Training Tips: జిమ్‌కి వెళుతున్నారా...
ABN, Publish Date - Jun 23 , 2025 | 05:31 AM
వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కండరాలు బలోపేతమవుతాయి. క్రమం తప్పకుండా రోజూ జిమ్‌కి వెళ్లి గంటసేపు వ్యాయామం చేస్తే బానపొట్ట తగ్గుతుంది. అదనపు క్రొవ్వులు కరిగి శరీరం...
వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కండరాలు బలోపేతమవుతాయి. క్రమం తప్పకుండా రోజూ జిమ్‌కి వెళ్లి గంటసేపు వ్యాయామం చేస్తే బానపొట్ట తగ్గుతుంది. అదనపు క్రొవ్వులు కరిగి శరీరం చక్కని ఆకృతి సంతరించుకుంటుంది. శరీర దారుఢ్యం పెరుగుతుంది. అలాగని జిమ్‌లో గంటలతరబడి గడపడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ట్రైనర్ సూచనల ప్రకారం మంచి పోషకాహారం తీసుకుంటూ నియమానుసారం వర్కౌట్లు చేయడం మంచిదని సూచిస్తున్నారు. రోజూ జిమ్‌కి వెళ్లేవారు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే...
జిమ్‌లో బరువులు ఎత్తేముందు శరీరాన్ని వీలైనంతవరకూ సాగదీయాలి. శ్రమ పడేందుకు సన్నద్ధం కావాలి. వ్యాయామ భంగిమల విషయంలో జాగ్రత్త వహించాలి.
మొదట్లోనే అధిక బరువులు ఎత్తకూడదు. సామర్థ్యానికి తగ్గట్టుగా బరువును ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల జీవక్రియలు మెరుగుపడడమే కాకుండా కండరాల దృఢత్వం పెరుగుతుంది.
వేళ్లు, మణికట్టు, కండరాల్లో నొప్పి వస్తుంటే మాత్రం రెండు రోజులు బరువులు ఎత్తడం ఆపాలి. లేదంటే కండరాలు దెబ్బతినవచ్చు.
రోజూ వ్యాయామం చేస్తూ ఉంటే కండరాలు, శరీరం అలసిపోతాయి. కాబట్టి వారానికి ఒక రోజు జిమ్‌కు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలి.
వ్యాయామం చేసేటప్పుడు శ్వాస ఆపడం లేదా బిగపట్టడం చేయకూడదు. వేగంగా శ్వాస పీల్చడం, వదలడం ద్వారా శరీరానికి ఆక్సిజన్ అంది శక్తి సమకూరుతుంది.
శరీరంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడానికి, సన్నని కండరాలకు బలాన్ని అందించేందుకు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లు, పాలు, బాదం, పెసలు, శనగలు, బఠానీలు, బీన్స్, తాజా పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా తినాలి.
చేతి వ్రేళ్లలో వాపు, నొప్పి, కీళ్ల కదలికల్లో ఇబ్బందులు ఏర్పడితే తక్షణమే వైద్యుని సంప్రదించాలి.
Updated Date - Jun 23 , 2025 | 05:34 AM