్నాను. మాకు ముగ్గురు సంతానం. భర్త, పిల్లలు, వాళ్లకు కావల్సినవి చూసుకోవడం... పదహారేళ్లు ఇంట్లోనే గడిచిపోయాయి. ఒక రోజు మా పిల్లలు అన్నారు... ‘అమ్మా... నువ్వు స్టాండప్ కమెడియన్‌గా ప్రయత్నించు’ అని. పదిహేనేళ్లు ఇల్లాలి పాత్ర సమర్థవంతంగా పోషించిన నేను... పిల్లల ప్రోత్సాహంతో స్టాండప్ కమెడియన్‌గా కొత్త అధ్యాయం మొదలుపెట్టాను. 2018లో... న్యూయార్క్ నగరం... మైక్ పట్టుకొని వేదిక ఎక్కి తొలిసారి ప్రదర్శన ఇచ్చాను. పూర్తిస్థాయి స్టాండప్ కమెడియన్‌గా మారడానికి ఆ షో దోహదపడింది. మరుసటి ఏడాది అదే నగరంలో మరో ప్రదర్శన. నాటి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
స్ర్కీన్ ప్లే...
అయితే నేను హాస్య గుళికలు ఇవ్వడంతోనే సరిపెట్టుకోలేదు. ఎప్పటి నుంచో అంతర్లీనంగా దాగివున్న భావాలు అక్షరాలుగా బయటకు రావడం మొదలయ్యాయి. ఖాళీ దొరికినప్పుడు వాటన్నిటినీ కలం పట్టుకొని కాగితం మీద పెట్టేసేదాన్ని. ఆ క్రమంలోనే అనుకోని అవకాశం ఒకటి వచ్చింది... సినిమాకు స్ర్కీన్ ప్లే రాయమని. అలా ‘రీఅరేంజ్డ్’ అనే చిత్రంతో రచయితను అయ్యాను. విశేషమేమంటే... ఆ చిత్రానికి ‘ఆస్టిన్ ఫిలిమ్ ఫెస్టివల్’లో ఉత్తమ కామెడీ స్ర్కీన్ ప్లే అవార్డు దక్కింది. పదకొండు వేల ఎంట్రీల్లో నాకు అవార్డు రావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.
ఆ తరువాత మరికొన్ని చిత్రాలకు కూడా స్ర్కీన్‌ప్లే రాశాను. అంతేకాదు... ఇటీవలే నా జీవిత విశేషాలతో కూడిన సరదా పుస్తకం ‘దిస్ అమెరికన్ ఉమన్’ ఆవిష్కరణ జరిగింది. దానికి అద్భుతమైన స్పందన వస్తోంది.
ఆత్మసంతృప్తి కోసం...
బాధగా ఉన్నప్పుడు హాస్యం చికిత్సలా ఉపయోగపడుతుంది. మన దృక్పథాన్ని సానుకూలంగా మారుస్తుంది. ఇన్నేళ్ల నా ప్రయాణంలో నాకు బోధపడిన సత్యం ఇది. అందుకే సాధ్యమైనంత మందికి హాస్యం పంచడానికి ప్రయత్నిస్తున్నాను. అమెరికాలోని ప్రముఖ క్లబ్స్, ఇతర వేదికలల్లో కూడా ప్రదర్శనలు ఇస్తున్నాను. ఇవన్నీ డబ్బు తీసుకొని చేసే షోలు. కానీ ఎలాంటి పారితోషికం తీసుకోకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థల కోసం ఉచితంగా షోస్ చేస్తున్నాను. ఇది నా ఆత్మసంతృప్తి కోసం. ఈ ప్రయాణంలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాను. అవన్నీ నాకు ఎనలేని స్ఫూర్తిని, నూతనోత్తేజాన్ని ఇస్తాయి.
తెరపై తళుకులు...
చెప్పాను కదా... నాకంటూ ఏ కలలూ లేవని. వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొంటూ సాగిపోతున్నాను. అలా వచ్చిన మరో అరుదైన అవకాశమే... సినిమా. గత ఏడాది విడుదలైన ‘ఏ నైస్ ఇండియన్ బాయ్’ చిత్రంలో కీలక పాత్ర పోషించాను. మొదట నటించడానికి చాలా సంకోచించాను. అయితే దర్శకుడు రోహన్ సేథి... ‘కంగారు పడాల్సిందేమీ లేదు. నువ్వు చేయగలవు. భర్త, పిల్లలతో విసుగెత్తిన తల్లి పాత్ర ఇది’ అని చెప్పాడు. దాంతో ఈ రోల్ నాకంటే ఎవరూ బాగా చేయలేరనే ధైర్యం వచ్చింది. ఎందుకంటే అది నా జీవితానికి దగ్గరగా ఉంది. కథ కూడా సరదాగా సాగిపోతుంది. ఏదేమైనా... నటించడం నాకు ఒక మంచి అనుభూతిని ఇచ్చింది.
అదొక్కటే తేడా...
కెవిన్ హార్ట్ ‘ఐ కాన్ట్ మేక్ దిస్ అప్: లైఫ్ లెసన్స్’ పుస్తకం చదివాక అనిపించింది... తనదీ, నాదీ దాదాపు ఒకటే కథ అది. కాకపోతే అతనిది అమెరికాలోని పేదరిక నేపథ్యం. నాది... భారత్‌లోని ఒక సంపన్న కుటుంబం. అయితే అతడిని వాళ్లమ్మ మార్గదర్శిగా ముందుండి నడిపించింది. మరి నేను..! నా మార్గాన్ని నేనే నిర్మించుకుని... ఒక్కో అడుగూ వేసుకొంటూ ముందుకు సాగాను. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు... అందులోని ఒక్కో అక్షరం నాలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. నేనేంటో, నా బలమేంటో నాకు ఒక స్పష్టతనిచ్చింది. దానికి మా పిల్లల ప్రోత్సాహం తోడైంది. దాని ఫలితమే ఇవాళ ఇన్ని లక్షల మందిని నిత్యం నవ్విస్తోంది. ఒక గృహిణిగా, ముగ్గురు పిల్లల తల్లిగా ఇది నేను సాధించిన విజయం.’’
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..
Updated Date - May 01 , 2025 | 09:24 AM