ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Social Media Activist: నిజం... నిర్భయంగా

ABN, Publish Date - Jun 23 , 2025 | 05:43 AM

మన ఆశయం గొప్పదైతే... ఏ మార్గంలో వెళ్లినా దాన్ని సాధించగలుగుతాం. ఇది నేను నమ్మిన సిద్ధాంతం. మన చుట్టూ ఎన్నో సమస్యలు. సామాజిక రుగ్మతలు. ఎవరో వచ్చి ఏదో చేయలేదని నిందిస్తూ కూర్చొనేకంటే..

ఇన్‌స్టా రీల్స్‌... యూట్యూబ్‌ షార్ట్స్‌... ఈ వేదికలపై సాధారణంగా మనకు కనిపించేవి వినోదాత్మక వీడియోలే. కానీ కావ్యా కర్ణాటక్‌... సగటు కంటెంట్‌ క్రియేటర్లకు భిన్నం. ఆమె అరచేతిలో సెల్‌ఫోన్‌... సమస్యలపై స్పందించే ఒక గళం. సామాజిక అంశాలను ప్రపంచం ముందుంచి... వ్యవస్థను మేల్కొలిపే సాధనం. నిత్యం ప్రజాప్రయోజన అంశాలతో... లక్షలమందిని ఆలోచింపచేస్తున్న 27 ఏళ్ల కావ్య కథ ఇది...

‘‘మన ఆశయం గొప్పదైతే... ఏ మార్గంలో వెళ్లినా దాన్ని సాధించగలుగుతాం. ఇది నేను నమ్మిన సిద్ధాంతం. మన చుట్టూ ఎన్నో సమస్యలు. సామాజిక రుగ్మతలు. ఎవరో వచ్చి ఏదో చేయలేదని నిందిస్తూ కూర్చొనేకంటే... మనమే ఒక అడుగు ముందుకు వేస్తే వాటికి పరిష్కారం లభిస్తుంది. అందుకు తొలి అడుగు నాదే కావాలని కోరుకున్నాను. దాన్ని ఒక బాధ్యతగా భావించి... అందుబాటులో ఉన్న మాధ్యమాన్ని సాధనంగా ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. అలా మొదలైందే ఇన్‌స్టాగ్రామ్‌లో నా ‘ఎట్‌ ద రేట్‌ కేకే.క్రియేట్‌’ పేజీ. కొంత కాలం తరువాత మరింతమందికి చేరువ అవ్వాలనే ఉద్దేశంతో ‘ఎట్‌ ద రేట్‌ కేకే.క్రియేట్‌. ఒరిజినల్‌’ పేరిట యూట్యూబ్‌లో కూడా ఒక చానల్‌ ప్రారంభించాను.

ఢిల్లీ నుంచి ముంబయికి...

నేను డిగ్రీ వరకు ఢిల్లీలోనే చదువుకున్నాను. అక్కడి ‘లేడీ శ్రీరామ్‌ కాలేజీ’లో గ్రాడ్యుయేషన్‌ తరువాత ముంబయికి వెళ్లాను. అందుకు ప్రధాన కారణం... మీడియా అండ్‌ కల్చరల్‌ స్టడీస్‌లో మాస్టర్స్‌ చేయాలని. ‘టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌’ (టీఐఎస్‌ఎస్‌)లో చేరాను. 2018లో మాస్టర్స్‌ పూర్తయింది. చదువుకొనే సమయంలో ముంబయిలోని దేవ్‌నార్‌ ప్రాంతాన్ని సందర్శించాను. ఆసియాలోనే అతిపెద్ద డంపింగ్‌ యార్డ్‌ అది. చూస్తే మతి పోయింది. ఆ ప్రాంతంలో ప్రజలు ఎలా నివసిస్తున్నారు? వాళ్ల ఆరోగ్యం ఏమైపోతుంది? కాసేపు అక్కడ ఉంటేనే దుర్గంధంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. అలాంటిది ఏళ్లుగా అదేచోట జీవించేవారి పరిస్థితి ఏంటని ఆలోచిస్తే నాకు నిద్ర పట్టలేదు.

తిరిగి వచ్చాక...

మాస్టర్స్‌ అయిపోగానే తిరిగి ఢిల్లీకి వచ్చేశాను. కానీ దేవ్‌నార్‌ డంపింగ్‌ యార్డ్‌ ప్రాంతం ఎప్పుడూ నా మదిలో మెదులుతూనే ఉండేది. ఇది అతి పెద్ద సమస్య. దీన్ని ప్రపంచం ముందు పెట్టాలని అనుకున్నాను. ఒకసారి వెళ్లి ఓ పావుగంట వీడియో తీసి పోస్ట్‌ చేస్తే సరిపోదు. అక్కడి దుస్థితి, దానివల్ల దయనీయంగా మారిన నివాసితుల జీవితాలు, భవిష్యత్‌ తరాలపై ప్రభావం... ఇలా అన్ని కోణాల్లో ఒక సిరీస్‌లా రూపొందించాలని అనుకున్నా. పన్నెండు అంతస్తుల ఎత్తులో కొండలా పేరుకుపోయిన చెత్తకుప్పలు... వాటి మధ్యన ఉన్న ఇళ్ల మీదుగా ప్రవహిస్తున్న మురుగు కాలువలు... ఇదీ తొలి వీడియో. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తే కొద్ది రోజుల్లోనే పది లక్షలమందికి పైగా వీక్షించారు. చాలామంది తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. ఆ ప్రాంతంలో నివసించేవారి ఆరోగ్యం ఏమైపోతుందోనని ఆందోళన చెందారు. అంటే నా కంటెంట్‌ ప్రజలకు చేరుతోంది. మార్పుకు అదే తొలి అడుగుగా భావించాను.

ఉద్యోగం వదిలి...

మాస్టర్స్‌ తరువాత ఓ కంపెనీలో వీడియో ప్రొడ్యూసర్‌గా చేసేదాన్ని. ఉద్యోగం చేస్తూనే దేవ్‌నార్‌ వీడియో తీశాను. అనూహ్య స్పందన రావడంతో ఇక పూర్తి సమయం ఇలాంటి సామాజిక అంశాలపైనే కేటాయించాలని నిర్ణయించుకున్నాను. ఉద్యోగం మానేశాను. రెండున్నరేళ్ల కిందట ‘కేకే క్రియేట్‌’ పేరిట సొంతంగా చిన్నపాటి కంపెనీ ఒకటి ప్రారంభించాను. అందుకోసం దాచుకున్న డబ్బు ఖర్చు పెట్టాను. ఆరంభంలో ఎన్నో సవాళ్లు. ఉద్యోగం వదిలేసే నాటికి నా చేతిలో ఉన్నది పదహారు వేల మొబైల్‌ ఫోన్‌, నలభై రూపాయల గ్రీన్‌ స్ర్కీన్‌, మూడు నెలల జీతం. కానీ ధైర్యం చేశాను. దేవ్‌నార్‌ ప్రాంతం సిరీస్‌కు అన్ని వర్గాల నుంచీ స్పందన, అభినందనలు అందాయి. అవి నాకు మరింత ప్రేరణనిచ్చాయి.

అసలు ఊహించలేదు...

సామాజిక అంశాలే ప్రధానాంశంగా, సూటిగా, సుత్తి లేకుండా నేను ఇచ్చే కంటెంట్‌కు క్రమంగా వీక్షకులు పెరిగారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 27 లక్షలమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. యూట్యూబ్‌ చానల్‌ను 32 లక్షలమంది సబ్‌స్ర్కైబ్‌ చేశారు. ఇంత తక్కువ సమయంలో అంతటి ఫాలోయింగ్‌ నేను అస్సలు ఊహించలేదు. ఆ స్ఫూర్తితో కేవలం దీన్ని ఒక కంటెంట్‌ అందించే వేదికగా కాకుండా... ఒక ప్రజాప్రయోజన మాధ్యమంగా మార్చాలని అనుకున్నాను. భౌగోళికమైన అంశాలతో పాటు, ప్రజల జీవన స్థితిగతుల మీద కొన్ని వీడియోలు చేశాను. తరువాత దేశంలోని అన్ని రాష్ట్రాలూ తిరిగి, అక్కడి ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టాలన్నది మరో లక్ష్యం.

ఫోర్బ్స్‌ జాబితాలో...

నిర్దేశించుకున్న లక్ష్యానికి తగ్గట్టు పని భారం కూడా పెరగడంతో, సహాయంగా ఒకరిద్దరిని తీసుకొందామని భావించాను. అలా మొదలై... ఇప్పుడు మాది పద్దెనిమిది మంది బృందం అయింది. వారందరికీ నేను జీతం ఇవ్వగలుగుతున్నాను. ఒకరిపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగాను. నాలాంటి మరికొంతమంది యువతకు ఉపాధి అవకాశం కల్పించగలిగాను. నిజంగా ఇది నాకు ఎంతో సంతృప్తినిచ్చే అంశం. సమస్యలపై పోరాడుతూనే, ఆదాయంపైనా దృష్టి పెట్టాను. కొన్ని విద్యా సంస్థలతో కలిసి పని చేస్తున్నాను. మా వీడియోలు చూసేవారిలో కొందరు స్వచ్ఛందంగా చందాలు పంపుతున్నారు. వారందరి సహకారంతో విజయవంతంగా సంస్థను నడిపించగలుగుతున్నా. ప్రముఖ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ ఇండియా ప్రకటించిన 2025- ‘30 అండర్‌ 30’ జాబితాలో నాకు చోటు దక్కింది. ఈ ఘనత మా తల్లితండ్రులకు కూడా దక్కుతుంది. నాన్న బీఎస్‌ఎఫ్‌ జవాను. అమ్మ టీచర్‌. వారి ప్రోత్సాహమే లేకపోతే నాకు ఇదంతా సాధ్యమయ్యేది కాదు.’’

ప్రతిఘటన ఎదురైనా...

జార్ఖండ్‌లోని జడుగోడా పట్టణానికి వెళ్లినప్పుడు మాకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అక్కడ అణు వ్యర్థాల డంపింగ్‌ జరుగుతోంది. దానివల్ల ఆ పట్టణంలో ప్రతిఒక్కరూ ఏదోఒక వైకల్యంతో బాధపడుతున్నారు. దుర్భరంగా మారిన వారి కథలు రికార్డు చేస్తుంటే... మమ్మల్ని జాతి వ్యతిరేక శక్తులని నిందించారు. వీడియోలు తీయవద్దని వారించారు. కానీ నిజంగా బాధపడుతున్నది స్థానిక ప్రజలు. మేం చెప్పాలనుకున్నది వారి నిజ జీవిత కథలు. అర్థం చేసుకొని కొందరు మాకు మద్దతుగా నిలిచారు. వారి సహకారంతో షూటింగ్‌ పూర్తి చేయగలిగాం. ఇలాంటి అనుభవాలు తరచూ ఎదురవుతూనే ఉంటాయి. అయితే వాస్తవాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెట్టడానికి వెనుకాడను.

Updated Date - Jun 23 , 2025 | 05:48 AM